అమరావతి (చైతన్యరథం): అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఎన్నికపై ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయించాయి. పీఏసీ సభ్యత్వానికి అసెంబ్లీ నుంచి ఎన్డీఏ తరపున తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ తరపున పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నామినేషన్ వేశారు. ఎన్డీఏ నుంచి 9 మంది, వైసీపీ నుంచి ఒకటి కలిపి మొత్తం 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తొమ్మిది నామినేషన్‌లు మాత్రమే దాఖలైతే పీఏసీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం అయ్యేది. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బలం అవసరం. కానీ నామినేషన్ దాఖలు చేసిన వైసీపీకి ప్రస్తుతం 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. వైసీపీ నుంచి ఒకరు నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. వైసీపీ సభ్యుడు నామినేషన్ ఉపసంహరించుకోని పక్షంలో అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ నిర్వహించనున్నారు.
తెలుగుదేశం తరపున పీఏసీ సభ్యత్వానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేశారు. వైసీపీకి తగినంత సంఖ్యాబలం లేకపోవటంతో ఎన్డీయే అభ్యర్థుల ఎన్నిక లాంఛనం కానుంది.
ప్రజాపద్దుల కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. శాసనసభ నుంచి 9మంది, మండలి నుంచి ముగ్గురు ఉంటారు. శాసనసభ్యుల నుంచే చైర్మన్ నియమితులవుతారు.
శాసనసభ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుంటారు. గత శాసనసభలో ప్రతిపక్ష తెలుగుదేశానికి ఒక్క సభ్యుడినే ఎన్నుకునేంత బలం ఉంది. దీంతో పయ్యావుల కేశవ్‌కు సభ్యుడిగా అవకాశం దక్కింది. సంప్రదాయం ప్రకారం ఆయననే చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ప్రతిపక్ష వైసీపీ నుంచి ఒక్క సభ్యుడూ ఎన్నికయ్యే ఆస్కారం లేకపోవడంతో ఈ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం పీఏసీ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశం లేనందున.. కూటమి నుంచి వచ్చిన తొమ్మిది మంది సభ్యుల్లోనే ఒకరికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది.