అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. నాయకులు సైతం అప్రమత్తంగా ఉండి.. దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఆదేశించారు. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పూర్తి సంయమనం పాటించాలన్నారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.