- ఉండవల్లి నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుక
- మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు
అమరావతి(చైతన్యరథం): మహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సోమవారం రాఖీ పౌర్ణమి వేడుక ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళల ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్‌కు హారతి ఇచ్చి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెమ్మలకు మంత్రి నారా లోకేష్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలిచామన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళల స్వయం ఉపాధికి కృషిచేశామన్నారు. అంతకుముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, టీడీపీ డ్వాక్రా-అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీతతో పాటు పలువురు మహిళలు మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి లోకేష్ రాఖీ శుభాకాంక్షలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కాచెల్లెళ్లందరికీ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో శభాకాంక్షలు తెలిపారు. సొంత అన్నలా ఆదరించారు.. తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించారు.. మీ అనురాగమే నా చేతికి రక్షాబంధనం.. మీ సంక్షేమం కోసం, మీకు భద్రత, గౌరవం కల్పించడం కోసం కృషి చేసి రాఖీ పండగ కానుకగా సోదరీమణులకు అందించడమే మీ సోదరుడిగా నా బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు.