.ఎంపి మాధవ్ పై మహిళా కమిషన్,
లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలి
.మాధవ్ పై ట్వీట్ పెట్టే దమ్ము ఎ2
విజయసాయిరెడ్డికి ఉందా?
.గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలి
.తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్
అమరావతి: వైసిపి కామాంధుల పాలనలో ప్రస్తుతం మహిళలకు రక్షణ లేదని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియోకాల్ బయటకు వచ్చిన నేపథ్యంలో అనిత స్పందిస్తూ ఎంపి మాధవ్ వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్, లోక్‌సభ స్పీకర్ సుమోటోగా తీసుకొని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో మహిళలు బయటతిరిగే పరిస్థితి లేదని, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది… ఎంపీ మాధవ్ వ్యవహారంపై విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టే దమ్ముందా అని సవాల్ చేశారు. ఇలాంటి వ్యక్తులపై చట్టసభల నుంచి అనర్హత వేటువేయాలని డిమాండ్ చేశారు. తన వీడియో మార్ఫింగ్ చేశారని మాధవ్ చెబుతున్నారు, మార్ఫింగ్ చేయడానికి ఆయన ఏమైనా సినిమా హీరోనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసిపి నేతల అరాచకాలను ప్రశ్నించినవారిపైనే అక్రమ కేసులు పెట్టి.. బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. వైసీపీ చేసేవన్నీ శవ, బురద రాజకీయాలేనని దుయ్యబట్టారు. ఆర్థికనేరాలు, అవినీతి కేసుల్లో ఏ1, ఏ2లు 16 నెలలపాటు జైల్లో ఉన్నారు… తండ్రి శవం ఉండగానే సీఎం కుర్చీలో కూర్చోవా లనుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి దురదృష్ట వశాత్తు ఆత్మహత్య చేసుకుంటే మానవత్వం లేకుండా మాట్లాడటం దారుణమని అన్నారు. సోషల్ మీడియాలో వైసిపి నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని తెలిపారు. జగన్ రెడ్డి గ్రాఫ్‌పడిపోతుండటంతో జనం దృష్టిని మళ్లించేందుకు ఎన్టీఆర్ కుటుంబంపై పడుతున్నారని అనిత పేర్కొన్నారు.
మహిళా లోకం తలదించుకుంటోంది: సుజాత
గోరంట్ల మాధవ్ చేసిన పనితో మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని మాజీమంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. గతంలో అంబటి, అవంతిపై చర్యలు తీసుకుంటే ఎంపీ మాధవ్ ఈ విధంగా చేసేవాడు కాదన్నారు. గోరంట్ల మాధవ్?పై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని, లేకపోతే తెలుగు మహిళల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు.
దిశ చట్టంకింద కేసు నమోదుచేయాలి:సునీత
గోరంట్ల మాధవ్ తీరుతో యావత్ సభ్య సమాజం సిగ్గుపడుతోందని, ఆయనపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని టిడిపి అంగన్ వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేసిన సొంతపార్టీవారిపై చర్యలు తీసుకోని జగన్ రెడ్డి అండ్ కో మచ్చలేని కుటుంబాలపై విష, గ్లోబల్ ప్రచారం చేయడమంటే ఆకాశంపై ఉమ్మి వేయడమేనని అన్నారు. ఉమామహేశ్వరి మరణాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేసిన దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.