- మూడు నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలకు పరామర్శ
- ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేత
- అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా
- చిత్తూరు జిల్లాలో సాగిన భువనమ్మ ‘నిజం గెలవాలి’
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను స్వయంగా ఓదార్చి, ఆర్థికసాయం అందించేందుకు భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఐదుగురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.
తొలుత పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం, కమ్మపల్లి గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 12న గుండెపోటు తో మృతిచెందిన పార్టీ కార్యకర్త వెంకటపతి నాయుడు కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించారు. వెంకటపతి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.
పులిచర్ల మండలంలోనే పడగలవారి పల్లి గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 14న గుండెపోటుతో మృతి చెందిన పార్టీ కార్యకర్త దొరస్వామి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి, ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. భువనమ్మను చూసి దొరస్వామి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని ఓదార్చిన భువనమ్మ ధైర్యం చెప్పారు.
తరువాత పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, చింతగుంపాల పల్లి గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 16న గుండెపోటుతో మృతి చెందిన పార్టీ కార్యకర్త జయప్రకాష్ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించి, ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.
అదే నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం, టేకుమంద గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 3న గుండెపోటుతో మృతి చెందిన పార్టీ కార్యకర్త వరిగంటి గోవిందయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి భువనమ్మ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.
చివరగా చిత్తూరు నగరం 50వ డివిజన్‌లో గత ఏడాది సెప్టెంబర్ 14న గుండెపోటుతో మృతిచెందిన పార్టీ కార్యకర్త చెరుకూరు సుజాతమ్మ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించారు. ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.