.విద్యుత్ బిల్లులు చంద్రబాబు హయాంలో రూ.100
.జగన్‌రెడ్డి పాలనలో రూ.300
.టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ జగన్ రెడ్డి పాలనలో జెన్కో, డిస్కమ్‌ల పరిస్థితి అధ్వాన్నంగా మారినట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తెలిపారు. జూమ్ కాల్ ద్వారా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు అధికమయ్యాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి పునాదులు గట్టిగా నిర్మించడంతో నేడు విద్యుత్ సంస్థలు దృఢంగా ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల జెన్కో, డిస్కమ్‌లు దివాలా తీసే పరిస్థితికి వచ్చాయి. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ను తయారు చేసుకోవడానికి యూనిట్ రూ.5లకు, రూ.6లకు పవర్ విక్రయ అగ్రిమెంట్లు ఉండేవని ఈ అగ్రిమెంటును 25 సంవత్సరాలపాటు చేసుకొంటే, జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వాటిని రద్దు చేశారు. అధికారంలోకి రాకముందు జగన్ రాష్ట్రంలో 25వేల మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యముందని అన్నారు. దాన్ని వినియోగించకుంటూ యూనిట్ రూ.3 కే విద్యుత్ తయారు చేయొచ్చు అని ప్రగల్భాలు పలికారు. దాని వల్ల చాలా తక్కువ ధరకే ప్రజలకు విద్యుత్ విక్రయించొచ్చు అని నమ్మబలికారు. ఇప్పుడు విద్యుత్ కొనుగోలుకు ఎందుకు ఇబ్బంది పడాల్సివస్తోంది? రాష్ట్రంలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతోందో తెలియడంలేదు. నేడు ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్ ను అందించలేకపోతున్నారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన విద్యుత్ అగ్రిమెంట్లను రద్దు చేసి ప్రజలకి రూ.20 నుంచి 22లకు విక్రయిస్తున్నారు. అయినా విద్యుత్ అందని పరిస్థితి. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 7సార్లు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. సెప్టెంబర్ నుంచి 8వ సారి ప్రజల పై భారాన్ని వేయడానికి సిద్ధమయ్యారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఫిబ్రవరి 2020లో విద్యుత్ ఛార్జీలు యూనిట్ కి 90పైసలు పెంచి దాదాపు రూ.13 వందల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. రెండు నెలలకే స్లాబ్ మార్పులు చేసి రూ.2వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. 2020 ఏప్రిల్‌లో యూనిట్‌కి రూ.10 లు, సెప్టెంబరు 2021లో ట్రూఅప్ ఛార్జీలు అని దాదాపు రూ.3వేల కోట్లు, సెప్టెంబరులో రెగ్యులర్ ఛార్జీలు అని రూ.4వేల కోట్లు, ఫ్యూయల్ ఛార్జీలు పేరుతో 3 నెలలకు ఒకసారి రూ.1000కోట్లు వసూలు చేశారు. 2022 ఏప్రిల్ లో 45శాతం విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.5వేల కోట్ల భారాన్ని ప్రజల పై మోపారు. వచ్చే సెప్టెంబరులో ట్రూఅప్ ఛార్జీలు పెంచడానికి సిద్ధమయ్యారు. దీని వల్ల ఎన్ని కోట్ల రూపాయల భారం ప్రజలపై పడనుందో తెలియదు.
చంద్రబాబు హయాంలో రూ.100 అయితే ఇప్పుడు రూ.300
చంద్రబాబు హయాంలో రూ.100లు కరెంటు బిల్లు చెల్లిస్తే నేడు రూ.300లు చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారాన్ని ప్రజలపై మోపితే సామాన్య ప్రజలు ఏ విధంగా బతకాలి? రూ.20వేల కోట్లు ప్రజల నుంచి వసూల్ చేస్తూ రైతులకి ఉచిత కరెంటుని సరఫరా చేస్తున్నాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. రైతుల ఉచిత విద్యుత్ సబ్సిడీలను డిస్కమ్ లకు చెల్లించకుండా 25వేల 5వందల కోట్ల రూపాయలు పెండిరగ్ పెట్టారు. ప్రశ్నిస్తే తెలుగుదేశం హయాంలో జరిగిందని తప్పడు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారం నుంచి తప్పుకునే సమయానికి రూ.18వేల కోట్ల బకాయిలు మాత్రమే వున్నాయి. ఆగష్టు, సెప్టెంబరులో డ్యూ డేట్ వచ్చింది. వాటిని చెల్లించడానికి ఆ సమయానికి డ్యూ డేట్ రాలేదు. నేడు జగన్ రెడ్డి 3 సంవత్సరాల నుంచి పెండిరగ్‌లో పెట్టారు. జెన్కో, డిస్కమ్స్ దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. అందువల్లే కేంద్రం చెప్పిన మాటల్ని రాష్ట్ర ప్రభుత్వం వినాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రం రాష్ట్రానికి ఆంక్షలు పెడుతోంది. ఈ దివాలా పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మవలసివస్తోంది. నేడు 26 వేల మంది విద్యుత్ కార్మికులు కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్నారు. వాళ్లందరి ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి నేడు పట్టించుకున్న పాపాన పోలేదు. 2020 జూలైలో విద్యుత్ కార్మికులు జగన్ రెడ్డికి మెమోరాండమ్ ఇస్తే తీసుకొని పక్కన పడేశారు. డిస్కం రంగాన్ని దిక్కులేని రంగంగా మార్చారు. జెన్కో ఉద్యోగస్థులకు సమయానికి జీతాలు అందడంలేదు. వారికి చట్టపరంగా రావాల్సిన పీఆర్సీ ఇంతవరకు ఇవ్వలేదు. ఎవరెవరకి జీతాలు వస్తున్నాయో పరిశీలించి రివర్స్ పీఆర్సీ జీవో ఇచ్చారు. ఉద్యోగస్థులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. కాంట్రాక్టు ఉద్యోగస్థులకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం చేసే తప్పుడు పనుల వల్ల విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. డిస్కమ్ పేరుతో రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారు. తెచ్చిన అప్పు దేనికి వాడారో తెలియదు. విద్యుత్ తో సహా అనేక రంగాలను నాశనం చేశారు. విద్యుత్ సామర్థ్యం పెంచడంలేదు. బాగుపరచాలన్న ఆలోచన కనిపించడంలేదు. బాదుడే బాదుడు అని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు అందరినీ ధరలతో తెగ బాదుతున్నారు. ఎన్నికలకు ముందు తక్కువ ధరకే విద్యుత్ ను అందిస్తామని చెప్పిన మాట ప్రస్తుతం ఏమైందో చెప్పాలని జీవీ రెడ్డి డిమాండ్ చేశారు.