- 6 మీటర్లకు ఎత్తు పెంపు
- పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన మంత్రి లోకేష్
- బాధితులకు సాయంపైనా పర్యవేక్షణ
- వేగంగా నష్టం అంచనాకు చర్యలు
విజయవాడ(చైతన్యరథం): బుడమేరు గట్ల వద్ద జరుగుతున్న పనులపై మంత్రి నారా లోకేష్ సోమవారం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులు మరింత వేగవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. బుడమేరు కట్టకు పడిన భారీ గండిని పూడ్చడమే కాకుంగా ఇంకోసారి తెగకుండా ఎత్తు పెంచారు. పూడ్చడమే కష్టం అనుకొన్న గండిని పూడ్చి, బుడమేరు కట్ట ఎత్తు కూడా పెంచటం విశేషం. వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతంగా చేశారు. గండ్లు పడిన ప్రాంతంలో 6 మీటర్ల మేర కట్ట ఎత్తు పెంపు పనులు పూర్తి చేసి ప్రస్తుత కట్ట స్థాయికి తీసుకువచ్చారు. ఎప్పటికప్పుడు బుడమేరు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులతో లోకేష్ సంప్రదింపులు జరిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట వరద నీరు సీపేజ్ లీకేజీని 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు తగ్గించారు. పూర్తి స్థాయిలో లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో లీకేజీని అరికట్టేందుకు జియో మెంబ్రేన్ షీట్‌ను అధికారులు వినియోగిస్తున్నారు.
మరోపక్క వరద బాధితులకు అందుతున్న సహాయం, నష్ట పరిహారం అంచనాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నష్ట పరిహార అంచనా పక్కాగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 36 మంది ప్రజాప్రతినిధులను నష్టం అంచనా పర్యవేక్షణకు నియమించారు. ఒక పక్క బాధితులకు సహాయం అందిస్తూనే మరో వైపు నష్టం అంచనా వేగంగా పూర్తి చెయ్యడానికి చర్యలు తీసుకున్నారు.