- పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామం
- మా విధానాలు ఉభయ తారకం..
- పారిశ్రామికవేత్తలతో మంత్రి భేటీ
- రైతుల సంక్షేమంపై సుదీర్ఘ చర్చ
- న్యూయార్క్‌లో కొండపల్లి పర్యటన
అమరావతి (చైతన్య రథం): ఎన్డీయే పాలనలోవున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామమని ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టి సంస్థలు నెలకొల్పేందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. అమెరికాలోని న్యూయార్కులో పలుదేశాలకు చెందిన వాణిజ్య, ఎన్జీవో సంస్థలకు (యుకె, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ మొదలైనవి) చెందిన ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్, ములగో ఫౌండేషన్స్ సీఈవో కెవిన్ స్టర్, బియాండ్ నెట్ జీరో చైర్మెన్ లార్డ్ జాన్ బ్రౌన్ తదితరులతో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన మంత్రి కొండపల్లి.. రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని వివరిస్తూ.. భవిష్యత్‌లో విస్తరించనున్న వ్యాపార అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా వివిధ వాణిజ్య, పెట్టుబడి అవకాశాలపై ప్రతినిధులతో చర్చించారు.
రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టాల్సిన కార్యాచరణను ప్రధానంగా చర్చించారు. పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా సాగుతుందన్నారు. ఈ దశలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన ఆదాయాన్ని, అభివృద్ధిని సాధించవచ్చని సంస్థల ప్రతినిధులకు మంత్రి కొండపల్లి వివరించారు. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో మంత్రి ప్రస్తావించిన అంశాలపట్ల వివిధ సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
సర్ క్రిస్టోఫర్ ఆంథోనీతో కొండపల్లి చర్చ
బ్రిటీష్ బిలియనీర్, హెడ్జ్ ఫండ్ మేనేజర్, సంఘసేవకులు, యాక్టివిస్ట్, ఇన్వెస్టర్ సర్ క్రిస్టోఫర్ ఆంథోనీతో న్యూయార్క్‌లో మంత్రి కొండపల్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో కర్భన ఉద్గారాల నియంత్రణలో భాగంగా నిరుపేద మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టుకు సాయం చేయాలని సర్ క్రిస్టోఫర్‌ను ఒప్పించారు. రాష్ట్రంలో పారిశ్రామిక పరిస్థితులను అర్థం చేసుకున్న సర్ క్రిస్టోఫర్ ఆంథోనీ ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయడానికి ఆసక్తి కనబర్చారు. సమావేశంలో రోజురోజుకు పెరుగుతున్న కర్బన ఉద్గారాల పెరుగుదల, తద్వారా వస్తున్న వాతావరణ మార్పులు, ఉద్గారాలను తగ్గించటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించి సానుకూల దృక్పదాన్ని తేగలిగారు. రాష్ట్రానికి సహాయం అందించేందుకు సర్ క్రిస్టోఫర్ ఆంథోనీ సానుకూలంగా స్పందించడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.