- ఏజెన్సీలో లేటరైట్ తవ్వకాల ముసుగులో బాక్సైట్ తవ్వకాలు
- తవ్విన బాక్సైట్ భారతీ సిమెంట్ కు తరలింపు
- నేను అరకు కాఫీని ప్రమోట్ చేస్తే.. జగన్ గంజాయిని చేస్తున్నాడు
- ధరల పెంపుతో పేదల నడ్డి విరిచిన ప్రభుత్వమిది
- గిరిజనులకు 16 సంక్షేమ పథకాలు రద్దుచేసిన జగన్
- టీడీపీ వచ్చాక గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక
- మా ప్రభుత్వం రాగానే జీవో నం.3 పునరుద్ధరణ
- అరకు రా…కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు
- చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు
అరకు: ఏజన్సీ ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల పేరుతో సీఎం జగన్ బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉత్తరాంధ్రను వైసీపీ మాఫియా మింగేసిందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరల పెంపుతో పేదల నడ్డి విరిచిన జగన్..టీడీపీ హయాంలో గిరిజనులకు అమలు చేసిన 16 సంక్షేమ పథకాలను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ` జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. జీవో నం.3 రద్దుపై జగన్ నోరు మెదపలేదని, తమ ప్రభుత్వం రాగానే జీవో నం.3ను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని అరకులో శనివారం రా.. కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు సమక్షంలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు టీడీపీలో చేరారు. ఈ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ….ఐదేళ్లలో గిరిజనులకు జగన్ రెడ్డి చేసిందేమిటని ప్రశ్నించారు. అరకు ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయం. ఎక్కడ చూసినా కాఫీ తోటలతో పచ్చని పంటలతో అందంగా ఉంటుంది. బంగారం పండిరచే భూములున్నాయి.. కానీ ప్రస్తుత పాలకులు పంటలకు గిట్టుబాటు ధరలు రాకుండా చేస్తున్నారని విమర్శించారు.
గంజాయిని ప్రమోట్ చేస్తోన్న వైసీపీ
అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలి..ఎన్నో కాఫీలు ఉన్నా.. అరకు కాఫీకి ప్రత్యేకత ఉంది. నేను సీఎంగా ఉన్న సమయంలో దావోస్‌లో కూడా అరకు కాఫీని పరిచయం చేశా. భవిష్యత్తులో అరకు కాఫీని ప్రపంచం మొత్తానికి తీసుకెళ్తాం. మనం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే.. వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తోంది. అరకు కాఫీలో ఉన్న మంచి రుచి, గుణాలే ఇక్కడ ప్రజల్లోనూ ఉన్నాయి. ముంబైలో అరకు కాఫీ సెంటర్ ఏర్పాటు చేస్తా. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే ఏ రైతులైనా చెప్పిన పంట వేస్తారు. గిట్టుబాటు ధర లేకుపోంటంతో రైతులు పెడదారి పట్టే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.
గిరిజనుల ద్రోహి జగన్
యువత నిర్వీర్యం అయిపోతోంది. యువతను ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. సాంకేతికను సక్రమంగా వినియోగించుకుంటే ఏదైనా చేయవచ్చు. ఈ ప్రభుత్వం గిరిజన వ్యతిరేక, పొట్టగొట్టే ప్రభుత్వం. మీరు జగన్‌ని నమ్మితే నమ్మించి గొంతు కోసి మోసం చేశారు. ఈ ప్రభుత్వం లో గిరిజనులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఒకప్పుడు గిరిజనులలో ఒక చైతన్యం తీసుకురావలని ‘చైతన్యం’ అనే పేరు పెట్టి గిరిజనుల సంక్షేమనికి నాంది పలికిన పార్టీ టీడీపీ. గిరిజనుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి గిరిజనుల్లోనే ఉపాధ్యాయ నియామకాలను ఎన్టీఆర్ చేశారు. ఉపాధ్యాయులుగా గిరిజనులనే నియమించాలన్న ఉద్దేశ్యంతో 2003లో జీవో నెం.3 తీసుకువచ్చా..కానీ జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశారు. ఇది గిరిజనులకు అన్యాయం కాదా? గిరిజనుల పొట్టకొట్టడం కాదా? ఐదేళ్లవుతున్నా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. సామాజిక న్యాయమని అంబేద్కర్ విగ్రహం పెట్టి..సామాజిక న్యాయం చేస్తున్నానని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. సామాజిక న్యాయం చేస్తున్నప్పుడు జీవో నెం.3 ఎందుకు రద్దు చేశావో చెప్పాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
16 సంక్షేమ పథకాలు గిరిజనులకు రద్దు
