- పవిత్రతను దెబ్బతీసేలా విష ప్రచారం
- జగన్ హయాంలో తిరుమలలో యథేచ్ఛగా దోపిడీ
- అధికారం కోల్పోయాక బురదజల్లే పన్నాగాలు
- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆగ్రహం
అమరావతి (చైతన్యరథం): నిత్యం తిరుమలపై కుట్రలు చేస్తూ వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శు క్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తిరుమలలోనూ, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ఆలయాలలోనూ అనూహ్య రద్దీని సైతం కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందని, దీన్ని తట్టుకోలేని వైసీపీ ముఠా సాక్షి పత్రిక ద్వారా తొక్కిసలాటలు, ప్రభుత్వ నిర్లక్ష్యం అని తప్పుడు ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. స్వయంగా ఎస్పీ తిరుమలలో పర్యటించి ఎలాంటి తొక్కిసలాట జరగలేదని స్పష్టం చేశారని గుర్తుచేస్తూ, నిత్యం ఏదో అపచారం జరిగిపోతున్నట్లు విషప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీసే దుష్ట కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆలయాలపై వ్యాప్తి చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం.. ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని నాశనం చేయడానికి వైసీపీ ప్రారంభించిన దుష్ట సంప్రదాయమని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆలయాలకు రక్షణ కరువైందని, ఇప్పుడు అధికారం కోల్పోయినా నిత్యం కొత్త కొత్త కుట్రలతో ఆలయాలపై విషం చిమ్ముతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ఆలయాలను లక్ష్యంగా చేసుకొని జరగని సంఘటనలను జరిగినట్లు అబద్ధాలు సృష్టించి సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని, ఇది కేవలం ఆలయాలపై దాడి కాదు… కోట్లాది భక్తుల విశ్వాసాలపై ఘోర దాడి అని తీవ్రంగా దుయ్యబట్టారు.
నిత్యం తిరుమలపై నిరంతర కుట్రలు
ఒకటా రెండా… తిరుమల కొండపై వైసీపీ మూక చేసిన దారుణాలు, దోపిడీలు, దౌర్జన్యాలు అనేకం అని గుర్తుచేశారు. గోశాలలో ఆవులు డ్రామా చనిపోతున్నాయని అబద్ధాలు కట్టి విషం చిమ్మారు. నిత్యాన్నదాన కార్యక్రమం సరిగా లేదంటూ వదంతులు పుట్టించారు. తిరుమల దర్శన కంపార్ట్మెంట్లో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆడించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేద విద్యార్థులకు రూ.3000 భృతి ఇచ్చి సహకరిస్తున్నందుకు కూడా తప్పుడు విమర్శలు చేశారు. విలేకరులు సరదాగా మహాద్వారం గేటుకు తాళం వేసినట్లు ఫొటో దిగితే దాన్ని కూడా తప్పుడు ప్రచారానికి ఉపయోగించారు. టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ అంటూ విషప్రచారం చేశారు. భక్తులు పరుగులు తీయటంతో తొక్కిసలాట జరిగిందని.. గందరగోళం సృష్టించే ప్రకటనల వల్లే ఇలా జరిగిందంటూ అని ఫేక్ వీడియోతో దుష్ప్రచారం చేశారు. వైసీపీ హయాంలో ముంతాజ్ హెూటల్ కు ఇచ్చిన అనుమతులు రద్దు చేసిన కూటమి ప్రభుత్వంపై విషంకక్కారు. డ్రామా ఆర్టిస్టులను పెట్టి కొండపై మద్యం తాగుతున్నారని విషం చిమ్మారు.. ఇలాంటి నీచమైన కుట్రలతో నిత్యం దిగజారిపోతున్నారని ఆనంద్ సూర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో యథేచ్ఛగా దోపిడీ
చరిత్రలో మహ్మదీయుల దాడుల సమయంలో హిందూ ఆలయాలు, ధర్మం, సంప్రదాయాలు తీవ్రంగా నష్టపోయాయని, ఆలయ భూములు కోల్పోయాయని గుర్తుచేస్తూ… అటువంటి ఘటనలు జగన్ రెడ్డి పాలనలో మరోసారి పునరావృతమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు రాజ్యమేలితే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, దేవుడిని కూడా దోచుకుంటారో జగన్ హయాం ఒక ఉదాహరణ అని మండిపడ్డారు. దేవుడిపై నమ్మకం లేని నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అస్తవ్యస్తం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో అన్యమతస్థుల నియామకాలు, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, కొండపై అన్యమత గుర్తులు, టీటీడీ వెబ్సైట్లో అన్యమత బోధనలు జరిగాయని గుర్తుచేస్తూ… భక్తులకు అశ్లీల వెబ్ లింకులు పంపడం, దర్శనం, వసతి, అద్దె, టోల్ గేట్, ప్రసాదాల ధరలు భారీగా పెంచి సామాన్య భక్తుడికి వెంకన్న దర్శనం అందకుండా చేశారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది లడ్డూలను కరపత్రాల్లా పంచి ఓట్ల కోసం దుర్వినియోగం చేశారు. సామాజిక న్యాయం పేరుతో ఒకే సామాజిక వర్గానికి అధిక పదవులు కట్టబెట్టారు. అన్నదానంలో నాణ్యత లేని బియ్యం, కల్తీ పదార్థాలు వాడారు. స్వామి నిధులను తిరుపతి మున్సిపాలిటీ పేరుతో దారి మళ్లించి కోట్లు దోచుకున్నారు. వీఐపీ బ్రేక్, సేవా టిక్కెట్ల అమ్మకాలు, దర్శన టిక్కెట్లు, ప్రసాదాల్లో బ్లాక్ మార్కెట్ నడిపి కోట్లు దండుకున్నారు. శారదా పీఠానికి నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా భూమి కేటాయింపులు చేసి, అనధికార నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ రూ.5 వేల కోట్లు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. కల్తీ నెయ్యి, పరకామణి దోపిడీ, తలనీలాల స్కాం, శాలువాల దోపిడీ, గోపురం బంగారం మాయం చేసి ఐదేళ్లు తిరుమల ప్రతిష్టను దిగజార్చారని ఆనంద్ సూర్య తీవ్రంగా మండిపడ్డారు.















