- వైసిపి నుంచి బయటకెళ్లి జగన్ మోసం చేశాడన్నాడు
- ప్యాకేజి అందగానే జగనంత గొప్పోడు లేడంటున్నాడు
- రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ ధ్వజం
మంగళగిరి: రెండుసార్లు ఆర్కేని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి ఏం చేశారని యువనేత నారా లోకేష్ నిలదీశారు. మంగళ గిరి నియోజకవర్గం చింతలపూడి, మంచికలపూడి, కాటంరాజు కొండూరు రచ్చబండ సభలకు హాజరైన యువనేత ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్కే నియోజకవర్గంలో కనీసం రోడ్లువేయలేకపోయారు. ఇటీవల పార్టీనుంచి బయటకు వెళ్లేటపుడు జగన్ మంగళగిరికి మోసం చేశాడు, నిధులు ఇవ్వలేదన్నాడు. ప్యాకేజి అందగానే మళ్లీ వైసిపిలోకి వచ్చి జగనంత గొప్పోడు లేడంటున్నాడు. రెండునెలల్లో ఏమి మారిపోయింది? టిడిపి అధికారంలో ఉన్నపుడు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆర్కే కేసులు వేసి అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో నేను ఓడిపోయినా ఇక్కడే ఉండి ప్రజలకు సేవచేశా, సొంతనిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశా.
గత ప్రభుత్వంలో మంగళగిరికి ఐటి కంపెనీలను రప్పించా. రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్కే స్థానిక యువతకు ఉద్యోగ,ఉపాథి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా ఫెయిలయ్యాడని లోకేష్ దుయ్యబట్టారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్. జగన్ పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు స్వాంతన చేకూర్చేందుకు బాబు సూపర్ -6 పథకాలను ప్రకటించాం. అధికారంలోకి వచ్చాక పథకాలను అమలుచేసి పేదలకు అండగా నిలుస్తాం.
గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎన్టీఆర్,చంద్రబాబు స్పూర్తితో ప్రజల్లోనే ఉంటూ సేవలందిస్తున్నా, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, గత అయిదేళ్లుగా నేను చేసిన మంచి పనులు చూసి నన్ను ఆశీర్వదించండి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజి, రోడ్ల నిర్మాణం చేపడతాం
చింతలపూడి గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తెస్తూ… గ్రామంలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉంది, పెండిరగ్ లో ఉన్న సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలి, శ్మశానాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ… ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో భూగర్భ డ్రైనేజి ఏర్పాటుచేస్తాం, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం. జగన్ పాలనలో 30లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి 3వేల ఇళ్లు కూడా కట్టలేదు. మేం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని పేదలకు అధునాతన టెక్నాలజీతో 20వేల పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. పెండిరగ్‌లో ఉన్న సిసి రోడ్లు, బిటి రోడ్లతో పాటు గ్రామంలో శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని అటవీ, కొండవాలు ప్రాంతాలు, పోరంబోకు, రైల్వే స్థలాల్లో దశాబ్ధాలుగా నివసిస్తున్న వారికి పట్టాలు అందజేస్తాం. పొలాలకు వెళ్లే పుంతరోడ్లు, చెరువులు అభివృద్ధి చేస్తామని చెప్పారు.
లోకేష్‌ను లక్ష మెజారిటీతో గెలిపించాలి: చిల్లపల్లి
మంచికలపూడిలో జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… రచ్చబండ ద్వారా లోకేష్ గ్రామాలకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమన్నారు. యువనేత లోకేష్ ను లక్ష మెజారిటీతో గెలిపించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేసుకోవాలని కోరారు. మంచికలపూడి గ్రామస్తులు లోకేష్ ఎదుట సమస్యలు చెబుతూ… గ్రామంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, తరచూ రైల్వే గేటు పడుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, దుగ్గిరాల వెళ్లేందుకు బస్ సౌకర్యం లేదు. గ్రామంలో సచివాలయం లేకపోవడంతో మోరంపూడి వెళ్లాల్సి వస్తోంది, ఇళ్లులేని వారికి పక్కా ఇళ్లు నిర్మించాలని కోరారు. యువనేత లోకేష్ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అన్ని గ్రామాల్లో భూగర్భ డ్రైనేజి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. 4నెలల్లో చింతలపూడి,మంచికలపూడి, కొండూరు కలిపే రహదారిని నిర్మాణం చేపడతామని చెప్పారు. మంచికలపూడి సచివాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. మాదిగ కమ్యూనిటీ హాలు, బిసిలకు కళ్యాణ మండపం నిర్మాణాలను కూడా చేపడతామని లోకేష్ హామీఇచ్చారు.
పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతా!
కె.కొండూరు రచ్చబండలో యువనేత లోకేష్
కంఠంరాజు కొండూరు రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతానని, రాష్ట్రం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావ కాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కె.కొండూరు గ్రామస్థులు లోకేష్ కు సమస్యలను విన్నవిస్తూ… తమ గ్రామ సమీపంలోని హైలెవల్ కెనాల్ పై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలి, మహిళల స్వయం ఉపాధికి చర్యలు చేపట్టాలి, పొలాలకు వెళ్లే డొంక రోడ్లు నిర్మించాలి. ఎస్సీ కాలనీల్లొ రోడ్లు, శ్మశాన వాటిక ప్రహరీగోడ, కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలి, ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలు కల్పించాలి, తాగునీటి సమస్య పరిష్కరించాలి, పేదలకు ఇళ్లస్థలాలతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చాక గ్రామస్థులు తన దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని యువనేత భరోసా ఇచ్చారు.