- 100 బిలియన్ డాలర్ల ఎకానమీగా విశాఖ మహానగరం అభివృద్ధి
- గ్రీన్ చానల్ ద్వారా ఐటీి పరిశ్రమలకు రాయితీలు
- ఎంత ఎక్కువగా ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సాహకాలు
- ఐపీ ఐటి అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం(చైతన్యరథం): త్వరలో మెరుగైన ఐటి పాలసీని ప్రకటించి, దేశంలోనే ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఐటి అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ గురువారం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఐటి రంగంలో ఇప్పటికే అభివృద్ధి సాధించిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్‌ల్లో అమలుచేస్తున్న పాలసీలను అధ్యయనం చేసి మెరుగైన ఐటి పాలసీని తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలు కీలకపాత్ర పోషించబోతున్నాయని చెప్పారు. దేశంలో టాప్ -10 ఐటి కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం, త్వరలో రాష్ట ప్రజానీకం ఐటి పరిశ్రమ పెట్టుబడులపై శుభవార్త వింటారు. ఐఎస్‌బి తరహాలో విశాఖలో ప్రపంచస్థాయి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తాం. ఏఐ హబ్‌గా కూడా విశాఖను తీర్చిదిద్దుతాం.
రోబోటిక్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాలతో అనుసంధానించి ఐటిని వేగవంతంగా అభివృద్ధిచేస్తాం. రాబోయే ఐదేళ్లలో విశాఖపట్నాన్ని 100 బిలియన్ డాలర్ల ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతాం. ఐటి రంగంలో హైదరాబాద్‌ను చంద్రబాబు నాయుడు ఏవిధంగా అభివృద్ధి చేశారో ఐటి పరిశ్రమదారులకు తెలుసు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడి ఐఎస్‌బిని హైజాక్ చేసి హైదరాబాద్‌కు రప్పించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 వెర్షన్‌ను చూడబోతున్నాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని నెం.1గా నిలిపిన బాబు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయించబోతున్నారు. చంద్రబాబు 1995 నాటి సిఎం మాదిరిగా పనిచేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం, విశాఖను ఐటి క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి -సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి లోకేష్ అన్నారు.
గత ఐదేళ్లలో ఐటికి అష్టకష్టాలు
గత ఐదేళ్లలో ఐటీ పరిశ్రమదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు కానీ ఒక్క చదరపు అడుగు కూడా ఐటి స్పేస్ అభివృద్ధి చేయలేదు. ఐటి పరిశ్రమలకు వెళ్లే రహదారుల్లో వీధిలైట్లు కూడా ఏర్పాటుచేయలేదు. మెరుగైన ఐటి పాలసీ రూపకల్పనకు పరిశ్రమ పెద్దలతో చర్చిస్తున్నాం, గత ప్రభుత్వం పెండిరగ్ పెట్టిన ఇన్సెంటివ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం. ప్రస్తుతం పనిచేస్తున్న ఐటి కంపెనీలు, కొత్తగా ఏర్పాటుచేసే కంపెనీలకు ఇకపై గ్రీన్ చానల్ ద్వారా ఇన్సెంటివ్స్ అందజేస్తాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటి పరిశ్రమల్లో 90శాతం విశాఖపట్నానికే రాబోతున్నాయి. విశాఖలో ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ ను అభివృద్ధి చేస్తాం. కేవలం ఐటిలో మాత్రమే కాకుండా ఫార్మా, ఎంఎస్‌ఎంఇ వంటి రంగాల్లో కూడా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి లోకేష్ చెప్పారు.
వలసవెళ్లిన వారిని రాష్ట్రానికి రప్పిస్తాం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటి రంగంలో తెలుగువారు అధికంగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయిన ఐటి నిపుణులను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తాం. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నాం, విద్యారంగంలో కేజీ టు పీజీ వరకు ప్రక్షాళన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ -100 యూనివర్సిటీల్లో ఏపీ విశ్వవిద్యాలయాలు ఉండాలన్నదే మా లక్ష్యం. కొత్తగా ఏర్పాటయ్యే ఐటి పరిశ్రమలు యువతకు ఎన్ని ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సహకాలు అందిస్తాం. ఐటి రంగంలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, కమ్యూనికేషన్స్ అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి 5జి కనెక్టివిటీ అందుబాటులో ఉండాలన్న చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా కనెక్టివిటీని అభివృద్ధి చేస్తాం. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులను పెంచి, ఎయిర్ కనెక్టివిటీ అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తాం. ఐటి రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా భారత్ ముందుకు సాగుతోంది. అందులో ఏపీ కీలకపాత్ర వహించబోతోందని మంత్రి లోకేష్ అన్నారు.
ఐటిలో మహిళా పారిశ్రామివేత్తలను ప్రోత్సహించండి
మెరుగైన ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా ఐటి రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ఐటి అసోసియేషన్ అధ్యక్షురాలు లక్ష్మి ముఖవిల్లి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ విజన్‌లో తాము కూడా భాగస్వాములమవుతామని చెప్పారు. విశాఖలో ఆఫీస్ స్పేస్ అభివృద్ధి, ఎమర్జింగ్ టెక్నాలజీపై యువతకు శిక్షణ, స్టార్టప్ పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇవ్వడం ద్వారా ఐటి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటి ముఖ్య కార్యదర్శి సౌరబ్ గౌర్ మాట్లాడుతూ… ఐటి పరిశ్రమదారుల్లో ఇప్పుడు కొత్త ఎనర్జీ కన్పిస్తోంది, ఇదే ఒరవడి కొనసాగించాలని అన్నారు. రాష్ట్రంలో ఐటి రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఐటి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఐటి పరిశ్రమ అభివృద్ధిపై ఎంప్లాయ్ మెంట్ ఏజన్సీలు, పరిశ్రమ పెద్దలతో చర్చిస్తామని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖ ఐటి పరిశ్రమలో నెలకొన్న 50శాతం సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు. విశాఖ ఎంపీ ముతుకుమిల్లి భరత్ మాట్లాడుతూ… విశాఖ నగరానికి ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని కోరారు. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐటి పరిశ్రమలకు సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్టు, హైస్పీడ్ ఇంటర్నెట్ వంటివి కల్పించడం ద్వారా ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తిచేశారు.