- విశిష్టతను వివరించిన వేదపండితులు
- నియమ నిష్టలతో వారాహి ఏకాదశ దిన దీక్షలు
మంగళగిరి: వారాహి దీక్షలలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పూజాధికాలు నిర్వహించారు. దీక్షాబద్ధులైన ఆయన ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించి సూర్య నమస్కారం చేశారు. పవన్ గతంలో నిత్యం సూర్య నమస్కారాలు చేసేవారు. వెన్ను సంబంధిత కారణాలతో కొద్దికాలంగా సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కావడం లేదు. అందుకు ప్రతిగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్రసహిత ఆరాధనను నిర్వర్తించారు. విజ్ఞానాభివృద్ధి, సుఖ సంతోషాలు, క్షేమానికి ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు.
ఆదివారం సూర్యారాధన..భారతీయ సంస్కృతిలో భాగం
వారాహి ఏకాదశ దిన దీక్షలో భాగంగా చేపట్టిన సూర్యారాధన, దాని విశిష్టతను వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాలశర్మ పవన్కళ్యా ణ్కు ఉపదేశించారు. ‘సమాజ వికాసం, సౌభాగ్యం ఆకాంక్షిస్తూ సూర్యారాధన చేయాలి. మన ప్రజల జీవన విధానంలో భాగమే సూర్య నమస్కారాలు. మన పురాణ, ఇతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావన ఉంది. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారు అని మహా భారతం చెబుతోంది. మహా విష్ణువు సూర్యభగవానుడి నుంచి చక్రాయుధాన్ని పొందాడు. ఆరోగ్యానికి సైతం సూర్యా రాధన మేలు చేస్తుంది. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయింది. కానీ మన సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉంది. రవి వారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారు. అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా అనవచ్చు’ అని వేద పండితులు తెలిపారు. వారాహి దీక్ష, సూర్యారాధన పూజల గురించి వివరిస్తూ ‘ఆర్ష ధర్మం, సనాతన సంస్కృతిపై అత్యంత గౌరవం, శ్రద్ధ పవన్కళ్యాణ్లో ఉన్నాయి. మహర్షిప్రోక్తమైన మంత్ర విధానంతో పూజాధి కాలు నియమనిష్టలతో సాగుతు న్నాయి. సకల వర్గాల ప్రజల మేలును ఆయన ఆకాంక్షించారు’ అని వివరించారు.