అమరావతి,చైతన్యరథం: వైసీపీలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్న నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పుల ప్రక్రియలో భాగంగా మూడో జాబితాను గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ప్రకటించారు. ఇప్పటికే టిక్కెట్లు నిరాకరిస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేసిన, ఇప్పటికే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన నేతల సీట్లనే ఈ సారి ప్రకటించారు. పార్టీకి రాజీనామాలు చేస్తున్న వారి జాబితా అంతకంతకూ పెరుగుతుండటంతో మూడో జాబితా ఆచితూచి ప్రకటించినట్లు కనపడుతోంది. ఈ సారి ఆరు ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలను కొత్త ఇన్‌ఛార్జులను ప్రకటించారు. అయితే వీరిలో 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఇద్దరు ఎంపీలకు సీట్లు నిరాకరించారు. కాగా మరో ఇద్దరు ఎంపీలను ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులుగా నియమించారు. ఇద్దరు ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలకు ఇన్‌ఛార్జులుగా నియమించారు. టిక్కెట్లు నిరాకరించిన 10 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికే చెందిన వారు ఉండడం గమనార్హం. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మంది నియోజకవర్గ ఇన్‌ఛార్జ్జులను ప్రకటించిన సంగతి తెలసిందే. ఈ రెండు జాబితాల్లో 13 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించారు. మూడో జాబితాను చాలా జాగ్రత్త పడి రూపొందించినట్లు కనిపిస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ల జోలికి పోలేదు. ఇది మూడో జాబితా కాగా ఇంకా చాలా జాబితాలు ఉన్నట్లు స్పష్టమౌతోంది. సీట్లు నిరాకరించిన ఎమ్మెల్యేల జాబితాలో చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలిజా, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, దర్శి ఎమ్మెల్యే ఎం వేణుగోపాల్, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మదనపల్లె ఎమ్మెల్యే ఎం నవాజ్ భాషా, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే జే సుధాకర్‌బాబు, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిó, గూడూరు ఎమ్మెల్యే వీ వరప్రసాద్‌రావు ఉన్నారు. పెడన ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్‌ను పెనమలూరు స్థానానికి పంపారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, కర్నూల్ ఎంపీ సంజీవ్‌కుమార్‌లకు సీట్లు నిరాకరించారు. కాగా అలూరు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరామ్‌ను కర్నూల్ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు. తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్ధిగా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలోనే ప్రకటించగా ఎంపీ స్థానానికి బొత్సా రaూన్సీని అభ్యర్థిగా ప్రకటించారు. కొత్త గా ప్రకటించిన ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలకు ఇన్‌ఛార్జుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.