- న్యాయం మన వైపే ఉంది, గట్టిగా వాదించండి
- లీగల్ టీమ్‌తో జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు
- పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై నేడు సుప్రీంలో విచారణ
అమరావతి (చైతన్యరథం): గోదావరి నదీ జల ప్రవాహానికి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు నీటిని వాడుకుంటే తప్పేంటి అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తోటి తెలుగు రాష్ట్రానికి స్నేహ హస్తం అందిస్తుంటే, వారు ఏపీకి అన్యాయం జరిగేలా కోర్టుకి వెళ్లడం విచారకరమన్నారు. పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ నేపధ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులు, న్యాయవాదులుతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీమ్‌కు మంత్రి నిమ్మల సూచించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు, లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీల నీటిలో, కేవలం 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామన్నారు. Gఔణు అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గోదావరి బేసిన్ లో ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో, ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలుగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చన్నారు. వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాడమే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా రామానాయుడు చెప్పారు. కేంద్రానికి ప్రాజెక్ట్ ఫీజుబులిటీ రిపోర్ట్ సమర్పించాం, వారి సూచనల మేరకే మార్పులు చేస్తున్నా మన్నారు. డీపీఆర్ కి సంబంధించిన టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్య మాత్రమే అన్నారు. చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు చేపడతామని, రామానాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు. కౌన్సిల్లో మరో న్యాయవాది జయదీప్ గుప్తా కూడా ఏపీ తరఫున వాదిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సి నరసింహమూర్తి, న్యాయవాదులు, ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















