- ఎక్కడ ఘోరం జరిగినా దిగజారుడు విమర్శలు
- చిన్నారులపై హత్యాచారాలను ఖండిరచాల్సిందే
- అయితే వైసీపీ నేతల నీచ రాజకీయాలు తగవు
- ధ్వజమెత్తిన హోం మంత్రి అనిత
- వడమాలపేట హత్యాచార బాధిత బాలిక కుటుంబానికి పరామర్శ
- రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత
- ఇల్లు నిర్మించి, బాలిక తండ్రికి ఉద్యోగం ఇస్తామని హామీ
తిరుపతి (చైతన్యరథం): మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచార ఘటనలను వైసీపీ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు రాజకీయ రాబందుల్లా మారిపోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హోం మంత్రి అనిత ఆదివారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అంతకుముందు చిన్నారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. చిన్నారి తల్లి కోరిక మేరకు ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. బాలిక తండ్రికి ఉద్యోగం కల్పిస్తున్నామని చెప్పారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి హత్యాచారాలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అభం,శుభం తెలియని చిన్న పిల్లను చాక్లెట్ పేరుతో తీసుకెళ్లి హత్యాచారం చేయడం తల దించుకునే చర్య అని ధ్వజమెత్తారు.
చిన్న పిల్లల మరణాలపైనా రాజకీయమా?
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. కామాంధులు రెచ్చిపోయిన ప్రతి చోటకు చేరి బాలికలు, మహిళలపై అఘాయిత్యాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు వైసీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని హోంమంత్రి ధ్వజమెత్తారు. ఇలాంటి సమయంలో బుద్ధి ఉన్నవారు ఎవరూ రాజకీయం చేయరు. చిన్న పిల్లల మరణాలను రాజకీయంగా వాడుకునే రాబందులు ఉన్నారు. దిశ చట్టం యాప్ ఉంటే ఇలాంటివి జరగవని వైకాపా నేతలు అంటున్నారు. అసలు ఉనికిలోనే లేని దిశ చట్టం గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. గత ఐదేళ్లలో సగటున ప్రతి 8 గంటలకు మహిళలపై ఒక దాడి జరిగింది. మరి అప్పుడు దిశ చట్టం ఏమి చేసింది. దిశ యాప్ అంటూ వైసీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. క్రైం రికార్డు చూస్తే గత ఐదేళ్ళలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఘటనలు జరిగాయి. అప్పుడు ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించింది. ప్రస్తుతం ఎక్కడ ఘటన జరిగినా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధిత కుటుంబాలకు అండగా నిలవటమే కాకుండా, నిందితులను గంటల్లోనే అరెస్ట్ చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అనేక హత్యాచారాలు జరిగాయి. అప్పుడు బయటకు రాని వైసీపీ నేతలు నేడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ లబ్ది కోసం పాకులాడడం సరైనది కాదు. దేవుడు కూడా ఇలాంటి వారిని క్షమించడని హోం మంత్రి అనిత దుయ్యబట్టారు.
షర్మిలకు జరిగిన అన్యాయం వైసీపీ నేతలకు పట్టదా..
గత ప్రభుత్వ హయాంలో సీసీ కెమెరాలు నిర్వీర్యం చేసి గంజాయి, నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చి యువత వాటికి బానిసలుగా మారేలా వ్యవహరించారు. అంతే కాకుండా గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారని అనిత మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి అధికార పార్టీపై అవాకులు, చవాకులు పేలిన వైసీపీ నేతలు.. ఆ పార్టీ అధినేత జగన్ చేతిలో మోసానికి గురైన షర్మిల వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్తున్న ఆ నాయకులంతా అన్న జగన్ వల్ల వంచనకు గురైన షర్మిలకు అండగా ఎందుకు నిలబడలేదని అనిత సూటిగా ప్రశ్నించారు.
రోజా విమర్శలు హాస్యాస్పదం
వడమాలపేటలో చిన్నారిపై హత్యాచారం చాలా బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండిరచాలన్నారు. ఈ కేసులో నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అనిత అన్నారు. మూడు నెలల్లో శిక్ష పడేలా ప్రత్యేక కోర్టుకి కేసుని తీసుకెళ్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. నిందితుడికి వ్యతిరేకంగా పటిష్టమైన సాక్షాధారాలను పోలీసులు కోర్టుకు నివేదిస్తారన్నారు. నేరాల అదుపునకు రాష్ట్రంలో సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రతి ఆడబిడ్డను సొంత బిడ్డగా చూస్తున్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదు. మద్యంపై మాజీ మంత్రి రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదం. వైసీపీ హయాంలో మద్యం ఏరులై పారింది. ఈ విషయం అప్పుడు రోజాకు తెలియలేదా అని హోం మంత్రి అనిత ధ్వజమెత్తారు.
మహిళల భద్రతకు పటిష్ట చర్యలు
ఏపీలో గంజాయి సాగు అరికట్టేందుకు డ్రోన్‌లు వినియోగిస్తున్నట్లు అనిత వెల్లడిరచారు. గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు త్వరలో ప్రత్యేక కిట్లు అందుబాటులోకి రానున్నట్లు ఆమె తెలిపారు. గంజాయి సాగును అరికట్టి, గంజాయి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. నార్కోటిక్ వింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. గంజాయిపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తున్నాం. బాధితుల పక్షాన నిలబడడమే కాదు, ఇలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మహిళా సాధికారతకు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం గతంలోనే మహిళా సాధికారత దిశగా మొదటగా మహిళా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అనిత స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే..
కేవీబీ పురం మండలానికి చెందిన దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఇద్దరి పిల్లలతో కలిసి అత్తగారి ఊరైన వడమాలపేట మండలానికి వచ్చారు. చిన్న పిల్లలిద్దరినీ వారి అమ్మమ్మ వద్ద ఉంచి ఇరువురు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే పిల్లలకు మామ వరసయ్యే సుశాంత్ అనే వ్యక్తి తరచూ వారి వద్దకు వచ్చేవాడు. శుక్రవారం సాయంత్రం చాకెట్లు ఇస్తానని చెప్పి మూడున్నరేళ్ల బాలికను పాఠశాల సమీపానికి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని మరుగు కాలువలో పూడ్చిపెట్టేశాడు. అదే రోజు సాయంత్రం పని నుంచి ఇంటి వచ్చిన బాలిక తల్లిదండ్రులకు కుమార్తె కనిపించలేదు. వారు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దీంతో హత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు హోంమంత్రి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.