. అరాచకానికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ
. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
అమరావతి: రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఛీత్కరించుకుంటున్నారని చెప్పారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని జగన్ దోచుకుతింటున్నాడని మండిపడ్డారు. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను జగన్ రెడ్డి ధ్వంసం చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఐప్యాక్ సర్వేలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని నివేదికలు వచ్చినట్లు తెలిపారు. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ప్రతిపక్ష నేతపై దాడులు చేయిస్తున్నాడని చెప్పారు. కుప్పం వేదికగా ప్రజాస్వామ్యాన్ని జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి ఖూనీ చేశారన్నారు. జగన్ కుటుంబం రూ.10వేల కోట్ల విలువ గల లేపాక్షి భూములు దోచుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ జగన్, భారతి, విజయసాయిరెడ్డి, కుటుంబసభ్యులు ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు, వేధింపులతో ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికే కుప్పంలో జగన్ రెడ్డి అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కనుసన్నల్లో చంద్రబాబుపై దాడికి యత్నించారని చెప్పారు. చంద్రబాబు పర్యటనలో ఏపీ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల తలలు వైసీపీ కార్యకర్తలు పగులకొట్టినా వారిపై పోలీసు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలను బెదిరించడానికే కుప్పంలో 60 మందిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తున్న కొంతమంది పోలీసు అధికారులు రానున్న కాలంలో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఏపీలో ఇటువంటి అరాచకపాలన ఎన్నడూ చూడలేదన్నారు. జగన్, పెద్దిరెడ్డి ఉడత ఊపులకు టీడీపీ భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎన్ని కేసులు, నిర్బంధాలు, అరెస్టులకైనా తాము సిద్ధమని బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు.