- ఎన్నికల నోటిఫికేషన్ నాటికి వైసీపీ అంతా ఖాళీ
- టీడీపీలోకి రోజురోజుకూ పెరుగుతున్న చేరికలు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు
అమరావతి,చైతన్యరథం: జగన్మోహన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, మరో 100 రోజులు అందరం కష్టపడితే మన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం వస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శక్రవారం చంద్రబాబు సమక్షంలో ఆరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రోజురోజుకీ వైసీపీ నుంచి టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి వైసీపీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలకు తీరని అన్యాయం చేశాడన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధల్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని, ఎన్నో ప్రభుత్వాల్ని చూసి ఉంటాం కానీ స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇంతటి దుర్మార్గమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఇకపై చూడబోము కూడా అని చెప్పారు. రాష్ట్ర పౌరులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలు వైసీపీకి-టీడీపీకి మధ్యనో, వైసీపీకి-జనసేన మధ్యో జరుగుతున్నవి కావని, 5కోట్ల ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.నాలుగేళ్ల 7 నెలల పాలనలో అన్యాయం, అరాచకం, దోపిడీలు, దుర్మార్గాలేనని చెప్పారు. ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ లేదని, జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించాడని, అందుకే జగన్ ను అభిమానించేవారు, వైసీపీవారు కూడా రాష్ట్రానికి పట్టిన శని ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు.జనసేన-టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని, రెండు పార్టీలను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేయాలని కోరారు. 4 ఏళ్ల 7 నెలలపాటు కష్టాలు కన్నీళ్లు భరించామని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. జైళ్లకు పంపినా.. వేధించినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆస్తులు, ప్రాణాలు కోల్పోయినా లెక్కచేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకోసం పనిచేయాలని కోరారు.