- కన్నీళ్లతో విన్నవించుకున్న అర్జీదారులు
- కిక్కిరిసిన టీడీపీ కేంద్ర కార్యాలయం
- వినతులు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు
మంగళగిరి(చైతన్యరథం): ఏడు పదుల వయసులో గోడు వెళ్లబోసుకుంటూ పండు టాకులు.. కదల్లేని దీనస్థితిలో ఉన్న తమ బిడ్డల దుస్థితిని చూపిస్తూ తల్లిదండ్రులు.. అడుగు లు తడబడుతూ…మాటలు రాక..చెవులు వినపడక తమ మౌన వేదనను పేపరులో వ్యక్తం చేస్తూ దివ్యాంగులు…తమ భూమి కబ్జా చేశారంటూ వైసీపీ బాధితులు.. అర్హత ఉన్నా పింఛన్ రాలేదని కొందరు… చేసిన పనులకు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు.. గ్రామాల్లో రోడ్లు, లైట్లు లేవని పల్లె వాసులు..ఇళ్లు లేవని పేదలు.. ఉద్యోగాలు లేవని నిరుద్యోగులు.. కనీస జీతాలు ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. దీన స్థితిలో ఉన్నాం ఆర్థికసాయం అందించాలని మరికొందరు..నామినేటెడ్ పదవుల కోసం పార్టీ నేతలు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం వందల సంఖ్యలో తరలివచ్చారు. వినతుల స్వీకరణ కార్యక్రమానికి అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారితో టీడీపీ కేంద్ర కార్యా లయం కిక్కిరిసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లు అర్జీలు స్వీకరించి సమస్యలను ఓపిగ్గా విన్నారు. తక్షణమే అధికారులు, నేతలకు ఫోన్లు చేసూ ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేశారు. వందల్లో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల కు పంపి పరిష్కారానికి చొరవ చూపారు. ప్రతి ఫిర్యాదును పరిష్కరించేలా సకాలంలోనే ఆ సమాచారం అర్జీదారులకు చేరేలా చర్యలు తీసుకున్నారు.
భూమి లాక్కుని వైసీపీ నేతలు అక్రమ కట్టడాలు కట్టారు
వైసీపీ రౌడీమూకల అరాచకాలతో సొంత ఊరును వీడి భార్య బిడ్డలతో పాయక రావుపేటలో తలదాచుకుంటున్నట్లు రాము నాయుడు వాపోయాడు.గోలుకొండ తహశీల్దార్ కె.వెంకటేశ్వరరావు, కృష్ణదేవిపేట ఎస్సై భీమరాజులు వైసీపీ నేతలతో కుమ్మక్కై తమ కుటుం బంపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. భూమి లాక్కుని అక్రమ కట్టడాలు కట్టారని తక్షణమే నిలిపివేయించి న్యాయం చేయాలని కోరారు. కడప జిల్లా బి.కొండూరు మండలం తుమ్మలపల్లె చేనేత సహకార సంఘంలో జరిగిన అవినీతి, అక్రమంగా లావాదేవీలకు సహకరించిన జిల్లా చేనేత జౌళిశాఖ అధికా రుల కేసును రీ ఓపెన్ చేసి చర్యలు తీసుకోవాలని రామసముద్రం గ్రామానికి చెందిన పోలిశెట్టి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.
రీ సర్వేలో భూమి రికార్డులు తారుమారు చేశారు
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీ సర్వేలో తన భూ రికార్డులను తారుమారు చేసి తనకు అన్యాయం చేశారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల గ్రామా నికి చెందిన లింగాబత్తిని ఉమాలక్షి వాపోయారు. తన తల్లి నుంచి వచ్చిన భూమి కొట్టేయ డానికి కుట్ర పన్నారని తనకు న్యాయం చేయాలని కోరారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం తిప్పనూరు గ్రామానికి చెందిన ఎస్.నాగరాజు తమకు పెద్దల నుంచి వచ్చిన భూమికి వైసీపీ నాయకులు పట్టా పుస్తకాలు, టైటిల్‌డీడ్ పుస్తకాలు రాకుండా అడ్డుకుంటు న్నారని పట్టా పుస్తకాలు ఇప్పించాలని కోరారు.
