కడప: తాను ప్రజల ముందుకొచ్చి మాట్లాడుంటే వైసీపీ నేతల్లో భయం పుడుతోందని దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. వివేకా హత్యపై మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంపై సునీతా రెడ్డి స్పందించారు. వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టుకు వెళతామన్నారు. న్యాయం కోసం ఇప్పుడు నేను ప్రజల ముందుకు వస్తే.. ఏం చేయాలో తోచక వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టుకెళ్లారన్నారు. శుక్రవారం పులివెందులలో వైఎస్ సునీతా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తన తండ్రి వివేకా హత్యకు గురైన గత ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ ఐదేళ్లలో బయట మీడియా ముందు మాట్లాడిరది ఐదుసార్లు మాత్రమే అన్నారు.
తనకు జరిగిన అన్యాయంపై గత రెండు నెలలుగా మాట్లాడడం మొదలు పెట్టానన్నారు. ఈ ఐదేళ్లలో వివేకాను ఎంత అవమానించారో.. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. ఐదేళ్లుగా నరకం చూపించిన ఇదే వైసీపీ నేతలు.. ఇప్పుడు న్యాయం కోసం ప్రజల ముందుకు వెళితే అనేక రకాలుగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మళ్లీ ఎక్కడ పై కోర్టుకు వెళతానో అని పులివెందుల నియోజకవర్గంలో తమకు సాయం చేసే వారిని బెదిరిస్తున్నారన్నారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులకు ఓటు వేయవద్దని పులివెందుల ప్రజలను కోరారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు ఓటువేసి పార్లమెంటుకు పంపాలంటూ పులివెందుల ప్రజలను వైఎస్ సునీత కోరారు.