.నగ్న ప్రదర్శన వీడియో ఒరిజినల్ అనితేలిందిగదా?
.ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు
అమరావతి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మాధవ్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాధవ్ ని పదవి నుంచి, పార్టీ నుంచి ఎందుకు బర్తరఫ్ చేయలేదని అడిగారు. మహిళల రక్షణకు వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు, దిశ చట్టం తీసుకొచ్చినట్లు వైసీపీ నేతలు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, దాడు లు, అత్యాచారాలు చూస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో మన రాష్ట్రానికి చెందిన ఎన్జీ రంగా, నీలం సంజీవరెడ్డి, యర్రన్నాయుడు, జీఎంసీ బాలయోగి వంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు తమ పనితీరుతో తెలుగువారి ప్రతిష్ఠను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. గోరంట్ల మాధవ్ మాత్రం దిగజారి ప్రవర్తించి రాష్ట్ర పరువును దేశవ్యాప్తంగా మంటగలిపారని ధ్వజమెత్తారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో గురించి సిగ్గులేకుండా నాలుగు గోడల మధ్య జరిగిందని, అది వాళ్ల వ్యక్తిగతమని, దాని వల్ల ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందీ లేదని ప్రభుత్వ సలహాదారుడు అనడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి నీచమైన ఎంపీని సమర్థిస్తూ ప్రజలకు, సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ ఏం సాధించాడని హిందూపురానికి ర్యాలీగా వచ్చాడని అడిగారు. చేసిన పాడుపనికి సిగ్గు పడకపోగా బరితెగించి రోడ్డెక్కుతాడా అని మండిపడ్డారు. పోలీసులు కూడా అతనిపై ఈగ వాలకుండా చుట్టూ చేరి ప్రహరీకట్టి మరీ అడుగులకు మడుగులు ఒత్తడం పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చగా పేర్కొన్నారు. ఒక మహిళ హోంమంత్రి స్థానంలో ఉండి దిశ చట్టాన్ని తీసుకొచ్చాం, ఎంపీ మాధవ్ తప్పు చేసినట్లైతే అతని పై పార్టీ పరంగా చర్యలు ఉంటామని చెప్పి, చివరకు అతను తప్పు చేయలేదని సమర్థించి మాట్లాడటం బాధాకరమన్నారు. విజయవాడ ప్రభుత్వా స్పత్రిలో అత్యాచార బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్లిన ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఏకంగా నోటీస్ ఇచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇప్పుడు గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. డీజీపీకి లేఖ రాసి చేతులు దులుపు కుంటే సరిపోతుందా అని అడిగారు. అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఆడబిడ్డల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. ఒక ఎంపీ న్యూడియో వీడియాతో అసభ్యంగా మహిళలతో మాట్లాడాడడం, మరో ఇద్దరు మంత్రులు గంట, అరంగంట అంటూ ఫోన్‌లో మాట్లాడం,ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేయడం..ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్దమవుతోంద న్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోకపోగా వారు చేసిన తప్పులని కప్పిపుచ్చుకునేం దుకు రెండు కులాల మధ్య గొడవలు సృష్టించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ గలీజు వ్యవహారంపై నేషనల్ ఉమెన్ కమిషన్ స్పందించిందని, మరో వైపు పంజాబ్ ఎంపీ రాష్ట్రపతికి లేఖ రాశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం స్పందించలేదని చెప్పారు. చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నా ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. జగన్ రెడ్డిలా వ్యవస్థల్ని దిగజార్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా టీడీపీ తరఫున తాము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని దువ్వారపు రామారావు హెచ్చరించారు.