- హత్యారోపణ కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తికి వత్తాసు సిగ్గుచేటు
- అమాయకుడు, గాంధీ అని చెప్పిన జగన్ సిగ్గుమాలిన నేత
- జనంలోకి రావడానికి భయమేసి జైలుకెళ్లి ఖైదీని కలిశాడు
- ఆయన చేసిన విధ్వంసం ప్రపంచం అంతా చూసింది…
- వైసీపీ పాలనలో మాచర్లలో మారణ హోమం
- దేశమే ఆశ్చర్యపోయేలా ఆ నియోజకవర్గంలో ఘాతుకాలు
- ఎనిమిది మందిని చంపారు…ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు
- ఐదేళ్లు హత్యలు, అరాచకాలు, విధ్వంసాలు తప్ప చేసింది శూన్యం
- అందుకే 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పారు
- ఆ పార్టీ బంగాళాఖాతంలో కలవడమే..జగన్‌ను ప్రజలు నమ్మరు
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి
మంగళగిరి: ఓడిపోయిన జగన్‌రెడ్డి జనాల మొహం చూడటానికి భయం వేసి జైలులో ఉన్న ఖైదీ మొహం చూడటానికి వెళ్లాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. జగన్‌రెడ్డి, ఆయన అనుచరులు గడిచిన ఐదేళ్లు చేసింది హత్యలు, అరాచకాలు, అన్యాయమేనని.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాచర్లలో పిన్నెల్లి విధ్వంసం ప్రపంచం అంతా చూసిందని.. హత్యారోపణ కేసుల్లో ఇరుక్కున్న అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ జగన్‌రెడ్డి జైలుకు వెళ్లి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పిన్నెల్లి విధ్వంసాన్ని ఖండిస్తూ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని పిన్నెల్లిపై కేసులు పెట్టారని, దాన్ని వక్రీకరించి నేడు టీడీపీపై రుద్దేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్ని విమర్శలు చేయడం కంటే నీతి మాలిన రాజకీయం ఇంకోటి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పిన్నెల్లి ధ్వంసం చేశాడు.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి బ్యాలెట్ బాక్సును నేలకేసి కొట్టింది ప్రపంచం మొత్తం చూసింది. అయినా మళ్లీ సిగ్గులేకుండా పిన్నెల్లి అమాయకుడు, ఆయన గాంధీ అని, ఏ నేరం చేయలేదని మాట్లాడటానికి జగన్ రెడ్డికి సిగ్గుండాలని దుయ్యబట్టారు.
ఐదేళ్లు మాచర్లలో అరాచకాలకు విసిగిపోయారు
పిన్నెల్లి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద దాడులు చేశారు. ఐదేళ్లలో 8 మందిని చంపారు. 79 దాడులు చేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజలు ఫియర్ సైకోసిస్‌లో ఉన్నారు. అందుకే ఐదేళ్లు మనసులో పెట్టుకుని ఎన్నికల్లో ఫియర్‌ను బయటకు తీసి మిమ్మల్ని ఇంటికి పంపారు. 20 రోజులు కాకుండానే హామీలను అమలు చేయాలని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఊరూరా ఢంకా బజాయించి చెప్పుకున్నా మీకు ఓటేయలేదు. ప్రజలకు మీరు మంచి చేసి సంక్షేమం అందించి న్యాయం చేసి ఉంటే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉంటే ప్రజలు ఆదరించేవారు. అలా చేయకుండా రాష్ట్రాన్ని అర్థికంగా ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు. ప్రజలను భయ బ్రాంతులకు గురిచేశారు.
ఇక ప్రజలు భవిష్యత్‌లో జగన్‌రెడ్డిని నమ్మరు
పిన్నెల్లి అరెస్టుతో చంద్రబాబుకు సంబంధం లేదు. ఇకనైనా ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలి. వైసీపీ ఇక బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే. జగన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు రోజువారీ విచారణకు ఆదేశించింది. ప్రజలను దారి మళ్లించడానికి హత్యారోపణ కేసులు ఉన్న వ్యక్తిని, ఈవీఎంలు పగులగొట్టిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడు. జగన్ రెడ్డికి ఎప్పటికి రాజకీయ అనుభవం రాదు..పరిపక్వత రాదు. రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డిని ఇక నమ్మరు. వైసీపీ నేతలను ప్రజలు ఛీకొట్టారు. అందుకే ప్రతిపక్షం కూడా రాకుండా చేశారు.
ప్రజా విలువలను పెంచే నాయకుడు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి. దాన్ని పరిరక్షించే వ్యక్తి. 42 సంవత్సరాల జీవిత చరిత్రలో ఏనాడూ అరాచకం, అన్యాయాన్ని ప్రోత్సహించలేదు. రాయచోటి మంత్రి భార్య, కొలికపూడి శ్రీనివాసరావుల ఘటనలపై వెంటనే స్పందించి భవిష్యత్‌లో ఇలాంటివి చేయవద్దని హెచ్చరించారు. ప్రజా విలువలను పెంచే నాయకుడు ఎవరన్నది ఈ ఘటనే చెబుతుంది. టీడీపీలో చట్టాన్ని చేతిలోకి తీసుకుని వ్యవహరిస్తే ఉపేక్షించనని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. మీలాగా దోచుకోని అరాచకం సృష్టించమని మా నాయకుడు చెప్పడు. ఐదేళ్లు సొంత రాజ్యాంగం నడుపుకున్న మీకు…నేడు అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే మీ మనసు ఒప్పుకోవడం లేదు. మీ పాలన చూసి ప్రజలు విసిగి వేసారారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారు.
ప్రజలు కంకణం కట్టుకుని కూటమిని గెలిపించారు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 18 రోజుల్లోనే పేదలకు పింఛన్ పెంచి అందించిన సమర్థ నాయకుడు చంద్రబాబు. మిగిలిన హామీలను కూడా అమలు చేస్తాం. చంద్రబాబు హామీ ఇచ్చారంటే అవి ఖచ్చితంగా అమలు చేస్తారు. జగన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రాజధానిని ధ్వంసం చేశాడు.. నీటిపారుదల వ్యవస్థను నాశనం చేశాడు. తుగ్లక్ చర్యలతో రైతులు, వ్యాపారస్తులు, పిల్లలు ఇలా అన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారు. అందుకే రాష్ట్రాన్ని బాగుచేసేందుకు చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీని అందించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని వ్యాఖ్యానించారు.