- మూడోసారి ప్రధాని పీఠంపై ధీమాగా మోదీ
- ఏపీలో ఘనవిజయం ఖాయమంటున్న కూటమి
- ఆశలు వదులుకున్న వైసీపీ
అమరావతి(చైతన్యరథం): ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ శనివారం ముగియనుండగా, సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలతో పాటు, నాలుగు రాష్ట్రాల.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు మున్నెన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణంలో జరిగాయి. తుది దశ పోలింగ్ ముగిసేవరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ ఆంక్షలు విధించటంతో శనివారం పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటలకు పలు సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వెల్లడిరచనున్నాయి. వీటిని వాస్తవ ఫలితాలకు సంకేతంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.
గత మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి రాగా దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించారు. ఏప్రిల్ 19న తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగగా ఆఖరి విడత జూన్ 1న 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరి దశ పోలింగ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో గురువారమే ప్రచార పర్వానికి తెరపడిరది. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఎన్డీఏ పూర్తి ఇండియా కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి తరఫున కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ విజయంపై ధీమాగా ఉన్నాయి. ఒడిశాలో బీజేడీని గద్దె దింపి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింల్లో పోటీ ప్రధానంగా అక్కడి ప్రాంతీయ పార్టీల మధ్యనే జరిగింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టునిలుపుకుని, దక్షిణాదిలో మెరుగైన సీట్లు సాధించి ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధిస్తారా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాకంటక వైసీపీ పాలనకు ముగింపు పలికి టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా, బీజేపీ దూకుడును తట్టుకుని ఒడిశాలో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ వరుసగా ఆరోసారి ముఖ్యమంత్రి అవుతారా అనే విషయాలపై శనివారం వెలువడే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో కొంతవరకు సంకేతాలు లభిస్తాయి. ఈ ఎన్నికలను జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం సందర్భంగా నేతల మధ్య మునుపెన్నడూ లేని విధంగా మాటల యుద్ధం నడిరచింది. బీజేపీ ‘వికసిత్ భారత్’ అనే ఎజెండాతో ఎన్నికలకు వెళ్లగా, మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లకు పెను ప్రమాదమని చెబుతూ ఇండియా కూటమి ఈ ఎన్నికల ప్రచారంలో తలపడ్డాయి. మరోవైపు ఏపీలో అధికారం ఎవరిదన్నది అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మందికి ఏపీ మీదనే దృష్టి నెలకొనడం విశేషం.
దుష్ట పాలనకు చరమ గీతం పాడి.. తమకే ప్రజలు పట్టం కట్టారని.. టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎగ్జిట్‌పోల్ ఫలితాలతో తమ విజయంపై మరింత స్పష్టత వస్తుందని కూటమి నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పోటెత్తిన పోలింగ్ సరళి, పాలకపక్షంపై రాష్ట్రవాసుల్లో పెల్లుబికిన వ్యతిరేకత, రాజధానిలేని రాష్ట్రం, అభివృద్ధికి దూరమైన వైనం.. నిరుద్యోగం.. ఇలా అనేక అంశాలు పాలకపక్షంపై వ్యతిరేకతకు బలమైన కారణాలయ్యాయి. పోలింగు రోజునే ఓటమిపై వైసీపీ ఓ నిర్థారణకు వచ్చేయడంతో.. ఎన్నికల హింసకు తెగబడిరదన అపవాదునూ చివరి రోజున జగన్ పార్టీ మూటగట్టుకుంది.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు, సీట్ల సర్దుబాట్లు చేసుకుని కలిసికట్టుగా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడే అవి సగం విజయం సాధించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈసారి పవన్ కళ్యాణ్ చాలా పరిణతితో వ్యవహరిస్తూ, కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడంలో సఫలం అయ్యారు. ఇది జనసేన గెలుపునకే కాక ఇతర ప్రాంతాలలో టీడీపీ, బీజేపీలకు జనసేన ఓట్ల బదిలీకి ఎంతగానో తోడ్పడిరది. అలాగే పలువురు టీడీపీ సీనియర్ నేతలు, పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్తలు కూడా జనసేన, పవన్ కళ్యాణ్ కోసం ఎంతగానో శ్రమించారు. కనుక జనసేనకు కూడా టీడీపీ ఓట్లు బదిలీ అవడం ఖాయమే. ఈసారి టీడీపీ, జనసేనల ప్రభంజనం చాలా బలంగా ఉన్నందున కలిసి పోటీచేసిన బీజేపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. టీడీపీ కూటమి గెలుపుని, వైసీపీ ఓటమిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీమంత్రి పేర్ని నాని వంటి నేతలే తమ బోలు మాటలతో పదేపదే ధృవీకరిస్తూనే ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ ఆంధ్రలో పాలకపక్ష వైసీపీ ఆత్మవంచనకు సిద్ధపడుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వస్తే పార్టీ శ్రేణులు డీలా పడిపోతారన్న భయంతో.. అనుకూల ఫలితాలిచ్చే సంస్థలతో ఒప్పందం చేసుకున్నారన్న చర్చ రాజకీయ పక్షాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌లో మెజారిటీ సంస్థలు వైసీపీకి వ్యతిరేకంగా వాస్తవ చిత్రాన్నే ఇచ్చే అవకాశముంది. ఇదే జరిగితే కౌంటింగ్ సమయానికి పార్టీ శ్రేణులు జారిపోయే ప్రమాదముందని, పైగా అనుకూల అధికార యంత్రాంగం సైతం ప్లేట్ ఫిరాయించే ప్రమాదం ఉండొచ్చని వైసీపీ భయపడుతోంది. ఈ నేపథ్యంలో ఢల్లీి కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని చిన్న సర్వే సంస్థలతో పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని, రాష్ట్రం వరకూ వైసీపీ గెలుస్తున్నట్టు ఎగ్జిట్‌పోల్ ్స ఫలితాలు ఇచ్చేలా బేరసారాలు జరుపుతున్నారని అంటున్నారు. రాష్ట్రస్థాయిలో పనిచేసే ఒకరిద్దరు సర్వే సంస్థల నిర్వాహకులతోనూ ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెబుతున్నారు. ఓటమి భయంతో వైసీపీ ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ ఆత్మవంచనకు పాల్పడుతోందన్న చర్చ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
వైసీపీకి వ్యతిరేక గాలివీస్తోందనే విషయం పోస్టల్ బ్యాలెట్లలోనే తేలిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయితే, వాటిలో అత్యధికంగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగానే పడ్డాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లకుండా చేయాలని వైసీపీ తాపత్రయపడుతోంది. మొదట్ల్లోనే రిటర్నింగ్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని సరైన సీల్ లేకుండా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లను బాక్సుల్లో వేయించారు. ఆ ఓట్లు చెల్లవనుకున్నారు. కానీ తీరా ఈసీ చెల్లుతాయని ఉత్తర్వులు ఇవ్వడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వీలయినంత మేర చెల్లనివిగా ప్రకటింపజేసేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో విన్యాసాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1న ఎగ్జిట్‌పోల్ ఫలితాలు, జూన్ 4న వాస్తవ ఫలితాలతో వైసీపీ ఓటమిని ధృవీకరించడం కేవలం లాంఛనప్రాయమే అని భావించవచ్చు.