- కాకాణి గోవర్థన్ కేసులో అంత కుక్కే చేసిందంట
- ఆ రోజు ఎస్పీ చెప్పిందే..ఈ రోజు సీబీఐ చెబుతోంది
- ప్రతి కేసులోనూ ఎవరో ఒకరిని బలి చేసి తప్పించుకోవడం కాకాణికి అలవాటే
- కాకాణిపై మండిపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
నెల్లూరు(చైతన్యరథం): తలకిం దులుగా తపస్సు చేసినా కోర్టు కేసు నుంచి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తప్పించుకోలేరని, ఆ రోజు ఎస్సీ చెప్పిందే… ఈ రోజు సీబీఐ చెబు తోందని… తాత్కాలికంగా ఈ కేసు లో కుక్క గెలిచి ఉండవచ్చు కానీ అంతిమంగా ఈ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డికి ఏడేళ్లు జైలు శిక్ష తప్పదని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి కేసులోనూ ఎవరో ఒకరిని బలి చేసి తాను తప్పించుకోవడం మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. కోర్టు ఆవరణలో 15 వేల కేసులకు సంబంధించిన ఫైళ్లు ఉంటే వారికి ఒక్క కాకాణి కేసుకు సంబంధించిన ఆధారాలున్న ఫైలు మాత్రమే దొంగలకు దొరికిందా అని ప్రశ్నించారు.
ఈ కేసులో సీబీఐ ఛార్జీషీట్ మాత్రమే ఫైలు చేసిందని, అంతమత్రానికే కేసు గెలిచినట్లు కాకాణిగోవర్థన్ రెడ్డి టపాసులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ… నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసుపై ఎవరో అడిగితే సీబీఐ విచారణకు ఆదేశించలేదని, అసాధారణమైన నేరంగా పరిగణించి హైకోర్టే సుమోటోగా ఆదేశించింద న్నారు. ‘‘పాత ఇనుము కోసం ఇద్దరు దొంగలు కోర్టు ఆవరణలోకి వెళితే కుక్క అరిచింది. 17కోర్టులున్న సముదాయంలో కాకాణి కేసుకు సంబంధించిన ఫైళ్లు ఉన్న కోర్టులోకే దొంగలు వెళ్లేలా కుక్క మొరిగిందా? దొంగలను మిద్దె ఎక్కేలా చేసింది కూడా కుక్కే. కోర్టు భవనంలో 11 అల్మారాలు ఉండగా కాకాని కేసు ఫైళ్లు ఉన్న అల్మారాను పగలగొట్టే వరకూ కుక్క మొరుగూతూనే ఉందా? కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఆధారాలైన ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ తీసుకునే వరకు కుక్క అరుస్తూనే ఉంది.
ఈ ఘటన అంతటికి కుక్క అరవడమే కారణమని అప్పటి ఎస్పీ విజయరావు సెలవిచ్చారు. నెల్లూరు కోర్టులో జరిగిన అసాధారణమైన ఘటనగా గుర్తించిన జిల్లా న్యాయమూర్తి ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించారు. హైకోర్టు కూడా తీవ్రమైన నేరంగా పరిగణించి సుమోటోగా సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ అఫిడవిట్‌ను హైకోర్టు కచ్చితంగా సమీక్షిస్తుందనే నమ్మకం నాకుంది. లేకపోయినా నేను పెట్టిన కేసులో కాకాణికి శిక్ష తప్పదు’’ అని సోమిరెడ్డి హెచ్చరించారు. నకలీ మద్యం కేసుల నుంచి తనను తప్పించమని చంద్రబాబు కాళ్లు పట్టుకున్న నీవా మా నాయకుడు గురించి మాట్లాడేది… చంద్రబాబు గురించి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పాలనాపరంగా అనేక అక్రమాలకు పాల్పడుతున్న కాకాణి వల్ల ఇప్పటికే అనేకమంది అధికారులు బలైయ్యారని, పొదలకూరు తహసీల్దారు స్వాతి సస్పెన్షన్‌లో ఉండగా… ఐదుగురు జైళ్లకు పోయారని అన్నారు. భూకుంభకోణాలకు పాల్పడిన కాకాణి మాత్రం క్షేమంగా ఉన్నారు అంటూ చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.