- జన ప్రభంజనమే కూటమి విజయ సంకేతం
- ఇక్కడి విజయంతో కొత్త చరిత్ర రాస్తున్నాం
- వైసీపీ పాలనలో ప్రజలు బతుకులు ఛిద్రం
- రాయలసీమకు జగన్ చేసిందేమీ లేదు..
- జగన్‌కు తెలిసిందల్లా నొక్కుడు.. బొక్కుడు
- అన్నివర్గాల సంక్షేమం.. కూటమి లక్ష్యం
- నందికొట్కూరు ఆడబిడ్డను ఢల్లీికి పంపుదాం
- ప్రజలు గెలవాలి.. రాష్ట్రం గెలవాలి.. కూటమి గెలవాలి
- జనప్రభంజన ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు
నందికొట్కూరు (చైతన్యరథం): వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న జన ప్రభంజనం చాలు. ప్రజాగళానికి పోటెత్తిన జన కెరటం చూస్తుంటే `నందికొట్కూరు విజయంతో 20ఏళ్ల చరిత్రను తిరగరాస్తున్నాం. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన నందికొట్కూరులో మీరు కొట్టే దెబ్బకు వైసీపీ గుండె పగలాలి. ప్రజల్లో మొదలైన తిరుగుబాటుకు ఇది స్పష్టమైన సంకేతం. దళిత ద్రోహి సైకో జగన్‌రెడ్డిని ఇక్కడే పూడ్చిపెట్టాలి’ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉద్వేగభరితమైన పిలుపునిచ్చారు. ‘నందికొట్కూరు నుంచి నవశకం మొదలవుతోంది’ అంటూ అశేష జనవాహినిని ఉద్దేశించి చంద్రబాబు ఉత్సాహంగా ప్రకటించారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం కొత్త చరిత్ర సృష్టిస్తుందనడానికి సంకేతంగా ప్రజాగళం సభలకు జనం బ్రహ్మరథం పట్టారు. పోటెత్తిన జన సమూహాన్ని చూసి చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి, కుటుంబం, ఇల్లు, ఊరు, ప్రాంతం, రాష్ట్రాన్నే జగన్‌రెడ్డి సర్వనాశనం చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో యువత, రైతులు, బీసీలు, ముస్లిం, మైనార్టీలు జగన్ పాలనతో తీవ్రంగా నష్టపోయారు. సైకో జగన్‌కి తెలిసింది రద్దులు, గుద్దులు, నొక్కుడు, బొక్కుడు, కూల్చివేతలు, దాడులే. ఈ ప్రాంతానికి జగన్ ఒక్క మంచిపని చేయలేదు. నంద్యాల జిల్లా అభివృద్ధిపై నందికొట్కూరు నుంచి జగన్‌కు సవాల్ విసురుతున్నా అంటూ చంద్రబాబు తీవ్రస్వరంతో అన్నారు.
ప్రాజెక్టులకు అడ్డంపడిరది జగనే..
‘తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు ముందుకెళ్లాను. భారతదేశానికే సీడ్ క్యాపిటల్‌గా మలచాలని సంకల్పిస్తే, జగన్‌రెడ్డి సర్వనాశనం చేశాడు. రూ.365 కోట్లతో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్ది మీ ఆదాయాన్ని పెంచేలా ప్రణాళిక రూపొందించాం. అమెరికాలోనే బెస్ట్ విద్యా సంస్థ అయోవా యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. నేను ఎంఓయూ కుదిర్చానన్న పగతో జగన్ అడ్డంపడ్డాడు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కాకుండా చేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి. 12 పంపులు పూర్తిచేసి ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరివ్వడానికి శ్రీకారం చుట్టా. ఓర్వకల్లులో పరిశ్రమల కోసం 30,000 ఎకరాల్లో ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలని సంకల్పించాం. విస్పాత్ స్టీల్ సైతం ఓర్వకల్లులో ఏర్పాటు చేశాం. కేవలం ఒక ఏడాదిలోనే ఓర్వకల్లులో విమానశ్రయం నిర్మించిన ఘనత టీడీపీది. ఓర్వకల్లు నుంచి ఎయిర్ కార్గో ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టాను. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్‌ను నందికొట్కూరు ప్రాంతానికి తీసుకొచ్చాం. గాలిమరలు, పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. ఇవన్నీ ఈ ప్రాంతంలో ఏర్పాటైవుంటే హైదరాబాద్‌కి కర్నూలు, నందికొట్కూరు ఒక శాటిలైడ్ టౌన్‌షిప్‌గా తయారయ్యేది. ఇవన్నీ రాకుండా చేసింది రాయలసీమ ద్రోహి జగన్. నందికొట్కూరును నాశనం చేసిన వ్యక్తిని మీరు క్షమిస్తారా?’ అని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు.
