.ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నక్యాంటీన్లు ప్రారంభం
.జగన్‌రెడ్డీ ఓసారి తమిళనాడు వైపు చూడు
.అన్నక్యాంటీన్లు తెరవకుంటే ఉద్యమిస్తాం
.ఎమ్మెల్సీ బీటీనాయుడు హెచ్చరిక
అమరావతి: పేదవాడికి పట్టెడన్నం పెట్టకపోతే రాజకీయాలలోకి రావడమే వృథా అన్న నందమూరి తారక రామారావు మాటలను స్ఫూర్తిగా తీసుకుని నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటిన్లు ప్రారంభించారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు చెప్పారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి పేదవాడి నోటికాడ కూడు తీసివేశాడని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదవాడికి రూ.15లతో మూడు పూటలా పట్టెడన్నం పెట్టే సదుద్దేశంతో చంద్రబాబు 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 368 క్యాంటీన్లను ప్రారంభించినట్లు చెప్పారు. పూటకు రూ.5లకే భోజనం పెట్టిన ఘనత చంద్రబాబునాయుడు దేనన్నారు. అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం చేసుకుని మంచి భోజనం అందించినట్లు తెలిపారు. కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు, యాచకులు సైతం అతి తక్కువ ఖర్చుతో మూడు పూటలా కడుపు నింపుకునేందుకు అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నక్యాంటిన్లు రోజుకు దాదాపు 2.25 లక్షల మంది ఆకలి తీర్చినట్లు చెప్పారు.
జగన్ రెడ్డి విషప్రచారం
అన్న క్యాంటీన్లపై జగన్ రెడ్డి విషప్రచారం చేసి వాటిని 2019 ఆగస్టులో మూసివేశారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణలో అవినీతి జరిగిందని ప్రచారం చేశారని, రాబడి లేని వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం ఏముందని మంత్రి బొత్స వ్యాఖ్యానించినట్లు వివరించారు. 216 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు రూ.100 కోట్లు మాత్రమే ఖర్చయితే, రూ.150కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. రూ.2 లక్షలతో చేపట్టిన నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చు చేశారని విజయసాయి రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా అన్న క్యాంటీన్లను ఉగాది నుంచి ప్రారంభిస్తామని జగన్ రెడ్డి చెప్పారన్నారు. ఆ తరువాత దాని ప్రస్తావనే లేదని చెప్పారు.
పేదలకు అన్నం పెడుతుంటే అడ్డుకున్న వైసీపీ నేతలు
వైసీపీ ప్రభుత్వం పేదవాడి నోటి దగ్గర కూడు తీసివేసిందని మంగళగిరి, నందిగామ తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు కొందరు తమ సొంత ఖర్చులతో, దాతల విరాళాలతో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తే జగన్ రెడ్డి, అతని మంత్రులు, వైసీపీ నేతలు అడ్డుకున్నరని తెలిపారు. ప్రారంభించిన క్యాంటిన్ షెడ్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు బనాయించినట్లు తెలిపారు. వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు.
జగన్‌రెడ్డీ తమిళనాడు వైపు చూడు
పక్కనున్న తమిళనాడులో జయలలిత పేరు మీద అమ్మ క్యాంటిన్లు నడుపుతున్నట్లు గుర్తు చేశారు. తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను అలాగే కొనసాగిస్తున్నారని చెప్పారు. జయలలిత ఫోటోలను కూడా తొలగించలేదన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే బ్రిటీష్ కాలంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. టీటీడీలో మొట్ట మొదట అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టింది నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితోనే చంద్రబాబునాయుడు అన్న క్యాంటిన్లు ప్రారంభించినట్లు చెప్పారు. వాటిని తక్షణం తెరవాలని డిమాండ్ చేశారు.