- జగన్‌కు ఆస్తులపైనేగాని ప్రజలపై ప్రేమ లేదు
- ఉత్తరాంధ్ర సాగునీటి రంగాన్ని నాశనం చేశాడు
- ఇప్పుడు గులకరాయి డ్రామా మొదలెట్టాడు
- తప్పులు చేసి నెపం నెట్టడంలో జగన్ దిట్ట
- అధికారంలోకి రాగానే భోగాపురంపై దృష్టిపెడతా
- మూతబడిన పరిశ్రమలను తెరిపించి ఉద్యోగాలిస్తా
- ఫస్ట్ టైం ఓటర్లు కూటమినే బలపర్చాలి..
- కూటమితోనే ఉత్తరాంధ్ర సంపూర్ణ అభివృద్ధి
- రాజాం ప్రజాగళంలో చంద్రబాబు ఉద్ఘాటన
రాజాం (చైతన్యరథం): జగన్‌రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలపై ప్రేమ లేదు. ఇక్కడి భూములపైనే అతని ప్రేమంతా. వేదికనుంచి సూటిగా అడుగుతున్నా, ఉత్తరాంధ్రలో బీసీలు లేరా? ఈ ప్రాంతంపై రెడ్ల పెత్తనమేంటి? విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పక్కడివాళ్లు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా సోమవారం రాజాం సభలో చంద్రబాబు మాట్లాడారు. బీసీలను జగన్ దగా చేశాడని అంటూ, టీడీపీ బీసీలకు ఇచ్చిన 30 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ద్రోహి అని నిందించారు. సాధారణ కార్యకర్తలను అసాధారణ నాయకులు చేయాలన్నది తన పార్టీ సిద్ధాంతంగా చెబుతూ, సామాన్యుడైన అప్పలనాయుడిని ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టామని, ఆయనను గౌరవించడం అంటే విజయనగరాన్ని గౌరవించినట్టేనన్నారు. జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిల బోడి పెత్తనాలు విజయనగరంలో చెల్లవని చంద్రబాబు తెగేసి చెప్పారు. విజయనగరం జయకేతనం చూపిస్తుంటే, వైసీపీపై విశాఖ విరుచుకుపడుతుందని, కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధమైన ఉత్తరాంధ్ర ఉత్సాహం చూస్తుంటే.. ఎన్డీయే 35 స్థానాల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర బాగుపడాలంటే నీళ్లు కావాలని, అదే సమయంలో మౌలిక సదుపాయాలు కల్పించుకుని పిల్లలను చదివించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని చంద్రబాబు అన్నారు.
సాగునీటి రంగాన్ని నాశనం చేసిన జగన్
టీడీపీ 5 ఏళ్లల్లో ఉత్తరాంధ్ర జలవనరుల ప్రాజెక్టులకు 1600 కోట్లు వెచ్చిస్తే, జగన్‌రెడ్డి 594 కోట్లే ఖర్చు చేశాడని చెబుతూ, ఉత్తరాంధ్ర సాగునీటి రంగాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు జలాలివ్వాలన్న కలను జగన్‌రెడ్డి నాశనం చేశాడన్నారు. తెదేపా, వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులను వివరిస్తూ సుజల స్రవంతికి మనం రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టాం. జగన్‌రెడ్డి 5 ఏళ్లల్లో రూ.5 కోట్లే వెచ్చించాడు. తారక రామతీర్ధసాగర్ ప్రాజెక్టుకు టీడీపీ రూ.284 కోట్లు ఖర్చు పెడితే, జగన్ రూ.76 కోట్లకు పరిమితమయ్యాడు. మహేంద్రతనయ ఆఫ్ షోర్‌కి టీడీపీ రూ.553 కోట్లు ఖర్చుపెడితే, జగన్ ఖర్చుపెట్టింది కేవలం రూ.26 కోట్లు. తోటపల్లికి రూ.237 ఖర్చుపెడితే, జగన్‌రెడ్డి గజపతి బ్రాంచి కెనాల్‌తో కలిపి పెట్టిన ఖర్చు రూ.61 కోట్లు. వంశధార ఫేజ్ 2కి రూ.420 కోట్లు, వంశధార నాగావళి అనుసంధానానికి రూ.145 కోట్లు ఖర్చుపెడితే, రెండు ప్రాజెక్టులకూ జగన్ పైసా విదల్చలేదు. సొంత నీలిపత్రిక సాక్షికి, సలహాదారులకు దోచ్చిపెట్టిన సొమ్ములు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు వెచ్చించివుంటే `జలవనరులు పుష్కలంగా అంది ఉండేవని చంద్రబాబు అన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ అన్యాయం
ఉత్తరాంధ్ర గడ్డమీద పుట్టిన జీఎంఆర్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టు బాధ్యతలు అప్పగించానని, హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంతో అనుసంధానమైందని బాబు గుర్తు చేశారు. అలాగే ఈ ప్రాంతంలోను 2.7వేల ఎకరాలు సేకరించి బోగాపురం ఎయిర్ పోర్టు తెచ్చామన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చివుంటే 2020నాటికి పూర్తయ్యేదని, ఈ ప్రాంతానికి పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. ‘కాని తిక్కలోడు రివర్స్‌చేసి టెండర్ మళ్లీ పిలిచాడు. మళ్లీ శంకుస్థాపన చేశాడు. భోగాపురం పూర్తి కాకపోవడానికి జగనే కారణం. జగన్ మతిస్థిమితం లేని మానసిక రోగి’ అని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసింది ముమ్మాటికీ జగనేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు దగ్గరలో 550 ఎకరాలతో గిరిజన వర్శిటీని ప్లాన్ చేస్తే, జగన్ రివర్స్ టెండరింగ్‌తో ఎక్కడికి వెళ్లిందో తెలీడం లేదన్నారు. భావనిపాడు పోర్టుకు శంకుస్థాపన చేసి టెండర్లు పిలిస్తే, డబ్బులకు కక్కుర్తిపడి జగన్ వేరే వాళ్లకు టెండర్లు అప్పగించాడన్నారు.
టీడీపీ చేపట్టిన పనులు పూర్తైవుంటే ఈ ప్రాంతం హైదరాబాద్ కంటే మెరుగ్గా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. వైసీపీ కబ్జాలతో విశాఖ విలవిల్లాడిరదని దుయ్యబట్టారు. తాను ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తెస్తే, జగన్ భూసెటిల్‌మెంట్లు తెచ్చాడన్నారు. తాను విశాఖకు వాణిజ్య రాజధానిగా చేస్తే, జగన్ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా చేశాడన్నారు. టీడీపీ హయాంలో ఆదానీ, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలను తెస్తే జగన్ తరిమేశాడన్నారు. టీడీపీ హాయంలో మెడ్‌టెక్ జోన్ వచ్చి, దేశంలోనే మెడికల్ పరికరాలు తయారు చేసే కేంద్రంగా తయారయ్యిందని, 10వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. దాన్నీ మూతస్థితికి తేవాలని చూశాడని, కేంద్రం అడ్డుపడటంతో ఆగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు నా కుటుంబం అండగా ఉంది
పేదలకు జరగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు నాకుందని చంద్రబాబు అన్నారు. అలా ప్రశ్నిస్తున్నందుకే తనపై వైసీపీ దాడులకు తెగబడుతుందన్నారు. జగన్‌పై గులకరాయి పడితే తెలుగు జాతిపై దాడిగా సజ్జల అభివర్ణిస్తున్నాడు. నాపైన రాళ్లు రువ్వినపుడు ఆ ఇంగితం ఏమైంది అని ప్రశ్నించారు. ‘ఏరోజూ నా భార్య బయటకు రాలేదు. అసెంబ్లీలో అలాంటి వ్యక్తిపై నిందలు వేశారు. ఒక ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. నన్ను వైసీపీ ఇబ్బందులకు గురి చేసినపుడు చూసి తట్టుకోలేక 203 మంది ప్రాణాలు వదిలారు. అలా ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు నా కుటుంబమే అండగా ఉంది. ‘నిజం గెలవాలి’ కార్యక్రమం తీసుకుని రాష్ట్రమంతా తిరిగి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. పిల్లలను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌లో చదివిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తంమ్మీద 9079 కిలోమీటర్లు తిరిగి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు. నేను జైల్లో ఉన్నప్పుడు వారానికి రెండురోజులు ములాఖాత్ ఇస్తే నా కుటుంబమే నాలో ధైర్యాన్ని నింపిందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలన్నదే కోరిక
ఏపీ డ్రైవర్ సీబీఎన్ అని చంద్రబాబు ఉత్సాహంగా ప్రకటించారు. 14ఏళ్లు సమర్థ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపిస్తే, జగన్ ఐదేళ్లలో సర్వనాశనం చేశాడని అంటూ, నష్టపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్నదే తన ఆశయమని చంద్రబాబు వివరించారు. ప్రజలంటే అభిమానం, బాధ్యతవున్న పవన్‌కల్యాణ్ నా ఆశయానికి బలమయ్యారని, ఎన్ని రకాలుగా వైసీపీ ఇబ్బందులు పెట్టినా మడమ తిప్పని నాయకుడిగా నిలబడ్డాడని ప్రశంసించారు. నరేంద్ర మోదీనే మూడోసారి ప్రధాని అవ్వబోతున్నారని అంటూ, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళుతున్నాం. మోదీ గ్యారెంటీ స్కీంలు, టీడీపీ సూపర్ పథకాలు ప్రజల్లో వెలుగులు నింపడం ఖాయం, ప్రజా కూటమి గెలవడం ఖాయమన్నారు. గతానికి మించి మెరుగైన పాలనతో రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఫస్ట్ టైం ఓటర్ల ఓటు కూటమికే
ఫస్ట్ టైం ఓటర్లు జాగ్రత్తా? మీ ఓటు కూటమికి వస్తే అప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ భవిష్యత్ బాగుంటుందని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 25 లక్షల ఉద్యోగాలిస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టును ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం. రూ.3వేలు నిరుద్యోగ భృతిని ఇస్తాం. ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున ఎంత మందివుంటే అందరికి ఇస్తాం, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్ధులుంటే ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున అందరికీ ఇస్తాం. వంట గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. కేంద్రం సహాకారంతో డ్వాక్రా సంఘాల అభివృద్ధి చేసి ఆడబిడ్డలను లక్షాధికారులను చేసే బాధ్యత తనదన్నారు. అలాగే ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తామని, ప్రతి పేదవాడికి రూ.4వేల పింఛన్, ఏప్రిల్ నుంచి అమలు చేస్తామన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు. పేదవాళ్లను ఆదుకోవడానికి కేంద్రం గరీబీ కింద రేషన్ బియ్యం కొనసాగిస్తుందన్నారు. వాలంటీర్ల జీతాలు రూ.10వేలు చేసామని, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఒక్కొక్కరు లక్షలు సంపాదించే మార్గం చూపిసానన్నారు.
రాష్ట్రాన్ని నేరాలకు అడ్డాగా మారుస్తున్నారు
గులకరాయి తగిలిందని జగన్ డ్రామా మొదలెట్టాడని, విద్యుత్ నేనే తీయించినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బాబాయ్‌ని గొడ్డలి వేటు వేసి గుండెపోటు అని నాటకాలాడాడన్నారు. తాను చేసిన నేరాలను వేరే వాళ్లపై తోసేసే దిట్ట. బాధితులను నిందితులుగా చేసి జైల్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేరాల అడ్డగా మారుస్తారా? రాజాంని పులివెందులుగా మారుస్తారా? నాగావళిలో ఇసుక దొరుకుతుందా? ఎమ్మెల్యే జోగులు, ఎమ్మెల్సీ విక్రాంత్, జడ్పీ ఛైర్మన్ చిన్నశీనులు దోచుకున్నారు. నేరగాళ్లను, దోపిడీగాళ్లను ఎన్నికల్లో తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మూతపడిన పరిశ్రమలను తెరిపించి ఉద్యోగాలిస్తాం
పాలకొండ రోడ్డు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతానని, రాజాంకు ఔటర్ రింగ్ రోడ్డు తీస్తుకుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మూతబడిన పరిశ్రమలను తెరిపిస్తాం. టిడ్కో ఇళ్లను వెంటనే ఇస్తాం. పేదవాళ్ల అందరికి 2 సెంట్ల భూమిని ఇప్పిస్తాం. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తాం. ఇప్పుడు జగన్ ఇచ్చిన ఇళ్లను రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తాను. నాగావళి బలసరి రేవుపై వంతన పూర్తి చేస్తా. తోటపల్లి ప్రాజెక్టు కాల్వలు పూర్తి చేస్తాను. జగన్ రద్దుచేసిన సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తానని చెబుతూ, చెట్టుకు పోసిన నీరు ఎలా వృధా కాదో ఎన్డీయేకి వేసిన ఓటూ వృధా కాదు, మీకు ఫలాలిస్తుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.