- తన ఓటమికి ప్రజలను దోషులుగా నిలబెడుతున్న జగన్ ండ్డి
- ఆత్మ పరిశీలనకు బదులు పరనిందకు పాల్పడుతున్న మాజీ సీఎం
- చెప్పినవన్నీ చేశానంటూ అబద్ధాల కొనసాగింపు
- పేదలకు తాయిలాలిస్తే బానిసలుగా ఉండాలంటూ వితండవాదన
- బటన్ నొక్కాను కదా.. ఇంకా అభివృద్ధి ఎందుకన్న ధోరణి
అమరావతి (చైతన్య రథం): ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ప్రజా తీర్పు వెల్లడై నిన్నటికి 17 రోజులు. తననుంచి ఎంతగానో లబ్ధి పొందిన ప్రజలు.. ముఖ్యంగా పేదలే తన భారీ ఓటమికి కారణమనే రీతిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో ఆవేదన, ఆగ్రహాన్ని బహిరంగంగా వెలిబుచ్చారు. ఎన్నికల తీర్పు నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ నాయకులతో గురువారం జరిగిన సమావేశంలో జగన్‌రెడ్డి మరోసారి అదే ధోరణి కొనసాగించి.. ఎంతటి మోసగాళ్లు ఈ ప్రజలన్న రీతిలో మాట్లాడి రాష్ట్ర ప్రజలను, సొంత పార్టీ నేతలను మరోసారి విస్మయానికి గురిచేశారు.
ఎంతో చేశాను.. ఎందుకు ఓడిరచారు?
లక్షలాదిమంది అవ్వా తాతలకు, అక్క చెల్లెమ్మలకు పింఛన్లు ఇచ్చాను. లక్షలాదిమందికి అమ్మఒడి, విద్యాదీవెన, చేయూత, పక్కా ఇళ్ల నిర్మాణంవంటి పలు పథకాల ద్వారా గత ఐదేళ్లుగా లబ్ధి చేకూర్చాను. అయినా వారు నాపట్ల ప్రేమ చూపలేదు. నాకు ఓటు వేయలేదు. ఎంతటి మోసగాళ్లు.. ఎంతటి నిర్దయులు ఈ ప్రజలంటూ వారిని దోషులుగా నిలబెట్టారు మజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. మున్నెన్నడూ జరగని విధంగా రూ.2.7 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టాను. అయినా వారి ప్రేమలు నాపట్ల కనపడలేదు అంటూ.. ప్రజల ప్రేమను, ఆప్యాయతలను డబ్బుతో కొనవచ్చు అన్న రీతిలో విడ్డూరంగా మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. ఇలాంటి పలు పథకాలు అమలు చేయకుండా ఉన్నా బాగుండేది. అలా చేయకపోవడంతో ఓడిపోయానని సమాధానం చెప్పుకునేవాడిని. ఇంత చేసినా నాకు ఓట్లు వేయలేదన్న బాధను మిగిల్చారని జగన్ తన రోదన వెలిబుచ్చుకున్నారు.
పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించారట!
పేదరికం నుంచి శాశ్వత విముక్తి కలిగించటానికి గత ఐదేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేశాను. అయినా నాపై ఓట్ల వర్షం కురవలేదని జగన్‌రెడ్డి వాపోతూ.. కేవలం ఐదేళ్ల విద్యా కార్యక్రమాలతోనే పేదలు శాశ్వతంగా ధనవంతులుగా మారారన్న అసంబద్ధ వాదనను చేశారు, ఓటమిని అంగీకరించలేని మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. ఈ ఐదేళ్ల విద్యా సంస్కరణలతోటే పేదలంతా పేదరికం నుంచి బయటపడితే.. అంతకుముందు 72 ఏళ్లుగా సాగిన విద్యా వ్యాప్తి ఫలితాలు ఏమైనట్లు? ఈ ప్రశ్న భారీగా ఓటమికి గురైన జగన్‌రెడ్డికి స్ఫురించలేదు.
