- ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు, ఉన్నవాటినీ తరిమేశారు
- రైల్వేజోన్‌కు భూమి కూడా ఇవ్వలేదు
- ఫేక్ పార్టీ వైసీపీ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తప్పుడు ప్రచారం
- ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు
- విశాఖకు ఐటీ కంపెనీలు తీసుకువస్తాం
- ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి చర్యలు
- వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్!
- విశాఖలో విలేకరులతో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం (చైతన్యరథం): ఉత్తరాంధ్ర కోసం గత ఐదేళ్లలో వైసీపీ చేసిందేమీ లేదని, కనీసం రైల్వే జోన్‌కు భూమి కూడా ఇవ్వలేదని, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ఆదివారం విశాఖ కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసుకున్నామన్నారు. 8వ తేదీన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారు. అందులో భాగంగా సుమారు కిలోమీటర్ వరకు రోడ్ షో ఉంటుంది. దీనితర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 2014 నుంచి ఎన్డీయే ప్రభుత్వ నినాదం ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ. ఇందులో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. దాదాపు రూ.70వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతోంది.
నెల్లూరుకు వచ్చేసరికి చెన్నై-విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నంలో క్రిస్ సిటీ నోడ్‌ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నిధులు కూడా కేటాయించారు. ఆ నోడ్ వల్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. సుమారు రూ.5వేల కోట్లు ఖర్చుతో కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నాం. ఇప్పటికే పూర్తైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. విశాఖ రైల్వే జోన్ అందరి కల. జోనల్ హెడ్ క్వార్టర్ విశాఖలో ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు. అందువల్లే జోన్ ఏర్పాటు ఆలస్యమైంది. మన ప్రభుత్వం రాగానే అవసరమైన భూమి కేటాయించింది. రైల్వేజోన్ హెడ్ క్వార్టర్ ఏర్పాటుచేసేందుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇవేకాకుండా రైల్వేకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారని మంత్రి లోకేష్ వివరించారు.
ప్రధాని రోడ్ షోను డబుల్ సక్సెస్ చేయాలి
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోంది. ప్రధాని బహిరంగ సభను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం. చిలకలూరిపేటలో గతంలో ఎన్నికలకు ముందు నిర్వహించిన బహిరంగ సభ బంపర్ సక్సెస్ అయింది. విజయవాడలో రోడ్ షో చేశారు. అది కూడా సక్సెస్ అయింది. ప్రధాని మోదీ విశాఖ పర్యటనను కూడా డబుల్ సక్సెస్ చేయాలనే తపనతో పనిచేస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రధానికి అండగా నిలబడాలి. గత కేంద్ర బడ్జెట్ లో కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు చేశారు. దారితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇప్పటికే చాలా అప్పులపాలయ్యాం. అప్పులపై వడ్డీలు కట్టేందుకే అవస్థలు పడుతున్నాం. ఈ పరిస్థితుల్లో కేంద్ర సహకారం చాలా అవసరం. పోలవరానికి రూ.2వేల కోట్ల నిధులు ఇచ్చారని మంత్రి లోకేష్ తెలిపారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.900 కోట్లు విడుదల చేసిందని వివరించారు.
ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది?
ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల ద్వారా దాదాపు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. వైసీపీ ఫేక్ పార్టీ. ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది? కనీసం రైల్వే జోన్‌కు భూమి కూడా ఇవ్వలేదు. ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయాయి. టీసీఎస్‌ను మేం తీసుకువచ్చాం. రుషికొండ విధ్వంసం తప్ప వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు. గతంలో మేం డేటా సెంటర్ తీసుకువస్తే వైసీపీ పాలకులు దానిని మహారాష్ట్రకు తరిమేశారు. లులూ ను తరిమేశారు. హెచ్‌ఎస్‌బీసీ మూతపడిరది. కియా పరిశ్రమను చంద్రబాబు తీసుకువస్తే.. ఆత్మలతో మాట్లాడే జగన్ రెడ్డి.. వైఎస్ తీసుకువచ్చారని దుష్ప్రచారం చేశారు. టీసీఎస్ విషయంలో కూడా ఇంతే. హుద్ హుద్, తిత్లీ తుఫాను, విజయవాడ వరదల సమయంలో సాయం ప్రకటించిన జగన్ రెడ్డి.. ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మా నినాదం. విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఏ రాష్ట్రంలోనూ ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు
సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్న ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఎందుకు చేయలేదు? వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నారు. మేం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రూ.4 వేల పెన్షన్ ఇవ్వడం లేదు. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం అమలు చేస్తున్నాం. తల్లికి వందనం ఎప్పటి నుంచి అమలు చేసేదీ ప్రకటించాం. రైతులకు ఇవ్వాల్సిన నిధులకు కూడా తేదీలు ప్రకటించాం. మత్స్యకారులకు వేట నిషేద భృతి ఇస్తున్నాం. వైసీపీ హయాంలో మత్య్యకారులకు ఎందుకు బకాయిలు పెట్టారు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎందుకు పెట్టారు? స్కూల్ కిట్స్‌కు వెయ్యి కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. అవన్నీ మేం చెల్లిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.1800 కోట్లు బకాయిలు పెడితే మేం చెల్లిస్తున్నాం. మేం పారిపోవడం లేదు. ప్రతి నెల రూ.4వేల కోట్ల లోటుతో బడ్జెట్ నడుస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. కేంద్రం సహకారంతో నెట్టుకుని వస్తున్నాం. తిరిగి పట్టాలెక్కించడానికి కొంత సమయం పడుతుంది. వైసీపీ విధ్వంసం వల్లే ఇదంతా. పారిశ్రామిక వేత్తలను గతంలో వైసీపీ పెద్దలు ఇబ్బందులు పెట్టడంతో వారు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారని మంత్రి లోకేష్ తెలిపారు.
ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలు తీసుకువస్తాం
ఉత్తరాంధ్రకు పెద్దఎత్తున ఐటీ కంపెనీలు తీసుకువస్తాం. విశాఖ మధురవాడలోని మిలీనియం టవర్‌లో టీసీఎస్ కంపెనీ ఏర్పాటవుతుంది. టీసీఎస్ సొంత భవనాల నిర్మాణానికి రెండు, మూడేళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు మిలీనియం టవర్‌ను ట్రాన్సిట్ బిల్డింగ్‌గా వినియోగించుకుంటూ, ఫేజ్-1లో రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. టీసీఎస్ సొంత భవనాల నిర్మాణానికి అవసరమైన భూములు కూడా చూపిస్తాం. విశాఖలో ఐటీ కంపెనీలకు పెద్ద సెంటర్ కూడా నిర్మిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.
గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు
గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అరకు కాఫీని రూ.300 కోట్ల నుంచి రూ.3వేల కోట్ల బ్రాండ్‌కు తీసుకువెళ్తాం. గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా ఈగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేశాం. దీనికి అదనంగా నిధులు కూడా కేటాయిస్తున్నాం. గంజాయి సాగుని కట్టడి చేస్తాం. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం
బీసీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎస్, డీజీపీ, టీటీడీ ఈవో పదవుల్లో బీసీ సామాజికవర్గాలకు చెందిన అధికారులకు అవకాశం కల్పించాం. మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. లోపాలు ఏవైనా ఉంటే ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం. వైసీపీది దుష్ప్రచారం మాత్రమే. మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. జగన్ సెక్యూరిటీతో పోల్చుకుంటే చంద్రబాబుది 30శాతమే అని మంత్రి లోకేష్ వివరించారు.
సీఎం సతీమణి కోసం క్యాంప్ ఆఫీసా?
రుషికొండ భవనాలను ఏం చేయాలో మాకే అర్థం కావడం లేదు. రూ.700 కోట్లు దుర్వినియోగం చేశారు. కూల్చేసిన పాత బిల్డింగ్ విలువ మరో రూ.300 కోట్లు. మొత్తం వెయ్యి కోట్లు వృథా అయ్యాయి. వైసీపీ హయాంలో సీఎం సతీమణి కోసం క్యాంప్ ఆఫీసు నిర్మాణం చాలా వింతగా ఉంది. ముఖ్యమంత్రి సతీమణి కోసం క్యాంప్ ఆఫీసు ఎప్పుడూ వినలేదు. దేశంలో కూడా ఎక్కడా లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, మద్యం అక్రమాలపై విచారణ జరుగుతోంది. వైసీపీ హయాంలో అన్ని కుంభకోణాలపైనా విచారణ జరుగుతోంది. త్వరలో యాక్షన్ ఉంటుందని నేను భావిస్తున్నా. వాలంటీర్ల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న జగన్ రెడ్డి.. ఆయన హయాంలో వాలంటీర్ల నియామక జీవోను ఎందుకు రెన్యువల్ చేయలేదని మంత్రి లోకేష్ నిలదీశారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.5వేల కోట్లు అవసరం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది. గత వైసీపీ ప్రభుత్వం చేతగానితనం వల్ల 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమయ్యారు. జూనియర్ కాలేజీలను పట్టించుకోలేదు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ను పట్టించుకోలేదు. వాటన్నింటిపైనా తాము దృష్టిపెట్టామని మంత్రి లోకేష్ తెలిపారు.