ఇందుగలడు అందులేడని అన్నట్టుగా.. ఏపీలో ఎందెందు వెతికినా జగన్మాయే కనిపిస్తోంది. ఏపీని గంజాయికి అడ్డాగా మార్చి యువతను మత్తులో ముంచెత్తుతోంది జగన్ సర్కార్. ఎంతలా అంటే, గంజాయి సరఫరాలో ఏపీని దేశంలోనే నంబర్ వన్ పొజిషన్ లో నిలబెట్టారు. మన్యంలో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గాంజా సాగవుతోంది. ఇదంతా తెరవెనుక నుండి వైసీపీ నాయకులే నడిపిస్తునన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లోఇప్పుడు.. గంజాయి గుప్పుమంటోంది. తూర్పు గోదావరి, విశాఖ ఏజన్సీ నుంచి యథేచ్ఛగా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతోంది. అదంతా ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతోంది? గాంజా దందాకు కారకులెవరు? అంటే అధికార పార్టీకి సంబంధించిన వారే ఈ అక్రమాలకు తెరలేపుతున్నారని తెలుస్తోంది. పట్టుబడుతున్నది కొంతే, పట్టుబడకుండా నాయకుల మాటున సరిహద్దులు దాటిపోతోన్న విలువ కోటాను కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల తిరుమల కొండపై కూడా గంజాయి అమ్మకాలు వెలుగుచూడడం కలకలం రేపింది. సీఎం, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో గంజాయి సాగు, అమ్మకాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రాన్ని జగన్ గంజాయి హబ్ గా మార్చారని మండిపడుతున్నాయి.
ఇక.. అక్రమార్కులకు గంజాయి దందా కాసులు కురిపిస్తుండడంతో కాలేజీలన్నీ గంజాయి డెన్స్ గా మారిపోతున్నాయి. ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఏపీ యువత మత్తులో చిత్తయిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ పాలనలో గంజాయి దందా మూడు మొక్కలు.. ఆరు ప్యాకెట్లు..అన్నట్లుగా సాగుతోంది.దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. గంజాయి సరఫరాలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తెలిపిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో అంతకంతకూ గంజాయి సాగు పెరిగిపోతుండడం, స్కూల్ దశలోనే విద్యార్థులు వాటికి బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి మత్తులో రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓ చోట అసాంఘిక కార్యక్రమాలు చెలరేగుతుండడం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది.
గంజయి మత్తులో మైనర్లు కూడా చెలరేగిపోయి దారుణాలకు పాల్పడుతూంటే పాలకులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గుంటూరులో ఇద్దరు వాచ్ మెన్ల హత్య, తాడేపల్లిలో ఓ మహిళను నరికి చంపిన కేసులో పట్టుబడిన నిందితులు గంజాయికి బానిసలేనని తెలిసింది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, వారి సానుభూతిపరులే గంజాయి అక్రమాల వెనుక ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ గంజాయి మత్తులో చేస్తున్న నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. పోలీసులు కొందరిపై తూతూమంత్రంగా కేసులు పెట్టి అసలు దొంగలను తప్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలో మద్యం ధరలు చుక్కల్ని తాకుతుండటంతో.. వాటిని కొనలేక చాలా మంది చీప్ గా దొరుకుతున్న గంజాయి వైపు ఆకర్షితులౌతున్నారు. ఒకప్పుడు ఎక్కడో కాని గంజాయి దొరకని పరిస్తితి నుంచి ఇప్పుడు ఎనీటైమ్ గంజాయి అనే స్థితికి ఏపీ దిగజారింది. ఇదంతా జగన్ రెడ్డి పాలన పుణ్యమే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఇక.. తూర్పు గోదావరి.. విశాఖ మన్యంలో 20 వేల ఎకరాలలో గంజాయి సాగు జరుగుతుందన్న అంచనాలు ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి ఏటా ఎనిమిది వేల కోట్ల విలువైన గంజాయిని దేశంలోని వివిధ రాష్ట్రాలకు విదేశాలకు అక్రమంగా తరలిపోతున్నట్లు అంచనా. ఇటీవల కాలంలో ఏపీ గంజాయి క్యాపిటల్ గా మారిపోయిందన్న ఆందోళనతో టీడీపీ నారా లోకేష్ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. అక్రమ వ్యాపారాలపై దృష్టిపెట్టాల్సిన పోలీసులు.. అధికార పార్టీకి చెందినన నేతల పట్ల చూసీ చూడనట్లుగానే ఉంటున్నారు. ఈ కారణంగానే గంజాయి వ్యాపారుల పంట పండుతోందని.. కాలేజీల్ని టార్గెట్ చేసుకుని …పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారని అంటున్నారు.
రాష్ట్రం మొత్తం.. గంజాయి వాసనతో గుప్పు మంటున్నా.. సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వానపడ్డ చందంగానే ఉంటోంది. ఆ దీవెన.. ఈ దీవెన.. అంటూ హడావుడి చేస్తున్ సీఎం జగన్.. యువత గంజాయి మత్తులో చిత్తు అవుతున్నా పట్టించుకోవటం లేదు. ఓ వైపు “జే బ్రాండ్ చీప్ లిక్కర్”.. మరో వైపు నాటు సారా.. ఇంకో వైపు గంజాయి మత్తుతో ఏపీ యువత చిత్తు అవుతోంది. మూడు పదుల వయసు నిండకుండానే.. కాటికి కాళ్లు చాపుతోంది. సీఎం జగన్ రెడ్డి పుణ్యమా అని.. ఎంతో విలువైన మానవ సంపద కళ్ల ముందే నిర్వీర్యం అయిపోతోంది.