అమరావతి: ఎఆర్ కానిస్టేబుల్ భానుప్రకాష్ తనను మోసగించలేదని మహిళ బహిరంగంగా చెప్పింది. ఇప్పు డెవరిని సస్పెండ్ చెయ్యాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ డిస్మిస్ పై టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ ఇప్పుడెవరిని సస్పెండ్ చెయ్యాలి. డీజీపీనా? వైసీపీ ప్రభుత్వాన్నా? న్యాయం కోసం స్పందనలో ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలిని మీ పాపానికి పావుగా చేసుకుంటారా? మీరు అక్రమంగా విధుల నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ నిందితుడు కాదని స్వయంగా బాధిత మహిళే చెప్పింది. దీనికి సమాధానం చెప్పగలరా? మీరు ఖాకీలు అన్న విషయం కాస్తయినా గుర్తుపెట్టుకోండి. బకాయిలపై ప్రశ్నించిన సొంత శాఖ వ్యక్తిపైనే అక్రమకేసు పెట్టడం మీ పోలీసు శాఖకే మచ్చ అని గుర్తించండి. ఎండనక.. వాన నక.. రాత్రనక..పగలనక డ్యూటీలు చేస్తున్న కింది స్థాయి సిబ్బంది మీ చర్యలపై ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. మీరు చేసిన తప్పును ఇప్పటికైనా సరిదిద్దుకోండని చంద్ర బాబునాయుడు హితవుపలికారు.