విజయవాడ (చైతన్యరథం): సాక్షి పత్రికలో ప్రచురిస్తున్న కథనాలు ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషాలు పెంచేలా ఉన్నాయని విజయవాడకు చెందిన న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన సాక్షి దినపత్రికలో ‘‘బాబు జమానా అవినీతి ఖజానా` ముంపులోనే మేసేశారు’’ శీర్షికతో ప్రచురించిన కథనం పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి అల్లర్లను ప్రేరేపించే ఉద్దేశ్యంతో తప్పుడు కథనాన్ని ప్రచురించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం సాక్షి వార్తా పత్రికలో అడ్డగోలు కథనాలు వండి వారుస్తూ.. ప్రజలను రెచ్చ కొడుతున్నారన్నారు. పూర్తి అబద్ధాలు, అసత్యాలతో, విద్వేషాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటే.. మరొకరు ఈ తప్పు చేయకుండా ఉంటారని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించి సాక్షి పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ కోరారు.