- పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలి
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
మార్కాపురం(చైతన్యరథం): వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసేందుకు మార్కాపురం వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనులు జరుగుతున్న తీరుపై బుధవారం అధికారులతో సమీక్షించారు. 11,580 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా ఫీడర్ కాలువ పనులు చేపట్టామని జల వనరుల శాఖ అధికారులు వివరించారు. నల్లమల సాగర్ ప్రాంతంలో మూడు గ్యాప్స్ ఫిల్ చేసి రిజర్వాయర్ ఏర్ప డిందని, తద్వారా 53.83 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రోజుకు 200 మీటర్ల మేర కాలువ లైనింగ్ పనులు చేస్తున్నామని, 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర సైడ్ వాల్ పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఫ్లడ్ సీజన్ ప్రారంభం అయ్యే సమయానికి ఫీడర్ కాలువ సిద్ధం అయిపోతుందని వెల్లడించారు. 45 రోజుల్లో 45 టీఎంసీల మేర నీరు డ్రా చేసు కుని నల్లమల సాగర్ నింపేందుకు ప్రణాళిక చేసినట్టు అధికారులు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలు, కాలువ పనులు తదితర అంశాలను నమూనా ద్వారా వివరించారు. కంభం చెరువును కూడా నింపేలా కాలువను అనుసంధానించినట్టు తెలిపారు. స్థానికంగా వివిధ చెరువులు, నీటి వనరులను నింపేందుకు అవసరమైన స్ట్రక్చర్లను పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రూ.400 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వెలిగొండ టన్నెళ్ల పనులు పూర్తి అయ్యాక పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి ఎప్పటికప్పుడు తనకు తెలియచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.














