- ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయండి
- సీమ హార్టీకల్చర్ హబ్‌కు బడ్జెట్‌లో నిధులు పెట్టండి
- అమరావతి తరహాలోనే పోలవరం `నల్లమల సాగర్‌కు నిధులు
- ప్రాజెక్టులపై కేంద్ర సహకారానికి ధన్యవాదాలు
- కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీలో సీఎం చంద్రబాబు
ఢిల్లీ (చైతన్య రథం): దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకునేందుకు జాతీయ ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాంటి పూర్వోదయ పథకంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు. ఢల్లీి పర్యటనలో భాగంగా శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన చంద్రబాబు.. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చేయూత ఇవ్వాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్య వైద్య రంగాల సదుపాయాల కల్పనకు పూర్వోదయ పథకం కీలకంగా మారుతుందని అంటూ.. ఆయా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన ఆర్దిక అవకాశాలనూ అందించగలదని పేర్కొన్నారు. విద్య, నైపుణ్యకల్పన, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులలాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ పథకం కింద ప్రాధాన్యతా క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయాలని.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
సాస్కీతో ఏపీకి చేయూత
సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులివ్వాలని కోరారు. సాస్కీకింద రెండో విడత నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి, తీవ్ర ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సాస్కీ పథకం కింద నిధులు కీలమని అభ్యర్థించారు. వీటితోపాటు సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్మాణం, ఎంఎస్‌ఎంఈ పార్కులు, హౌసింగ్, వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు మంజూరు చేయాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈ పనులకుగానూ రూ.10,054 కోట్లు సాస్కీ కింద మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
రాయలసీమ హార్టికల్చర్ హబ్
రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్ధిక సాయం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి అందించారు. ప్రకాశం జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల్లో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న 18 పంటలను సాగు చేస్తోన్నట్టు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల్లో విస్తరించిన 93 ఉద్యానవన క్లస్టర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా 33.7 లక్షలమంది రైతులకు ప్రయోజనం కల్పిస్తాయని స్పష్టం చేశారు. ఎగుమతులు చేసేందుకు వీలుగా ఉద్యాన ఉత్పత్తులు పెద్దఎత్తున ఈ ప్రాంతంలో పండుతున్నాయని తెలిపిన ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న 8.48 లక్షల హెక్టార్ల హార్టికల్చర్ సాగును 2029నాటికి 12.28 లక్షల హెక్టార్లకు విస్తరించాలని నిర్ణయించినట్టు వివరించారు. ఈ ప్రాంతంలో నీటి వనరులను మెరుగుపర్చటంతోపాటు ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతికి వీలుగా రోడ్డు, రైలు, ఓడరేవులు, ఎయిర్ కార్గో సహా లాజిస్టిక్స్ పార్కుల లాంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని స్పష్టం చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు వచ్చే మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్ధిక సహకారం అవసరమని పేర్కొన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర `2047 విజన్‌లకు అనుగుణంగా రైతుల వార్షికాదాయం రూ.2 లక్షలనుంచి 3.5 లక్షలకు పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సానుకూల అంశాలను దృష్టిలో ఉంచుకుని 2026-27 కేంద్ర బడ్జెట్‌లో రాయలసీమ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు.
కేంద్ర సహకారానికి ధన్యవాదాలు
ఏపీలో సాగునీటి ప్రాజక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి.. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదికి వచ్చే వరద జలాల్లో 200 టీఎంసీ నీటిని పోలవరం ఆనకట్టనుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించటమే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరవు నివారణ సాధ్యపడుతుందన్నారు. మూడు దశలుగా ప్రాజెక్టును చేపట్టేందుకు అయ్యే వ్యయాన్ని వివరిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రికి లేఖ అందించారు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పటికే జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు వివరిస్తూ.. దీనికి సబంధించి ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టునూ కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించినట్టు తెలిపారు. దీనికి ఆమోదం తెలిపిన వెంటనే డీపీఆర్‌ను సమర్పిస్తామని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రికి వివరించారు. ఆమరావతి రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే ఈ ప్రాజెక్టుకూ కేంద్రం చేయూత అందించాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా కరవు పీడిత ప్రాంతాలైన ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని వివరించారు. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.













