- వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల పునరుద్ధరణ
- వైసీపీ పన్నులు తినేసి చెత్త వదిలేసింది..
- 83లక్షల టన్నుల చెత్తను క్లీన్ చేయాలి
- వచ్చే జూన్‌నాటికి క్లీన్ స్టేట్ ఆవిష్కరణ
- అదనంగా 7.5 లక్షల ఇళ్లకు అమృత్ కుళాయిలు
- అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
- మునిసిపల్ శాఖపై చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తిచెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి… చెత్త తొలగించని కారణంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మిగిలిందని… దీన్ని వచ్చే జూన్‌నాటికి పూర్తిగా తొలగించాలని సీఎం సూచించారు. వేస్ట్ టు ఎనర్జీ, చెత్తనుంచి సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం అధికారులను ఆదేశించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ పక్కాగా జరగాలని…. ఆ మార్పు రాష్ట్రంలో ప్రతిచోటా కనిపించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే గాంధీ జయంతినాటికి సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాడిలో పడాలన్నారు. రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఇప్పటికే వెలుగుచూసిన ఘటనపై మరింత సమాచారం సేకరించడంతో పాటు… ఇతర కార్పొరేషన్లలో జరిగిన అక్రమాలను సైతం బయటకు తీయాలన్నారు. అర్బన్ లోకల్ బాడీలలో మొత్తం 50 లక్షల గృహాలు ఉండగా… ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్లకు నీటి కుళాయి సౌకర్యం ఉందని…. మరో 7.5 లక్షల ఇళ్లకు అమృత్ పథకం కింద కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే అమృత్ పథకం ద్వారా మరో 7.5 లక్షల ఇళ్లకు కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చేలా పనులు పూర్తి చెయ్యాలని సీఎం సూచించారు. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు, ఇతర ప్రక్రియ వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అదేవిధంగా టిడ్కో ఇళ్ల ప్రాజెక్టు స్థితిగతులపైనా అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేసేందుకు అవసరమై నిధుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుందామని సీఎం అన్నారు. పట్టణ ప్రాంతంలో ఇంకా ఇళ్ల నిర్మాణం ఏమేర చేపట్టాలి… లబ్దిదారులు ఎందరు ఉంటారు అనే విషయంలో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వేస్ట్ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్ వంటి విభాగాల్లో డ్రోన్లను సమర్థవంతంగా ఉపయోగించుకుని ఫలితాలు రాబట్టాలని సీఎం సూచించారు. పిపిపి పద్ధతిలో పార్కులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం సూచించారు.