- తాడేపల్లి పెద్దల ఒత్తిళ్లే కారణమా.. బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే
- నాలుగు డంప్‌ల్లో భారీగా నగదు, మద్యం, వస్తుసామగ్రి
- దీని వెనుక చెవిరెడ్డి, ఆయన తనయుడు
- ఇద్దరినీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలి
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్
అమరావతి(చైతన్యరథం): ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వైసీపీ తాయిలాలతో సిద్ధం చేసిన భారీ డంప్‌లు బయటపడ్డా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రేణిగుంట ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద వైసీపీ నేతల ఆధ్వర్యంలో నగదు, మద్యం, వస్తు, ప్రచార సామగ్రికి సంబంధించిన భారీ నిల్వలు బట్టబయలైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని నిలదీశారు. ఈ డంప్‌లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ఇలాంటివి 4 డంప్‌లు రేణిగుంటలో ఉన్న విషయం టీడీపీ నేతలు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడం వెనుక తాడేపల్లి పెద్దల ఒత్తిళ్లు ఉన్న విషయం వాస్తవం కాదా? కుక్కర్లు, ఫ్యాన్లు, గొడుగులు వంటి 52 రకాల సామగ్రితోపాటు నగదు కూడా ఉన్నట్లు సమాచారం వస్తున్నా ఇంతవరకు కలెక్టర్‌గానీ, ఆర్వో గానీ చర్యలు తీసుకోలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే మద్యం, మందు, తాయిలాలను పంపిణీ చేసేందుకు వైసీపీ నేతలు పన్నిన కుట్రలను సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు. ఈ డంప్ వెనుక ఉన్న ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపైనా, చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డిపైనా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి. ఈ డంప్ వెనుక ఉన్న తాడేపల్లి పెద్దలపై కూడా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.