- నకిలీ పత్రాలతో భూములు కబ్జా చేశారు
- పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లో బంగారాన్ని తీసుకెళ్లారు
- 27వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు విన్నపాల వెల్లువ
- ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి భరోసా
అమరావతి(చైతన్యరథం): సమస్యలతో ‘ప్రజాదర్బార్’కు తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 27వ రోజు జోమవారం ‘‘ప్రజాదర్బార్’’ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్యల సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లో బంగారాన్ని తీసుకెళ్లారు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి విచారణ లేకుండా తన భర్తపై అక్రమంగా కేసు నమోదుచేసి, ఇంట్లోని 148 గ్రాముల బంగారాన్ని పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్లారని మంగళగిరికి చెందిన అందె స్వర్ణలత.. మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదుచేశారు. అప్పటి సీఐ అంకమరావు, ఎస్‌ఐ నారాయణ తమను వేధించారని, విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు. దివ్యాంగురాలైన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లికి చెందిన ఎస్.కృష్ణవేణి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం తొలగించిన దివ్యాంగ పెన్షన్ ను పునరుద్ధరించాలని నవులూరుకు చెందిన సోలా శ్రీదేవి కోరారు. రోజువారీ పనులతో జీవనం సాగించే తనకు రాజధాని రైతు కూలీ పెన్షన్ మంజూరు చేయాలని ఉండవల్లికి చెందిన టి.కిషోర్ విజ్ఞప్తి చేశారు. భర్త చనిపోయిన తనకు ముగ్గురు పిల్లల పోషణ కోసం ఎయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ ఉద్యోగం కల్పించాలని తాడేపల్లికి చెందిన కే.ప్రసన్న కోరారు. వైసీపీ నాయకుల అండతో ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చౌటూరులో తమ 220 గజాల స్థలాన్ని కబ్జా చేశారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరికి చెందిన అడపా మస్తాన్ రావు విజ్ఞప్తి చేశారు. నర్సింగ్ కోర్సు సర్టిఫికెట్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని, సర్టిఫికెట్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాతూరుకు చెందిన సీహెచ్ అనూష కోరారు. ఈఎస్‌ఐ కింద గుండె ఆపరేషన్ చేయించుకున్న తనకు బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కాజకు చెందిన చెందిన కే.శివరామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
ఇంటికి దారి ఇవ్వకుండా వైసీపీ నేతలు అడ్డంగా గోడ నిర్మించారు
నూతనంగా నిర్మించుకున్న తన ఇంటికి దారి ఇవ్వకుండా వైసీపీ నేతలు అడ్డంగా గోడ కట్టారని నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గండిపాలెంకు చెందిన డి.తిరుపతమ్మ.. మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రశ్నించిన తనపైనే తిరిగి కేసు నమోదు చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
ఎలాంటి ఆధారం లేని తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడకు చెందిన హరిత విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
అగ్రికల్చర్ లో డిప్లమో చేసిన తాను ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సీడ్ ప్రొడక్షన్ లో శిక్షణ పొందానని, తగిన ఉద్యోగం కల్పించాలని ప్రకాశం జిల్లా గద్దలకుంటకు చెందిన పిల్లి ప్రసన్న కుమారి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని పల్నాడు జిల్లా మేళ్లవాగుకు చెందిన యు.వెంకటేశ్వర్లు కోరారు. పరిశీలించి ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
వారసత్వంగా వచ్చిన తమ ఏడెకరాల అసైన్డ్ భూమిని వైసీపీ నేతలు నకిలీపత్రాలతో కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం సాతానుపల్లికి చెందిన కంచర్ల హజరత్తమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు
డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకంలో నిబంధనలు సడలించి వ్యాయామ ఉపాధ్యాయులకు తగిన న్యాయం చేయాలని సిబ్బంది కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.