టిడిపి అధికారంలోకి వచ్చినవెంటనే కుందూ నది విస్తరణ, జలశుద్ధి కార్యక్రమాన్ని చేపడతాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భం గా గురువారం నంద్యాల సమీపంలోని కుందూనది పరివాహక ప్రాంత ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. కుందూనదిలో పూడిక తీత, విస్తరణ, జలశుద్ధి కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలి. నదీపరివాహక ప్రాంతం ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా నదిని అభివృద్ధి చేయాలి.
కుందూనదిపై దొరాశి, రాజోలిబండ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి రైతులను ఆదుకోవాలి. నంద్యాల పట్టణం డ్రైనేజీని కుందూనదిలో కలపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఎస్పీవై రెడ్డి ఆగ్రోస్, ఇతర పరిశ్రమల కలుషిత వ్యర్థాలను నదిలో కలవకుండా చర్యలు తీసుకోవాలి. నదిపై రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ అండ్ కోకు నదుల్లో ఇసుకపై ఉన్న శ్రద్ధ పరీవాహక ప్రాంత ప్రజలపై లేదు.
నదులు , ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఫలితంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు. పరిశ్రమల వ్యర్థాలు, మురుగునీరు నదిలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. కుందూనదిని పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులకు మేలుకలిగే విధంగా తీర్చిదిద్దుతాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు అండగా నిలబడతాం అని లోకేష్ హామీ ఇచ్చారు.