- దిశ కన్నా శక్తివంతమైన కూటమి యాప్ ప్రజలే గుర్తించారు
- కోటిన్నర మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు
- గత ప్రభుత్వం కన్నా 7.2 శాతం నేరాలు తగ్గాయి
- హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి, (చైతన్యరథం): గత ప్రభుత్వం కన్నా 7.2 శాతం నేరాలు తగ్గితే క్రైమ్ తగ్గినట్లు కాదా?
అని హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ ప్రజాప్రతినిథులపై ఎదురుదాడికి దిగారు. బుధవారం శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు ఆమె ఘాటుగానే సమాధానం చెప్పారు. లెక్కలు తీసి మరీ సభను మార్మోగించారు. గణాంకాలతో సహా చెబుతున్నా సందేహాలెందుకని నిలదీశారు. 2023 జూన్ నుంచి 2024 జనవరి వరకూ మహిళలపై జరిగిన నేరాలు సంఖ్య 18,114 కాగా
2024 జూన్ నుంచి 2025 జనవరి వరకూ మహిళలపై జరిగిన నేరాలు 16,809 కేసులని లెక్కలు చెప్పారు. మహిళల భద్రత మీద కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఐజీ స్థాయి మహిళా పోలీస్ ఆధ్వర్యంలో రూ.17 కోట్లతో ప్రత్యేక రక్షణ విభాగం ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ స్థాయి మహిళా పోలీసులు అందులో భాగమన్నారు. దిశ యాప్ కన్నా మెరుగైన సేవలతో శక్తి యాప్ పని చేస్తోందన్నారు. దిశ యాప్‌ను పురుషులతో కూడా టార్గెట్ పెట్టి డౌన్ లోడ్ చేయించారన్నారు. శక్తి యాప్‌ను స్వతంత్రంగా 5,279 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. 1,49, 93,069 మంది శక్తి యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు.
కేవలం సీఎం ఆవిష్కరించిన 10 రోజుల్లోనే కోటిన్నర మంది శక్తి యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారని వెల్లడిరచారు. స్కూళ్లు, కాలేజీల వద్ద శక్తి టీంలను ఏర్పాటు చేసి ఈవ్‌టీజింగ్ లేకుండా చర్యలు చేపట్టామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా గ్రామీణస్థాయిలో కూడా నైట్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యాప్ ఉపయోగించి నైట్ షెల్టర్ కోరితే పోలీసుల సంరక్షణలో ఆడబిడ్డలకు రాత్రివేళల్లో రక్షణ కల్పిస్తామన్నారు. 26 జిల్లాలలో 26 నైట్ షెల్టర్లు ఉన్నాయని, మరిన్ని పెంచుతామని వెల్లడిరచారు దిశ యాప్ ద్వారా 21 రోజుల్లో శిక్ష అనేది ట్రాష్ అన్నారు. సీసీ టీవీలు పెట్టలేదు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ని పూర్తి చేయలేదు, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం పక్కనపెట్టి ఎలా వేగంగా శిక్షించగలరో వివరిస్తే వింటామని ఎద్దేవా చేశారు. లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అనకాపల్లిలో మంగళవారం జరిగిన ట్రాన్స్‌జెండర్ హత్యను సీసీ ద్వారా 18 గంటల్లోనే ఛేదించామన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ వల్లనే నిందితుడిని పట్టుకోగలిగామన్నారు.
గన్నవరంలో బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ముందు అదృశ్య కేసుగా నమోదయిందన్నారు. ఆ కేసును కృష్ణా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో డ్రోన్లు, సీసీ టీవీల ద్వారా 3 రోజుల్లో ఛేదించామన్నారు. 24 గంటల్లోపే నిందితులను గుర్తించిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎన్ని శిక్షలు పడ్డాయని ప్రశ్నించారు. గత మూడు నెలల కాలంలోనే విజయనగరంలోనే మూడు ఫోక్సో కేసుల్లో 20-25 సంవత్సరాలు శిక్ష పడిరదన్నారు. ఆడబిడ్డలపై ప్రతి గంటకు 3 అఘాయిత్యాలు అని రాసిన సాక్షి పత్రిక గత వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో గంటకు ఐదు అఘాయిత్యాలు జరిగితే ఎందుకు రాయలేదన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అఘాయిత్యాలు తగ్గినట్లే కదా? తెలియడం లేదా? అని నిలదీశారు. గంజాయి సాగుని 90శాతం తగ్గించాం, ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహిళల భద్రతపై చిత్తశుద్ధితో పనిచేసేది కూటమి ప్రభుత్వమేనన్నారు.