- మేనిఫెస్టో కమిటీ తొలిభేటీలో పలు అంశాలపై లోతైన చర్చలు
- 11 అంశాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో కసరత్తు
- మహాశక్తి పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా
- సమాజంలో అసమానతల తొలగింపు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం
- యువతకు ఉపాధి, సాగుకు సాయం
- అన్ని వర్గాలకూ మేలు చేసేలా ప్రతిపాదనలు
అమరావతి: సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా టీడీపీ-జనసేన ముందుకు సాగనున్నాయి. టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన రెండు పార్టీల మేనిఫెస్టో కమిటీ తొలి భేటీలో ఈ మేరకు చర్చ జరిగింది. సమావేశంలో జనసేన ప్రతిపా దించిన ఐదు అంశాలను చేరుస్తూ 11 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించారు.సమావేశంలో టీడీపీ నుండి యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్‌బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు పాల్గొనగా.. జనసేన తర పున ముత్తా శశిధర్, డీ వరప్రసాద్, ప్రొఫెసర్ కే శరత్ కుమార్‌లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రెండు పార్టీలనేతలు కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలుగు దేశం – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పని సరిగా అమలవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పిం చే పథకాల ద్వారా యువతకు నమ్మకం కలిగించి ధైర్యం చెప్పే అంశాలను మినీ మేనిఫెస్టోలో ప్రతిపా దించామన్నారు. ఈ సందర్భంగా యనమల రామ కృష్ణుడు మాట్లాడుతూ… ఇది కేవలం ప్రాథమిక సమా వేశం మాత్రమే అన్నారు. గతంలో ‘బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో సూపర్ సిక్స్ అనేదానిపై ప్రచారం చేస్తున్నాం. అనంతరం టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. రాజమండ్రిలో పవన్, లోకేష్‌లు హాజరు కాగా జాయింట్ యాక్షన్ కమిటీి తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలని నిర్ణయించారు. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఏర్పా టైన కమిటీలో రెండు పార్టీలకు సంబంధించిన ఆరు గురిని ఎంపిక చేశారు. గతంలో టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించగా. జనసేన కూడా కొన్ని ప్రతిపాదనలు ఇస్తామని చెప్పింది. అవి కూడా కలిపితే బాగుంటుందని అనుకున్నాం. టీడీపీ ప్రతిపాదించిన 6 అంశాలు, జనసేన ప్రతిపాదించిన 5అంశాలు.. కలిపి ముసాయి దా మినీ మేనిఫెస్టోగా తయారు చేశాం. దీనిని అధినేతల ఆమోదానికి పంపిస్తాము. ఇందులోని ప్రతిపాదనలు చాలావరకు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవే. సమాజంలో అసమానతలు తొలగాలనేదే ఈ మినీ మేనిఫెస్టో ఉద్దేశం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని యనమల చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని, రైతులకు మేలు జరగాలని, అన్ని రంగాల్లో ప్రజలు మహాశక్తివంతులవ్వాలని భావిస్తున్నామన్నారు.
జనసేన తరపున ముత్తా శశిధర్ మాట్లాడుతూ…
మంచి వాతావరణంలో టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. వైనాట్ 175 అంటూ జగన్ రెడ్డి చెప్తుంటే.. ప్రజలు ఎందుకు వైసీపీకి 151 సీట్లు ఇచ్చామా అని నవ్వుకుంటున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండానే మొత్తం అమలు చేశామని ప్రజలను మోసగించడమే కాకుండా మేనిఫెస్టో విధానాన్నే అపహస్యం చేస్తున్నారు. మహానాడులో టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు గత నాలుగు సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాటాల్లో పాల్గొన్న సమయాల్లో కొన్ని వర్గాల నుంచి, వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులు, పేదల ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు జనసేన పార్టీ కూడా ఆరు ప్రతిపాదనలు కమిటీ ముందుంచింది. సంపన్న ఆంధ్రప్రదేశ్, అమరావతే రాజధాని, ఉచిత ఇసుక ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడం.. పేదలకు ఇళ్లు నిర్మించడం, జనసేన సౌభాగ్యపథం ద్వారా నిరుద్యోగ యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసి ఎక్కడికక్కడ ఉద్యోగాలు కల్పించడం, వ్యవసాయాన్ని భాగ్యపథంగా తీసుకెళ్లడం ద్వారా రైతులు, కౌలు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం, మన ఆంధ్రప్రదేశ్-మన ఉద్యోగాలు అనే ఆరు ప్రతిపాదనల్ని ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో వివరించాము. మేం ప్రతిపాదించిన కొన్ని అంశాలు టీడీపీ ప్రతిపాదించిన అంశాల్లోనూ ఉన్నాయి.
రాష్ట్రంలో ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాల కార్మికులు ఉపాధి కోల్పోయారు. యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా జనసేన-టీడీపీ ముందుకు సాగుతాయి. రణభేరి సమావేశాల్లో, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ యువతకు కొన్ని హామీలు ఇచ్చారు. వారిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తానన్నారు. పలు ప్రాంతాల్లో పరిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖ ప్రాంతంలో పారిశ్రామికవాడలు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని పెంపొందించడం, ఆక్వా కల్చర్, పుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామన్నారు. తిరుపతి ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా చేసి రాష్ట్రంలోని యువతకు నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు సిద్ధం చేశాము. వీటిని మా పార్టీ నేతలు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌కి పంపిస్తాము. రానున్న రోజుల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను తయారు చేసి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. రాష్ట్రంలో యువత బంగారు భవిష్యత్తుకు ధైర్యం చెప్పబోతున్నాం. అన్ని సామాజిక వర్గాలను, కలుపుకొని అందరికీ చేయూతనిచ్చే విధంగా టీడీపీ-జనసేన మేనిఫెస్టో రూపొందిస్తామని శశిధర్ చెప్పారు.