- జగన్ రెడ్డికి పేదలంటే అసహ్యం
- ఇది గ్రహించే జనం 11 సీట్లిచ్చారు
- జగన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు
- ధ్వజమెత్తిన టీడీపీ నేత వర్ల రామయ్య
అమరావతి (చైతన్యరథం): అధికార మాయలో ఉన్న జగన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకుని, తాను తన భార్య అప్పుడప్పుడు నివసించడానికి ప్రజల సొమ్ము రూ. 500 కోట్లు వెచ్చించి విశాఖలో రుషికొండకు గుండు కొట్టి మాయా మహల్ ను నిర్మించుకున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఆ భ్రమలో రాష్ట్రంలో పేదలు ఇళ్లు లేక అల్లాడుతున్నా జగన్ రెడ్డి మాత్రం తన కుటుంబం ఉండేందుకు అత్యంత విలాసవంతమైన భవనాలను రూ.500 కోట్ల ప్రజాధనంతో నిర్మించుకోవటం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి పెదవులపై మాత్రమే పేదల మాట.. మనసులో సిరుల మూట.. నడిచేది ధనవంతుల బాట అని ఈ మాయామహల్ ను చూస్తే స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ దేశంలోనే కాదు.. ప్రపంచంలో సైతం ఏ నాయకుడు కూడా తన నివాసానికి ప్రజా ధనం వెచ్చించి, ఇంత విలాసవంతమైన భవనం నిర్మించుకోలేదన్నారు. భారత పార్లమెంట్ నిర్మాణానికి రూ. 700 కోట్లు ఖర్చయితే జగన్ రెడ్డి మాయామహల్‌కు రూ.500 కోట్లు ఖర్చు చేశారంటే ఏమనుకోవాలి. పర్యాటక రిసార్టుల పేరుతో ఆ భవనాలు నిర్మించారని, అయితే అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజాకి ఆ భవనాలు దేనికోసం కడుతున్నారో కూడా తెలియదు. అధికారం పోతుందని తెలిసి తూతూ మంత్రంగా ప్రారంభించి చుట్టూ కంచే వేశారని వర్ల రామయ్య అన్నారు.
కీలెరిగి వాత పెట్టిన జనం
జగన్ రెడ్డి వృథా చేసిన ఆ రూ. 500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు నిర్మించవచ్చు. జగన్ రెడ్డి ఏ రకంగా చూసినా పేదల మనిషి కాదు. మదించిన ధనవంతుడు. రాష్ట్ర ప్రజలు ఇది గ్రహించే జగన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. జగన్ రెడ్డి పేదవాడి పక్షం కాదు. ధనవంతుడి పక్షమని తెలుసుకుని సరైన వాత పెట్టారు. రుషికొండ భవంతిలోని ఒక్కో బాత్ టబ్‌కు రూ. 45 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బు ఎవరికైనా ఇస్తే మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అందుకే పేద ప్రజలు జగన్ రెడ్డిని అసహ్యించుకుని కీలెరిగి వాత పెట్టారు. పేదలు తిండి లేక కడుపు కాలి అల్లాడుతుంటే ఈజిప్టు మార్బుల్స్‌తో మాయా మహల్ కడతారా?
7 స్టార్ హోటల్స్‌లో కూడా లేనంత విశాలమైన కారిడార్.. రుషికొండ మాయా మహల్‌లో ఉందంటే జగన్ రెడ్డి ఏవిధంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశాడో అర్థం చేసుకోవచ్చు. స్నానం చేసే టబ్ వద్ద ఏర్పాటు చేసిన ట్యాప్‌ల ఖర్చుతో పేదోడు ఇల్లే కట్టుకొవచ్చు. రాష్ట్రపతి, ప్రధాని కోసం అని కొత్త నాటకం ఆడుతూ వైసీపీ నేతలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. విదేశాల్లో కూడా ఇలాంటి భవనాలు చాలా అరుదుగా ఉంటాయి. జగన్ రెడ్డి పేదలకు దూరంగా ఉండే వ్యక్తి, పేదలను అసహ్యించుకునే వ్యక్తి. ఇదంతా చూస్తే జగన్ రెడ్డి రాజకీయాలకు అసలు పనికి రాడని తేలిపోయింది. జగన్ రెడ్డి దంపతుల ఆశలను రాష్ట్రంలోని పేద ప్రజలే అడియాశలు చేశారు. పేదలను కించపరిచిన ఏ పార్టీ అధికారంలోకి రాదని వర్ల రామయ్య అన్నారు.