.ఉచితంగా రాసివ్వాలని దాడిచేసి గాయపర్చారు
.పోలీసులు కనీసం కంప్లెయింట్ కూడా తీసుకోలేదు
.ఎస్పీ, కలెక్టర్ కు చెప్పినా పట్టించుకునే నాధుడు లేడు
.చంద్రబాబు ఎదుట బాధితుడు గంగాధర్ ఆవేదన
అమరావతి: ‘‘అయ్యా.. పొలమే జీవనాధారంగా బతుకుతున్నాం.. తమకున్న కొద్దిపాటి భూమిని ఆక్రమించి వైసిపి నేతలు మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు.. న్యాయం చేయండయ్యా’’ అంటూ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలం పందిళ్ల పల్లి గ్రామానికి చెందిన కొమ్మెర గంగాధర్ అనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు మొరపెట్టుకున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కుటుంబంతో కలసి వచ్చిన గంగాధర్ వైసిపి నేతల కారణంగా తాము ఏవిధంగా ఇబ్బందుల పాలవుతున్నామో ఏకరువు పెట్టారు. రాయచోటి నియోజకవర్గానికి చెందిన గంగాధర్ కు 3 ఎకరాల 55 సెంట్ల పొలం ఉండగా, ఆ భూమిని వైసిపి నేతలు ఆక్రమించి బయటకు నెట్టేశారు. అంతేగాక సంబంధిత భూమిని ఉచితంగా తమకు రాసిచ్చేయాలని స్థానిక వైసిపి నేత ఆర్ రాజేంధర్ రెడ్డి తీవ్రంగా బెదిరించారు. గంగాధర్ అంగీకరించకపోవడంతో ఆయనపై పలు మార్లు దాడి చేశారు. దాడి కారణంగా తాను అసుపత్రి పాలయ్యానని.పోలీసులు కనీసం కేసు కూడా తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ తనను పొలంలోకి రానివ్వడం లేదని..రెవెన్యూ అధికారుల నుంచి ఎస్పీ, కలెక్టర్ వరకు కలిసినా న్యాయం జరగలేదని గంగాధర్ వాపోయారు. తనకు సాయం చెయ్యాలని గంగాధర్… చంద్రబాబును కోరగా, భయపడొద్దు… తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.