- ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు
- భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా పకడ్బందీ చర్యలు
- మంత్రి నారాయణ వెల్లడి
విజయవాడ(చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు, ఆయన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆపరేషన్ బుడమేరును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విజయవాడలోని కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతూ మునిసిపల్, ఇరిగేషన్ శాఖ, ఇతర శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు వివరించారు. బుడమేరు ఆక్రమణలకు పాల్పడిన వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రత్యామ్నాయాల్ని చూపి సమస్యలను పరిష్కరించనున్నట్లు వివరించారు. వరద ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా అత్యంత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నట్లు వివరించారు. ముఖ్యంగా మునిసిపల్ ప్రాంతాల్లో నీటి ప్రవాహ మార్గాలు బాగా కుంచించుకుపోయాయని.. వీటిపై సమగ్ర సర్వే
చేసి పరిస్థితిని చక్కదిద్దనున్నట్లు వివరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నాటికి పారిశుద్ధ్య కార్యక్రమాలను పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా ఐఏఎస్ మొదలు కిందిస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఉండేందుకు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఆపరేషన్ బుడమేరును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.
భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు: మంత్రి సవిత
వరద విపత్తును ఎదుర్కోవడంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకొని ప్రతి ఒక్కరికీ సహాయ కార్యక్రమాలకు సంబంధించి మార్గనిర్దేశం చేశారన్నారు. మంత్రులు ఏమి చేయాలి.. ఎమ్మెల్యేలు ఏమి చేయాలి.. ఏ అధికారి ఏ పని చేయాలి అని చాలా స్పష్టంగా వివరిస్తూ సహాయ కార్యక్రమాలు విజయవంతంగా నడిచేందుకు రాత్రింబవళ్లు కృషిచేశారని, ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు అందించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు.