- తొక్కిసలాటలో ఒకరి మృతి
- పలువురికి గాయాలు
- బస్సుల్లేక అవస్థలు పడ్డ ప్రయాణీకులు
- కవరేజీకి రావద్దంటూ మీడియాకు నోటీసులు
- సభకు రాలేదని వైసీపీ నేతల దాడులు
అమరావతి, చైతన్యరథం: ‘సిద్ధం’ సభలకు జనాల్ని బలవంతంగా తరలిస్తున్న వైసీపీ నాయకత్వం ఆ సభలను ఏదో విధంగా సక్సెస్ చేయాలని చేయరాని అరాచకమంతా చేస్తున్నారు. సభలకు రానని చెప్పిన ప్రజలపై దాడులు కూడా చేస్తున్నారు. మరోవైపు సభ నిర్వహణ సరిగ్గా చేయడకపోవడంతో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందగా, పలువురు గాయాల పాలయ్యారు. అంతకు ముందు అద్దంకి మండలం గోపాలపురం వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో సిద్ధం సభకు వస్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. బస్సు కింద పడి చనిపోయిన వ్యక్తిగా నర్సారావుపేటకు చెందిన బాల దుర్గగా గుర్తించారు. మరోవైపు రాష్ట్రంలో సీఎం జగన్ సభ ఎక్కడ జరిగినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో శనివారం వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3500 ఆర్టీసీ బస్సులను ఆ సంస్థ కేటాయించింది.
వైకాపా కార్యకర్తల తరలింపునకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచీ బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బాపట్ల, చీరాల, మార్కాపురం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంపై ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడెక్కడో సభ జరిగితే తమకు ఇబ్బందులేంటని నిలదీశారు. నెల్లూరు జిల్లా నుంచి 332, పల్నాడు నుంచి 300, గుంటూరు నుంచి 225 బస్సులను ‘సిద్ధం’ సభకు తరలించారు. చీరాల డిపోలో మొత్తం 96 బస్సులు ఉండగా వాటిలో 80 వరకు సభకు కేటాయించారు. దీంతో చీరాల నుంచి గుంటూరు, ఒంగోలు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం నుంచి 70 బస్సులు వెళ్లాయి. మరోవైపు సభకు వెళ్లే మార్గాల్లో వాహనాలను పోలీసులు నిలిపి వేశారు.
సభ కవరేజీకి రావద్దంటూ మీడియా సిబ్బందికి నోటీసులు
మేదరమెట్లలో శనివారం వైకాపా నిర్వహించిన ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లిద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. వాటిని తీసుకోవాలంటూ మీడియా ప్రతినిధులకు స్థానిక పోలీసులు ఫోన్లు చేశారు. ఎస్పీ కార్యాలయం నుంచి సెక్షన్ 149 నోటీసులు వచ్చాయని వారు చెప్పారు. సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సిబ్బందితో పాటు యూటీఎఫ్ నేతలు, తెదేపా నేతలు, కార్యకర్తలకూ జారీ చేశారు. కవరేజీకి వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేశారు.
సభకు రాలేదని దాడులు
బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రామకూరులో సిద్ధం సభకు రాలేదని ధనచక్రవర్తి అనే వ్యక్తిపై వైసీపీ నేతల దాడి చేశారు. సిద్ధం సభకు రావాలన్న వైసీపీ నేతలు ఆంజనేయులు, రామాంజనేయులు ఆర్డర్ వేశారు. మిర్చి కోతల వల్ల సిద్ధం సభకు రాలేనని ధమచక్రవర్తి చెప్పారు. పిలిచినా రావా అంటూ కర్రలు, రాడ్లతో వైసీపీ నేతలు దాడి చేశారు. ధనచక్రవర్తికి తీవ్రగాయాలు కావడంతో అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.