ఓడినా వదలని విశ్వసనీయత బాట
ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశాను.. విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచాను. చెప్పిన మాటకు కట్టుబడ్డాను. అయినా ప్రజలు ఎందుకు తిరస్కరించారో అర్థం కాలేదంటూ తన అరణ్య రోదన కొనసాగించారు మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. అమలుకు నోచుకోని తన పలు హామీల సంగతిని అతి సులువుగా మరచిపోయి తన ఓటమికి నిర్దయులైన ప్రజలే దోషులనే వాదనను నిస్సిగ్గుగా ముందుకు తెచ్చారు జగన్‌రెడ్డి.
మద్యాన్ని నిషేధించిన తరువాతే తిరిగి ఓట్లు అడుగుతాను. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తాను. అమరావతే నవ్యాంధ్ర రాజధాని అని తానిచ్చిన మాటలను అతి సులువుగా విస్మరించిన సంగతి జగన్మోహన్‌రెడ్డికి గుర్తు లేదా? అధికారంలోకి వచ్చాక నెలవారీ పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతానని హామీ ఇచ్చి.. అలా చేయటానికి ఐదేళ్ల సమయం తీసుకున్న తీరుబడి వైనం గుర్తు లేదా? పలు విడతల విద్యాదీవెన ఎగ్గొట్టిన విషయం ఆయనకి గుర్తులేదా? క్రమం తప్పకుండా బటన్ నొక్కానన్న జగన్ రెడ్డికి సమయానికి లబ్దిదారులకు డబ్బులు అందని విషయం గుర్తు లేదా? ఇదేనా విశ్వసనీయత అంటే? సంక్షేమాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన ఘనత జగన్‌రెడ్డిది కాదా?
ఆత్మ పరిశీలన ఏది?
ఎంతో చేసినా ప్రజలు తనను తిరస్కరించారని ప్రజల్ని దోషులుగా నిలబెడుతున్న జగన్‌రెడ్డి తన ఓటమి కారణాల పట్ల సరైన సమీక్ష, ఆత్మపరిశీలన చేసిందెక్కడ? పింఛన్లు కొనసాగిస్తే ప్రజలు పేదరికం నుంచి బయటపడతారా? నలుగురితోపాటు నారాయణా అన్నట్లు దళితులకు, గిరిజనులకు పింఛన్లు ఇస్తే.. గత ఐదేళ్లుగా వారిపై సాగిన దాడులు, అత్యాచారాలు, దురాగతాలు, హత్యలు, ఆత్మ గౌరవ విఘాతకాలను మరచి వారు ఓట్లేస్తారా? పేదలు ఆశించేంది కేవలం నెలవారీ తాయిలాలేనా? వారికి సరైన రోడ్లు అవసరంలేదా? వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అక్కరలేదా? రాజ్యాంగ ప్రసాదితమైన వాక్‌స్వాతంత్య్రం, జీవించే హక్కులను జగన్‌రెడ్డి ప్రభుత్వం హరించి ప్రజల గౌరవప్రదమైన జీవనానికి భంగం కలిగిస్తే ప్రజలు మౌనంగా భరిస్తారా? పేదలకు తాయిలాలు ఇస్తూ తాను, తన అస్మదీయగణం వేలాది కోట్లు అక్రమంగా దోచుకుంటే ప్రజలు సహిస్తారా?
ఈవిధమైన అంశాలను లోతుగా సమీక్షించి, విశ్లేషించుకోకుండా తన ఓటమికి కారణం ప్రజల మోసపూరిత వైఖరేనని నొక్కి వక్కాణించటం.. జగన్‌రెడ్డి మారడు అన్న విషయాన్ని స్పష్టం చేస్తోందని పరిశీలకుల అభిప్రాయం. పెత్తందారీ ప్రధాన లక్షణం తన ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోవటం. తన ఓటమిపట్ల మారని జగన్‌రెడ్డి తీరు ఆయన ఫక్తు పెత్తందారీ అని మరోసారి స్పష్టం చేసిందని సర్వత్రా అభిప్రాయం వెల్లడవుతోంది.