అమరావతి: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టరాదంటూ అమలాపురంలో దళితులపై దాడులు చేసి, వారి ఆస్తులు ధ్వసం చేసిన నిందితులపై ఉన్న కేసులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రద్దు చేయడం దుర్మార్గమని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు గొట్టిముక్కల కోటేశ్వర్‌రావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకించి అరాచకం సృష్టించిన వారిని జగన్ రెడ్డి వెనకేసుకురావడం దళితులను అవమానించడమేనన్నిరు. అంబేద్కర్ పేరును వద్దన్న వారి కోసం జీవోలు తీసుకొచ్చి మరీ కేసులు ఎత్తేయడం జగన్ రెడ్డి పెత్తందారి పోకడలకు నిదర్శనమన్నారు. అరాచక శక్తులపై కేసులు ఎత్తివేసిన జగన్ రెడ్డికి అంబేద్కర్‌్‌వాదులు కనపడరా.. అంబేద్కర్ జిల్లా సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన అంబేద్కర్ వాదులపై పెట్టిన అక్రమ కేసులను జగన్ రెడ్డి ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. దళితులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించిన దళితులపై మాత్రం తిరిగి అక్రమ కేసులు బనాయించడం జగన్ రెడ్డికి అలవాటుగా మారింది. జగన్ రెడ్డి పాలన అంతా రివర్సే అని మరోసారి నిరూపించారు. దళితులపై జగన్ రెడ్డికి ఎందుకింత పక్షపాత దోరణి. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ రాగాలు తీసే జగన్‌కు దళితులకు న్యాయం చేయడంలో మాత్రం మనసెందుకు రావడం లేదు. దళితులపై జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళితులపై ఉన్న కేసులను వెంటనే రద్దు చేయాలి. అంబేద్కర్‌్‌ను అవమానించి దళితులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు.