- ఐదేళ్లలో తేలేని పరిశ్రమలను ఒక్క కేబినెట్ మీటింగ్‌లోనే క్లియర్ చేశాం
- ఎలక్ట్రానిక్స్ రంగంలో 5లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా నూతన పాలసీ
- ఎలక్ట్రానిక్స్, డేటా పాలసీలపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ ప్రకటన
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక సరైన విధానమంటూ లేకుండా వ్యవహరించడం, పరిశ్రమలపై దృష్టి పెట్టకపోవటం, స్కిల్ డెవలప్‌మెంట్‌ను పట్టించుకోకపోవటం, తదితర చర్యల కారణంగా రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని రాష్ట్ర విద్య, ఐటీ. ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విమర్శించారు. శాసనసభలో గురువారం సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ, వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు.. దేశంలో తయారయ్యే సెల్ ఫోన్లలో 25 శాతం వరకు రాష్ట్రంలోనే తయారయ్యే పరిస్థితి ఉంటే, గత ఐదేళ్లలో అది 5 శాతానికి పడిపోయింది. గత టీడీపీ ప్రభుత్వంలో మేం తెచ్చిన 53 ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో 27 ఇతర రాష్ట్రాలకు పారిపోయాయి. రూ.1200 కోట్ల పెట్టుబడి పెడతాం, 7 ఎకరాల భూమి ఇవ్వండి అని టాటా గ్రూప్ సంస్థ ఓల్టాస్ అడిగినా ఇవ్వకపోవడంతో పక్క రాష్ట్రానికి వెళ్లిపోయింది. 2330 మందికి ఉపాధి కల్పించే జీఎం ఎలక్ట్రికల్స్‌ను తెలంగాణాకు పంపించేశారు.
రాష్ట్రానికి పన్నుల రూపంలో అత్యధికంగా ఆదాయం సమకూర్చే అమర్ రాజాను పొల్యూషన్, లేబర్ డిపార్ట్‌మెంట్స్‌తో ఏ విధంగా వేధించారో అందరం చూశాం. ఆనాటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్ట్ కోసం టీసీఎల్ సంస్థకు చెందిన ఉద్యోగిని నిర్బంధించారు. లోకేష్ కు ఎంతవాటా ఇచ్చారంటూ చైనా కంపెనీ ప్రతినిధులను అవమానించారు. అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. గత పాలకుల వేధింపులు తాళలేక ఫ్యాక్స్‌కాన్, యాపిల్ వంటి పరిశ్రమలు కర్నాటక, తెలంగాణా, గుజరాత్‌కు వెళ్లిపోయాయి. గత ప్రభుత్వంలో ఏనాడైనా ముఖ్యమంత్రి గానీ, మంత్రిగానీ ఒక్క పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరిపారా? పరిశ్రమల మంత్రి కోడిగుడ్డు కథలతో కాలక్షేపం చేశారు. వారి చర్యల కారణంగా ఈరోజు ఏపీ క్రెడిబిలిటీ తగ్గిపోయింది. యువగళం పాదయాత్ర సమయంలో యువతీయువకులు రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా తెస్తారని అడిగారు, మా వద్ద చంద్రబాబు బ్రాండ్ ఉందని చెప్పాను. చెప్పిన విధంగానే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. గత ఐదేళ్లలో కలిపి తేలేని పరిశ్రమలు ఒక్క క్యాబినెట్ మీటింగ్ లోనే క్లియర్ చేశాం. పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చేదిశగా ప్రయత్నాలు ప్రారంభించామని మంత్రి లోకేష్ వివరించారు.
ఒక్క సిటింగ్‌లో ఆనాడు టీసీఎల్ తెచ్చాం
2014లో ఏపీ విభజన జరిగింది. ఇది మనం కోరుకున్నది కాదు, అందరం కలసికట్టుగా 62ఏళ్లు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నాక అసంబద్ధంగా విభజన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఒకే రాష్ట్రం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావించారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురంను ఆటోమొబైల్ క్యాపిటల్‌గా, ఉమ్మడి కర్నూలు జిల్లాను రెన్యువబుల్ ఎనర్జీ క్యాపిటల్‌గా, చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్‌గా, నెల్లూరు జిల్లా డైవర్సిఫైడ్ ఇండస్ట్రీ క్యాపిటల్ గా, ప్రకాశం పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఫ్యూయల్ హబ్‌గా, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రాజధాని ప్రాంతం, ఉభయగోదావరి జిల్లాలను పెట్రో కెమికల్స్, ఆక్వా హబ్ గా, ఉత్తరాంధ్రను ఫార్మా, మెడికల్ డివైస్, ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించి ప్రణాళికలు రూపొందించారు.
ఇందులో భాగంగా 2014-19 మధ్య అత్యుత్తమ ఐటీ పాలసీ తెచ్చాం. తిరుపతి, కడప కేంద్రంగా పెద్దఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు రప్పించాం. ఐదేళ్లలో రూ. 15వేల కోట్ల పెట్టుబడులు, 93వేల మందికి ఉపాధి కల్పించేలా 53 కంపెనీలతో ఆనాడు ఒప్పందాలు చేసుకున్నాం. చంద్రబాబు కృషి ఫలితంగా దేశంలో 25శాతం సెల్ ఫోన్లు ఏపీలోనే తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్, టీసీఎల్, డిక్సన్, సన్నీ ఆప్టికల్స్ వంటి ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. పరిశ్రమలకు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చాం. అప్పట్లో నేను చైనా వెళ్లి టీసీఎల్ ప్రతినిధులతో ఒక్క డిన్నర్ మీట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. 20వేల మందికి ఉపాధి కల్పించే 300 మిలియన్ డాలర్ల పెట్టుబడిని రాబట్టాం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆనాడు మిషన్ మోడ్‌లో పనిచేశామని మంత్రి లోకేష్ తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు భారీగా రాయితీలు
ప్రధాని మోదీ నాయకత్వంలో 2014-19 నడుమ తెచ్చిన మేకిన్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ఈనాడు దేశంలో ఐ ఫోన్ తయారవుతోంది. అయితే అది ఏపీకి కాకుండా తమిళనాడు వెళ్లిపోయింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చిన అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలవల్ల ఈనాడు దేశంలో తయారయ్యే టీవీల్లో 40శాతం, ఏసీల్లో 50శాతం రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. రాబోయే రోజుల్లో మొబైల్ ఫోన్లతో పాటు పర్సనల్ కంప్యూటర్స్, ఐప్యాడ్ అసెంబ్లింగ్ కాకుండా.. టోటల్ కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడంపై దృష్టిసారించాం. ఇందుకోసం ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ పాలసీ తెస్తున్నాం. ఇందులో భాగంగా స్మాల్ అండ్ మీడియం పరిశ్రమలకు 30శాతం క్యాపిటల్ సబ్సిడీ అందిస్తున్నాం. యూనిట్‌కు 3 రూపాయల పవర్ సబ్సిడీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్రం ఇచ్చే వాటితో కలిపి కలిసి 60 శాతం వరకు రాయితీలు వచ్చే అవకాశం ఉంది.
గత ప్రభుత్వం బకాయి పెట్టిన ప్రోత్సాహకాలు చెల్లించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెద్దఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం. వివిధ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా రాష్ట్రంలోని ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో కరిక్యులమ్ రూపొందిస్తాం. కంపెనీలతో భాగస్వామ్యమై వారి అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. కంపెనీలకు అవసరమయ్యే క్వాలిటీ స్కిల్డ్ మ్యాన్‌పవర్ అందించేందుకు కృషిచేస్తున్నాం. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో కూడా అనేక ఒప్పందాలు జరుగుతున్నాయి. అనంతపురం, కర్నూలులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం. గతంలో ఎవరూ హామీ ఇవ్వని విధంగా 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించాం. అందులో భాగంగా డీఎస్సీ ప్రకటించాం. అధికారంలోకి వచ్చిన ఐదునెలల్లోనే కీలకమైన ఒప్పందాలు చేసుకున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో ముందుకెళ్తున్నాం. ఐటి మాదిరిగానే ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అభివృద్ధిచేసి 5లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించాం. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని నోడ్ ల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, కర్నూలులో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖలో మెడికల్ డివైస్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు కృషిచేస్తామని మంత్రి లోకేష్ వెల్లడిరచారు.
భారీ పెట్టుబడులే లక్ష్యంగా డేటాసెంటర్ పాలసీ
డేటా ఈజ్ ద ఫ్యూచర్. ఏఐ అనేది నేడు అనివార్యమైంది. డేటా సెంటర్లకు గ్రీన్ ఎనర్జీ కూడా అవసరం ఉంది. 20లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా భాగంగా ఆయా సంస్థలను రప్పిస్తున్నాం. డేటా సెంటర్లకు కావాల్సిన ఎకో సిస్టమ్ కల్పించి అంతరాయాలు లేని విధంగా గ్రీన్ ఎనర్జీ అందిస్తామని హామీ ఇచ్చాం. దేశంలో ఎవరూ ఆలోచించని సమయంలో 2019లో డేటా సెంటర్ పాలసీ తెచ్చాం, ఒప్పందాలు కుదుర్చుకున్నాం, భూమిపూజ కూడా చేశాం. తర్వాత ప్రభుత్వాలు మారాయి, ఐటి టవర్స్ ప్రాంతంలో రాజధాని పేరుతో కోడికత్తి టవర్స్ తేవాలని చూశారు. వచ్చే 3నెలల్లో విశాఖ ఐటీి టవర్స్‌కు భూమిపూజ చేసి డేటా సెంటర్లు తెస్తాం. డేటా రంగంలో దేశంలోకి రానున్న 300 బిలియన్ డాలర్లలో వంద బిలియన్ డాలర్లను ఏపీకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కేబుల్ ల్యాండిరగ్స్ వంటివాటిని ఏర్పాటు చేస్తాం.
రాబోయే ఐదేళ్లలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఇన్వెస్ట్ట్‌మెంట్ రాష్ట్రానికి తెచ్చేందుకు పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాం. 10 శాతం క్యాపిటల్ సబ్సిడీ, 100 శాతం ఎస్‌జిఎస్‌టి రీయింబర్స్‌మెంట్, స్టాంప్ డ్యూటీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించాం. డేటా రంగంలో 50 మెగావాట్లు లేదా రూ.5 వేల కోట్లకు పైబడి పెట్టుబడి పెట్టేవారికి కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని పాలసీలో పెట్టాం. డేటా సెంటర్లకు అవసరమైన టాలెంట్ మ్యాన్‌పవర్ కోసం ఏఐ, మిషన్ లెర్నింగ్‌పై స్టాండ్ బాక్స్ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. డేటా సెంటర్ల ఏర్పాటుకు ఫోకస్ జోన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్లే చైనాలో కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గింది. డేటా సెంటర్లను రప్పించడానికి వంద కిలోమీటర్ల పరిధిలో ఎకో సిస్టమ్ ఏర్పాటుచేయాల్సి ఉంది. ఇందుకోసం పక్క రాష్ట్రాలతో పోలిస్తే అత్యుత్తమ సబ్సిడీలు ఇస్తున్నాం.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో ముందుకెళ్తున్నాం. అందువల్లే టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్సెలర్ మిట్టల్ వంటివి పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలోకి వచ్చాయి. దేశంలోనే భారీ పెట్టుబడి మన రాష్ట్రంలో స్టీల్ సెక్టార్‌లో రావడం మనందరికీ గర్వకారణం. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టి నెం.1గా నిలపడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో ముందుకెళ్తున్నాం. దీనివల్ల పెద్దఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఐటీ పాలసీని కూడా త్వరలో ప్రకటిస్తాం, కలసికట్టుగా కొత్త పాలసీలను ప్రమోట్ చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులు అందరిపైనా ఉంది, ఇందుకు అందరూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. అన్నిరంగాల్లో ఏపీ ముందుండాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఏసీ, టీవీ, సెల్‌ఫోన్, సెమీ కండక్టర్ల తయారీ, డేటా సెంటర్స్, టూరిజం, రెన్యువబుల్, ఎంఎస్‌ఎంఇ రంగాల్లో నెంబర్ 1 గా ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యం. ఆయన ఆశయానికి అనుగుణంగా రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చి రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల సాధనకు అందరం కలసికట్టుగా పనిచేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.