జగన్ అధికారంలోకి వచ్చాక గిరిజనులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రత్యేకంగా గిరిజనుల కోసం టీడీపీ ప్రవేశపెట్టిన 16 పథకాలు రద్దు చేశారు. గిరిజన విద్యార్ధులు చదువుకోవడం జగన్ కు ఇష్టం లేదు..అందుకే ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం రద్దు చేశారు. నా హయాంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐటీలో కోచింగ్ లు ఇప్పించి గిరిజనులను ముందుకు నడిపించాం. విదేశాలలో ఎక్కడ చదువుకోవాలన్నా స్కాలర్‌షిప్ ఇచ్చాం. నైపుణ్యం కోసం శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తే జగన్ తొలగించారు. గిరిపుత్రిక కళ్యాణ పథకం, ఫుడ్ బాస్కెట్, బెస్ట్ అవెలబుల్ స్కూళ్లు రద్దు చేశారు. ట్రైకార్ ద్వారా కేంద్రం నుంచి వచ్చే రుణాలు సద్వినియోగం చేసుకోలేదు. గిరిజనులు విష జ్వరాల బారినపడకుండా ఇచ్చే దోమతెరలు కూడా రద్దు చేశాడు. పేదల ఆదాయం పెంచి ఖర్చు తగ్గించాల్సింది పోయి రక్తం తాగుతున్నారు. గిరిజనల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను టీడీపీ ఇస్తే.. జగన్ పట్టణ ప్రాంతాల్లో తీసేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలు పెట్టి కోతలు విధిస్తున్నారు. మొబైల్, ఫీడర్ ఆంబులెన్సులను టీడీపీ తెచ్చింది. 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత టీడీపీది. కానీ జగన్ 45 ఏళ్లకే ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఉచితంగా ఇళ్లు కడతానని చెప్పి ఒక్క ఇల్లుకూడా కట్టలేదు. గిరి నెట్ ద్వారా రూ.90 కోట్లతో 184 మొబైల్ టవర్లు ఏర్పాటు చేశాం..రూ.500 కోట్లతో అల్లూరి మ్యూజియం నిర్మాణం తలపెడితే దానిని జగన్ నిర్వీర్యం చేశాడని చంద్రబాబు విమర్శించారు.
లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు
ఏజెన్సీలో బాక్సైట్ ఉంది..తవ్వడానికి వీలు లేదని నేను ఆనాడే చెప్పా. ఇప్పుడు జగన్ లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పోరాడితే వారిపై కేసులు బనాయించారు. బాక్సైట్ తవ్వకాలు చేసి దాన్ని జగన్ కంపెనీ అయిన భారతీ సిమెంట్స్ కు పంపుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను జగన్, ఆయన మాఫియా దోచేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఒక్క కి.మీ రోడ్డు వేసిన పాపాన పోలేదు. గర్భిణులను డోలీలపై ఆసుపత్రికి తీసుకువెళ్లే దుస్థితిలో గిరిజన ప్రాంతాల్లో నెలకొందంటే కారణమెవరు? శృంగవరపుకోట మండలం చిట్టెంపాడుకు చెందిన గంగులు భార్య, బిడ్డ వైద్యం చనిపోయారు. మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి అంబులెన్సు లేక బైక్ పై ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఎంత అవమానం.? జగన్ నొక్కే బటన్ వల్ల ఏమైనా లాభం వచ్చిందా? ఆయన నొక్కేది బొక్కుడు బటనే అని చంద్రబాబు దుయ్యబట్టారు.
ధరల పెంపుతో నడ్డి విరుస్తున్నాడు
జగన్ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల కొనలేని దుస్థితి. రేట్లు పెంచేసి పేదల నడ్డి విరుస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో వంటగ్యాస్ రూ.780 ఉంటే ఇప్పుడు రూ.1,100లకు చేరింది. ఆడబిడ్డలందరూ వంటగ్యాస్ పక్కన పెట్టి మళ్లీ కట్టెల పొయ్యి వాడే పరిస్థితి తీసుకొచ్చారు. ఆధునిక యుగం నుండి రాతియుగంలోకి పోయే పరిస్థితి వచ్చింది. కరెంటు ఛార్జీలు ఒకప్పుడు రూ.200 వచ్చేవి. ఇప్పుడు రూ.1,000 వస్తున్నాయి. నాడు ఫైబర్ నెట్ ద్వారా రూ.149కే ఇంటర్ నెట్, టీవీ అందించాం..దాన్ని రూ.350 చేశారు. మద్యంతో దోచేస్తున్నాడు. ఒకప్పుడు నాణ్యమైన మద్యం క్వార్టర్ రూ.70 ఉండేది. ఇప్పుడు రూ.250 చేశారు. జగన్ తెచ్చిన కల్తీ మద్యం తాగి 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. 30 వేల మంది చనిపోయారు. మూడు రాజధానులంటూ మోసం చేస్తున్నారు. విశాఖపట్నం అంటే ప్రేమ అని చెప్పాడు.. విశాఖపట్నంలో ఉన్న భూములు, ఆస్తులపైనే ప్రేమ. రిషికొండకు గుండు కొట్టి కేజీఎఫ్ మాదిరిగా చేస్తున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని గోదావరిలో ముంచేశారు. నాపై నమ్మకంతో నాడు 7 మండలాలు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చాయి..వారికి న్యాయం చేసే బాధ్యత నాది. పోలవరం ముంపు మండలాలకు ప్రత్యేకంగా ఒక జిల్లా పెట్టి ఆదుకునే బాధ్యత టీడీపీది. టీడీపీ హయాంలో 72 శాతం పోలవరాన్ని పూర్తి చేశాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక టీడీపీ హయాంలో కట్టించిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేసిందని చంద్రబాబు విమర్శించారు.