భూమిని కబ్జా చేశారు..విడిపించండి
వైసీపీ నేతలు తమ పొలం సరిహద్దు రాళ్లను ధ్వంసం చేసి భూమిని కబ్జా చేశారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన కళసా బసవరాజు వాపోయాడు. తమ భూమిని విడిపించాలని వేడుకు న్నాడు. నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా గత ప్రభుత్వంలో సిమెంట్ రోడ్డు నిర్మించినా తనకు నేటికి రూ.75 లక్షలు బిల్లు రాలేదని… బిల్లులు మంజూరు చేయాలని డి.హిమాచలంరాజు కోరారు. కుమ్మరి కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల వారికి కుండల తయారు, వాటి విక్రయానికి మండల, మున్సిపాలిటీ కేంద్రాలలో శాశ్వత స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.
వైసీపీకి ఓటు వేయలేదని పింఛన్ ఇవ్వలేదు
వైసీపీకి ఓటు వేయలేదని అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వలేదని…వృద్ధాప్యంలో ఏ పని చేసుకోలేకపోతున్నానని పింఛన్ ఇప్పించాలని నెల్లూరు జల్లా సైదాపురం మండలం గులిమి చెర్ల గ్రామానికి చెందిన పట్టాభిరామిరెడ్డి వాపోయాడు. అమరావతి రాజధాని నిర్మాణానికి షెడ్యూల్డ్ కులాల వారి నుంచి భూ సమీకరణ ద్వారా తీసుకున్న అసైన్డ్ భూములకు ప్యాకేజీ ఇప్పించి న్యాయం చేయాలని అమరావతి రాజధాని ప్రాంత అసైన్డ్ ఎస్సీ, ఎస్టీ రైతులు అర్జీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామానికి చెందిన మల్లిపూడి ప్రసన్నకుమార్ తండ్రి సమస్యను వివరిస్తూ తన కుమారుడు 100 శాతం దివ్యాంగుడని సదరం సర్టిఫికెట్ ఉందని పూర్తి పింఛన్ ఇప్పించాలని కోరారు.
కేతిరెడ్డి అండగా అక్రమ కేసులు పెట్టారు
తమ భూమిని చదును చేసుకుంటుంటే వైసీపీ నేతలు రాళ్లతో దాడి చేసి కేతిరెడ్డి అండతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన బాలునాయక్ వాపోయాడు. తమపై అక్రమ కేసులు తొలగించి తమపై దాడిచేసిన వైసీపీ అనుచరులు, సహకరించిన నేతలను శిక్షించాలని కోరారు. స్వర్ణముఖి నదిపై ప్రతి పది కిలోమీటర్లకు ఒక ఆనకట్ట కడితే ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో సుమారు 500 గ్రామాల రైతులకు తాగు,సాగునీటికి ఇబ్బంది ఉండదని ఆనకట్టల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అరుసూరు వెంకటేశ్వర్లు కోరారు.
తొలగించారు…విధుల్లోకి తీసుకోవాలి
` 2007 నుంచి 2020 వరకు జాతీయ వ్యవసాయ పంటల బీమా కార్యకర్తలుగా విధుల్లో కొనసాగిన 1300 మందిని గత వైసీపీ ప్రభుత్వం తొలగించి అన్యాయం చేసిందని అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో ఏదో ఒక శాఖలో ఉద్యోగాలు కల్పిం చాలని పలువురు అభ్యర్థులు కోరారు. వైసీపీ హయాంలో గురుకుల విద్యాలయ సంస్థ విధు ల నుంచి తొలగించబడిన 150 మంది నాన్ టీచింగ్ జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్స్‌ను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పలువురు అభ్యర్థులు విన్నవించారు.
అగ్రిమెంట్ స్థిరాస్తిని మరొకరికి అమ్మారు
ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన ఉన్నం రమణయ్య సమస్యను వివరిస్తూ రూ.5 లక్షలు చెల్లించి రూ.100 నాన్ జుడీషియల్ స్టాంపు పేపరుపై స్థిరాస్తి విక్రయ స్వాధీన అగ్రిమెంట్ రాసుకోగా కొన్న స్థలానికి కొంతకాలం తర్వాత మంచిరేటు రావడంతో తనకు తెలియకుండా మరొకరికి ఆ స్థలాన్ని అమ్మి రిజిస్ట్రార్ కార్యాలయంలో వేరొకరికి నాగెళ్ల నారాయణ రిజిస్టర్ చేయించాడని న్యాయం చేయాలని కోరాడు.