అమరావతి (చైతన్యరథం): గత అయిదేళ్లుగా సీఎం జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని, రాష్ట్రాన్ని రూ.12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్‌ను తాకట్టుపెట్టారన్న వార్త చూసి షాక్‌కు గురయ్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియతో మాట్లాడుతూ.. ఏపీని అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని అంటే ఒంటికాలిపై లేచిన వైసీపీ మేధావులు దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఏపీ సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చడం ఏమాత్రం సరికాదని అన్పిస్తోందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనాకేంద్రాన్ని తాకట్టుపెట్టలేదన్నారు. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయస్థాయిలో మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదని.. మీరైనా చెప్పండి ప్లీజ్!! అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.