జన్మభూమి స్ఫూర్తితో దత్తత తీసుకోవాలి
కుటుంబ వికాసం అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టాం. దీన్ని నిమ్మకూరులో ప్రారంభించాం. నాడు జన్మభూమి స్పూర్తితో అరకును దత్తత తీసుకున్నా. జన్మభూమి స్పూర్తితో గిరిజన ప్రాంతంలో ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి. ప్రతి ఒక్క కుటుంబాన్నీ పైకి తీసుకువరావడం నా బాధ్యత. పేదరికం లేని కుటుంబాన్ని చూడటమే లక్ష్యం. ప్రతి కుటుంబాన్ని ఎందుకు లక్షలాదికారిగా చేయలేమో సవాలుగా తీసుకుంటాం. అందుకు విద్యపై ఎక్కువ ధ్యాసపెట్టాలి. గిరిజనులకు విద్యలో ప్రాధాన్యత ఇస్తే మరింత అభివృద్ధి చెందుతారు. వాణిజ్య పంటలు వేస్తే గిట్టుబాటు ధరలు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
జగనే పెత్తందారుడు
కులం, మతం, ప్రాంతం తిండి పెట్టదు..మంచి పరిపాలన అందిస్తే పేదరికం పోతుంది. కులాలు, మతాల పేరిట మోసపోయే గిరిజనులు దీన్ని బలంగా నమ్మాలి. మిమ్మల్ని మోసం చేసేందుకు సీఎం మళ్లీ కొత్త వేషంలో వస్తాడు. నేను పెత్తందారుడుని అంటూ జగన్ కొత్తపదం పలుకుతున్నారు. 40 ఏళ్లుగా ఎన్టీఆర్, నేను మంచి పాలన అందించాలనే చూశాం. కానీ జగన్ రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకొని పెద్ద ఎత్తున దోచేశారు. దేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రుల కంటే ధనికుడు ఈ జగన్. అందరి సీఎంల దగ్గరున్న సంపద కంటే జగన్ దగ్గరున్నదే ఎక్కువ. రూ.500 కోట్ల ఆస్తి కలిగిన ధనిక ముఖ్యమంత్రి ఈ పెత్తందారుడు. ఎవరైనా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా, తప్పని చెప్పినా పెత్తందారులంటాడు. ఈ అరాచక పాలన పోవాలి. జగన్ ఇంత డబ్బు ఎలా సంపాదించాడో వైసీపీ నాయకులు జగన్ నిలదీయాలని చంద్రబాబు చెప్పారు.
జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం
జగన్ ఒక వైపు దోచుకుంటూ ఎమ్మెల్యే, ఎంపీలను బలిపశువులను చేస్తున్నాడు. అందుకే 90 మంది ఓడిపోతారని నిర్ణయానికి వచ్చి మార్చేస్తున్నారు. 175 మందిని మార్చినా జగన్ ఇంటి వెళ్లడం ఖాయం. అరకు ఎమ్మెల్యే పాల్గుణ మైనింగ్ దోచేస్తున్నాడు. ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా నియోజకవర్గాలకు వచ్చే నిధుల్లో పర్సంటేజ్ లు తీసుకుంటున్నారు. 100 ఎకరాల క్వారీని బంధువులకు అప్పగించారు. పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఇళ్ల పట్టాల్లో అవినీతికి పాల్పడ్డాడు. మద్యం షాపుల్లో ఉద్యోగం కావాలన్నా లంచం కావాల్సిందే. సాలూరులో మంత్రి పీడిక రాజన్నదొర నియోజకవర్గాన్ని పీడిస్తున్నాడు. లెక్కలేనన్ని ఆస్తుల్ని కూడగట్టారు. టీడీపీ అధికారంలో ఉండుంటే గిరిజన విశ్వవిద్యాలయం ఈ పాటికి పూర్తి అయ్యి ఉండేది. రాయవాడ రిజర్వాయర్ లో ఆధునీకరణ పేరుతో పుష్పశ్రీవాణి దోచుకున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ అనంతబాబుకు బినామీ. ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలవరీ చేస్తే ఊరేగింపులు చేశారు. పాలకొండ ఎమ్మెల్యే.. అనకొండలా మింగేస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ.3 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.
ప్రతి ఇంటికీ సురక్షిత నీరు
టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక గ్రిడ్ ద్వారా ఇంటింటికీ సురక్షిత నీటిని అందిస్తాం. అరకు కేంద్రంగా టూరిజాన్ని ప్రమోట్ చేసి ఉపాధికి కల్పిస్తాం. పోలవరం ముంపు బాధితులను ఆదుకుంటాం. ఈ ఏజెన్సీలో ప్రతి గిరిజనుణ్ని పైకి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. అంగన్వాడీలు 40 రోజులగా ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం. అరకులో వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.