పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం. అక్షరాస్యత, పరిశుభ్రత, స్వచ్ఛత, మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాలు త్వరగా అభివృద్ధి సాధిస్తాయి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అడుగులేస్తోంది. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామాల్లో సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించింది. అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి పనుల్ని పండుగలా చేయాలని అక్టోబర్ 14నుంచి 20వరకు ప్రతిపల్లెలో ‘‘పల్లెకు పండుగ’’ క్యార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
గత ఐదేళ్ల పాలనలో జగన్‌రెడ్డి పంచాయితీ నిధులు రూ.13వేల కోట్లను దారి మళ్లించి, పల్లెలను, గ్రామ పరిపాలనను నిర్వీర్యం చేశారు. జగన్ పుణ్యమా అని రాష్ట్రంలోని పల్లెలన్నీ సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. గాడితప్పిన పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 15వ ఆర్థికసంగం నిధులు రూ.1987 కోట్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ (ఉపాధి) ద్వారా రూ.4,500 కోట్లు నిధులతో 30వేల అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్, నిధుల సద్వినియోగం ఐదేళ్ల తర్వాత ప్రారంభమవుతోంది. 2014-19 టీడీపీ హయాంలో సిమెంట్ రోడ్లు, డ్రైయిన్లతోపాలు పలు సాగు, తాగునీటి వనరులు కల్పనకు ఈ నిధులనువాడి సద్వినియోగం చేసుకుంది. అయితే వైసీపీ హయాంలో మొదటి ఏడాది సరైన ప్రణాళికలు లేక నిధులు వృధా అయ్యాయి. తర్వాత జగనన్న కాలనీల లెవలింగ్ పనులంటూ కొండల్లో, చెరువుల్లో మట్టిపోసి వైసీపీ కార్తకర్తలకు నిధులు దోచిపెట్టారు. అలాగే సచివాలయ భవనాల నిర్మాణాలు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో రూ.వేల కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగమయ్యాయి. కూటమి ప్రభుత్వం గ్రామాభివృద్ధే లక్ష్యంగా రూ. 4,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల అభివృద్ధి పనులను జనవరిలోపు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. గత వైసీపీ పాలనలో 45,180 జాబ్‌కార్డులు తొలగించి దాదాపు 2లక్షల మంది పేదల కడుపుకొట్టి రూ.వేల కోట్లు దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం బకాయిలు రూ.2వేల కోట్లు విడుదల చేసి ఉపాధి హామీ పనులకు తోడ్పాటును అందిస్తోంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 1.07 లక్షల కుటుంబాలకు 466 లక్షల ఉపాధి పని దినాలు కల్పించిన కూటమి ప్రభుత్వం, పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పశువులకు గోశాలలు, ఇంకుడు గుంతలు, 3వేల కిలోమీటర్ల సీస ీరోడ్లు, 500కి.మీ తారురోడ్లు, 22వేల మినీ గోకులాలు ఈ ఏడాదినాటికి పూర్తి చేయాలని కృషి చేస్తోంది.
13వేల కోట్లు పంచాయతీ నిధులు దారిమళ్లింపు
గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ పాలనను డమ్మీ చేసి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి స్థానిక సంస్థల నిధులు రూ.13 వేల కోట్లను జగన్ దారి మళ్లించాడు. గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేకుండా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి పాలనా వికేంద్రీకరణకు గండికొట్టారు. విద్యుత్ బిల్లుల పేరిట పంచాయితీ ఖాతాలను ఖాళీ చేశాడు. పంచాయతీ వ్యవస్థ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను రూ.1,452 కోట్లు విడుదల చేసి నేడు పంచాయతీలకు సర్పంచే రాజుగా వ్యవహారించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కాలనీల్లో 27 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు
2014-19 టీడీపీ హాయాంలో లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా రూ.6194.75 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కాలనీల్లో 27వేల కి.మీ సీసీ రోడ్లు.. రూ.2658 కోట్లతో 22,283 కి.మీ గ్రామీణ బీటీ రోడ్లు, 27 లక్షల ఎల్‌ఈడీ లైట్లుతో విద్యుద్దీపాలు ఏర్పాటు వేసి పల్లెను ప్రగతి దారులుగా తీర్చిదిద్దారు. రాబోయే ఐదేళ్ల పాలనలో 3వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, 25వేల గోకులాలు, 10వేల వాననీటి సంరక్షణ కందకాల పనులను పూర్తి చేసేందకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదు. 2019లో ఏఐఐబీ రుణసాయంతో రూ.5,026 కోట్లతో చేపట్టిన గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. రాష్ట్రవాటా సరిగా ఇవ్వకపోగా బ్యాంకు విడుదల చేసిన రుణం కూడా ఇతర అవసరాలకు వాడేసింది. ఫలితంగా ప్రాజెక్టు గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగిసిపోతున్నా తొలిదశలో ప్రారంభించిన రహదారుల పనులు పూర్తికాలేదు. గుత్తేదారులకు రూ.600 కోట్ల వరకు బిల్లులు పెండిరగ్ పెట్టారు. గత ప్రభుత్వం బ్యాంకు ఇచ్చిన రుణాన్నీ ఇతర అవసరాలకు మళ్లించడంతో.. రాష్ట్రవాటా నిధులు ఖర్చు చేశాకే బ్యాంకు రుణమిస్తామని ఏఐఐబీ మెలిక పెట్టింది. ఈ ప్రాజెక్టు సంబంధించి మరో రెండేళ్లు పొడిగించాలని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
జల్‌జీవన్‌ను అవినీతి మిషన్‌గా మార్చిన వైసీపీ
ఇంటింటికీ తాగునీటిని అందించాలన్న సంకల్పంతో 2019 ఆగస్టు 15న కేంద్రం జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకానికి శ్రీకారం చుట్టింది. జల్ జీవన్ గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతి మిషన్‌గా మార్చుకుంది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా జలజీవన్ మిషన్‌ని నిర్వీర్యం చేసింది. ఈ పథకం కింద రూ.4,235 కోట్లు నిధులు ఖర్చు చేసినట్లు కాగితాలపై చూపించి దోచుకున్నారు. జలజీవన్ మిషన్ కాంట్రాక్టర్లకు రూ.650 కోట్లు బకాయిలు పెట్టారు. జల్ జీవన్ మిషన్ పథకం అమలో జగన్మోహన్ రెడ్డి ఏపీని 30 స్థానానికి దిగజార్చాడు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేలమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లుతో పల్స్ సర్వేను కూటమి ప్రభుత్వం నిర్వహించింది. కేంద్రం 2024-25 సంవత్సరానికిగాను ఏపీకి కేటాయించిన రూ.2,520 కోట్లు పూర్తిగా వినియోగించుకుని పెండిరగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేస్తుంది.
టీడీపీ హయాంలో పంచాయతీ శాఖకు 97 అవార్డులు
తెదేపా హయాంలో పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. 2014-19 టీడీపీ హయాంలో పంచాయతీలు దేశంలోనే ఆదర్శ పంచాయతీలుగా నిలిచి అవార్డులు సాధించాయి. టీడీపీ ఐదేళ్ల కాలంలో గ్రామీణాభివృద్ధిలో 97 అవార్డులు సాధించింది. అప్పటి పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ చేసిన కృషి నేటికీ ప్రశంసలు అందుకుంటూనే ఉంది. చిత్తూరు జిల్లా పరిషత్తుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ పురస్కారం, మండల పరిషత్తు విభాగంలో గుమ్మగట్ట, సబ్బవరం, వెదురుకుప్పం, కర్నూలు మండల పరిషత్తులకు అవార్డులు వచ్చాయి. పంచాయితీల విభాగంలో పొగిరి, బుట్టాయగూడెం, కూచివారిపల్లి, అచ్చంపేట, తాల్వాయిపాడు, కోనంకి పంచాయితీలకు అవార్డులు వచ్చాయి. గత వైసీపీ పాలనలో పంచాయతీలను భ్రష్టుపట్టించారు. నేడు మళ్లీ కూటమి ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ మంత్రి, డిప్యూటీ సీఎం సారధ్యంలో పంచాయితీ వ్యవస్థకు పూర్వ వైభవం వస్తుండటం శుభపరిణామం.
ఎం.ఎలీషా బాబు, అనలిస్ట్