కూటమి గెలిస్తే సమృద్ధిగా సాగునీరు
రాయలసీమకు గుండెకాయలాంటి పెనకచర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గాలేరు- నగరి ప్రాజెక్ట్, హంద్రీనీవా, కేసీ కెనాల్, తెలుగుగంగ ఈ ప్రాంతం నుంచే వెళ్తున్నప్పటికీ మీకు నీళ్లు లేవు. మాండ్ర శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి పట్టుదలతో పోరాడారు. శివానందరెడ్డికి న్యాయం చేసే బాధ్యత నాది. జయసూర్యను నందికొట్కూరు ప్రజలు గెలిపించాలి. భారీ మెజార్టీతో నందికొట్కూరు ఆడపడుచు బైరెడ్డి శబరిని గెలిపించి ఢల్లీి పార్లమెంట్‌కు పంపించాలి. నందికొట్కూరులో ఎన్ని వేల మెజార్టీతో టీడీపీని గెలిపిస్తే అందుకు మూడు రెట్ల ఎకరాలకు నీరివ్వాలని శివానాందరెడ్డి కోరుతున్నారు. అభివృద్ధి జరగాలి. సంపద సృష్టించాలి. ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు పంచాలన్నదే నా అభిమతం, నా బ్రాండ్. పది లక్షల ఎకరాల్లో హర్టికల్చర్ అభివృద్ధి చేయడం కోసం డ్రిప్ ఇరిగేషన్ చేయాలని సంకల్పిస్తే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. నాలుగువేల కోట్లతో ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను టీడీపీ ప్రభుత్వంలో అందజేశాం. పాడిరైతుల సంక్షేమానికి గోకుల షెడ్లను నిర్మాణం చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వివరించారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం
రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ప్రజలు గెలవాలి. మీ జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాడ్డాం. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి.. ఐదేళ్ల పాలన తర్వాత ఏం చేయలేనని చేతులెత్తేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది, రాష్ట్రాన్ని ఏస్థితికి తీసుకెళ్లారో. ఐదేళ్ల ముందు మేనిఫెస్టోలో ఏంపెట్టారో ఇప్పుడూ అదే ఉంది. సంపద సృష్టించి.. ఆదాయాన్ని పెంచి టీడీపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపిస్తామని మాటిస్తున్నా. రైతును రాజు చేసేందుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఆర్థిక సాయం చేయడమే కాకుండా రైతు సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటాం.
ఇసుకను దోచుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల బతుకుమీద కొట్టారు. 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచాడు. నిత్యావసరా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలన చేతకాని దద్దమ్మవల్ల అన్ని వ్యవస్థలూ కునారిల్లిపోయాయి. ఈ పరిస్థితి మార్చి చూసిస్తానని హామీ ఇస్తున్నా అని చంద్రబాబు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయని, భవిష్యత్‌లో పెంచబోమన్నారు. ప్రజలే విద్యుత్ తయారు చేసుకునే సౌలభ్యం కల్పించి, మిగులు విద్యుత్ ప్రభుత్వానికి అమ్మేలా చూస్తామన్నారు. సుపరిపాలన ద్వారా మెరుగైన జీవనప్రమాణాలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నిరుద్యోగ ద్రోహి జగన్
జాబ్ క్యాలెండర్, డీఎస్సీ అంటూ యువతను జగన్ మోసం చేశాడని చంద్రబాబు అన్నారు. ఓర్వకల్లులో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకూ చొరవ తీసుకోలేదని, పరిశ్రమలు వచ్చి.. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. నందికొట్కూరు నుంచే ప్రైవేట్ కంపెనీలకు పనిచేసేలా వర్క్ ఫ్రంహోం విధానం తెస్తామన్నారు. నందికొట్కూలో యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశం కల్పించి, వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి ఇస్తామని, ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. డీఏలు, టీఏలు, పీఎఫ్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను గౌరవిస్తామన్నారు.
గులక రాయి డ్రామాను ప్రజలు నమ్మలేదు
గులకరాయితో జగన్ సానుభూతి పొందాలని చూసి విఫలమయ్యాడన్నారు. బాబాయ్‌ని గొడ్డలితో హత్య చేసిందెవరో అందరికీ తెలుసు. న్యాయం అడిగిన వివేకా కూతురు సునీతనే నిందితురాలిగా చేసి కేసులు పెట్టి వేధించే సైకోని చూశారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామా. నేను జగన్‌రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించానని ఆయన సతీమణి భారతి ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. హత్యా రాజకీయాలు జగన్‌రెడ్డి వృత్తి, ప్రవృత్తి. హత్యలు చేసే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా అని చంద్రబాబు హెచ్చరించారు.
రాజకీయ లబ్ది కోసమే కులాల చిచ్చు
అభివృద్ధి చేయకుండా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమవాసిగా సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తున్నానని, జిల్లాలో బోయ, కురబ, వైశ్య, ముస్లిం, ఈడిగ, మాల, మాదిగలకు సమతుల్యతతో టికెట్లు కేటాయించామన్నారు. బలిజకు తిరుపతిలో జనసేన టికెట్ ఇస్తే.. రాయచోటిలో టీడీపీ టికెట్ ఇచ్చాం. రాయలసీమలో బలిజలకు ఒక్క సీటైనా ఇచ్చారా అని జగన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నా? రెడ్లకు కూడా రాయలసీమలో టీడీపీ అన్యాయం చేయలేదు. నంద్యాల ఎంపీ టికెట్ శబరికి, డోన్‌లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి, బీసీ జనార్థన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరితారెడ్డిలకు టికెట్లు ఇచ్చామన్నారు. సామాజిక న్యాయం, సమీకరణలతో టీడీపీ ముందుకెళ్తుంటే జగన్ సామాజిక ద్రోహం చేస్తూ పిల్ల సైకోలను పెంచుతున్నాడు. వైసీపీ పాలనలో ఒక్క రెడ్డికైనా ఉద్యోగం వచ్చిందా? మతాన్ని సైతం సీఎం రెచ్చగొడుతున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు.
ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం. భవిష్యత్తులో కూడా రిజర్వేషన్లు కాపాడతామని బాబు అన్నారు. మసీదుల నిర్మాణానికి టీడీపీ ఆర్థిక సాయం చేస్తే మసీదులు కూలగొడతామని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మైనార్టీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. 1995, 2004, 2014లో ఎన్డీతో పొత్తులో ఉన్నప్పటికీ ఏ ఒక్క ముస్లింకి అన్యాయం జరగలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా, దుల్హాన్ పథకం, విదేశీ విద్యను అమలు చేశాం. మసీదులకు మరమ్మతులు, ఇమామ్‌లు, మౌజన్లకు జీతాలు ఇచ్చాం. ఉర్దూను రెండో భాషాగా చేర్చాం. హౌజ్ హౌస్‌లు కట్టాం. ఉర్దూ యూనివర్సీటీలు పెట్టాం. షాదీఖానాను కట్టాం. మసీదుల మరమ్మతులకు నిధులు విడుదల చేశాం. 36,000 వేల మంది ముస్లిం ఆడబిడ్డలకు రూ.140 కోట్లు ఖర్చు చేసి పెళ్లిళ్లు చేశాం. ముస్లింలు మక్కాకు వెళ్లేందుకు రూ.లక్ష ఆర్థికసాయం చేస్తాం. టీడీపీ ఎల్లప్పుడూ మైనార్టీల కోసం అనేక విధాలుగా కృషి చేసింది. భవిష్యత్తులో మరింత కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. నంద్యాలలో అబ్దుల్ సలాంను దొంగగా చిత్రీకరించి వేధించి ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా చేసింది వైసీపీ కాదా? అని ప్రశ్నించారు. నందికొట్కూరులో ముస్లిం ఆడబిడ్డను దొంగగా చిత్రీకరించి అవమానించారు. నందికొట్కూరులో ముస్లిం ఆడబిడ్డను బురగా తొలగించి చూసి అవమనించడమే కాక.. ప్రశ్నించినందుకు దాడి చేసి దౌర్జన్యం చేశాడొక వైసీపీ నాయకుడు. చట్టాన్ని అతిక్రమిస్తున్న ఇలాంటి వ్యక్తులను కూటమి ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేం బానిసలం కాదు గౌరవంగా బతికే ముస్లింలమని వైసీపీ ప్రభుత్వానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత నాదీ
వాస్తవాలు చెప్పేందికే ఇక్కడికి వచ్చా. మీ పిల్లలు, మీకోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరిసారి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారని ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నా. ప్రతి ఇంటికి కుటుంబ సభ్యుడిగా, మీ పెద్దకొడుకుగా బాధ్యత తీసుకొని మీ అందర్నీ న్యాయం చేయాలనే ఏకైక కోరికతో 40 ఏళ్ల అనుభవంతో 14ఏళ్ల టీడీపీ పాలనలో ఎంత అభివృద్ధి చేశామో.. వచ్చే ఐదేళ్లలో అంత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. అందుకే నిర్ధిష్టమైన ప్రణాళికతో సూపర్ సిక్స్ ప్రకటించాం. సూపర్ సిక్స్ బంపర్ సక్సెస్. జగన్‌రెడ్డి మేనిఫెస్టో అట్టర్ ప్లాప్ అన్నారు.
సూపర్ సిక్స్‌తో ఫలితాల వెలుగులు
సూపర్ సిక్స్ ద్వారా మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 అందజేస్తాం. ఐదేళ్లలో ప్రతి ఆడబిడ్డకు రూ.90 వేలు ఇవ్వబోతున్నాం. తల్లికి వందనం పథకం కింద స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000 ఇస్తాం. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. ప్రజాసపందను కాపాడి అప్పు చేయకుండా సంపద సృష్టించి మీ ఆదాయాన్ని పెంచి మీకు సంక్షేమం అమలు చేస్తాం. సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు లక్షధికారులుగా తయారవ్వడానికి ప్రోత్సహిస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత నాది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.4 వేల పింఛను ఇంటిదగ్గరకే ఇస్తాం. ఐదేళ్లలో వృద్ధులకు రూ.2,40,000 అందజేస్తాం. వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తాం. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు రూ.వెయ్యి అదనంగా కలిపి జూలైలో రూ.7 వేలు పింఛన్ ఇంటివద్దకే అందజేస్తాం. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తాం. వాలంటీర్లకు రూ.10 వేలు గౌరవ వేతనమిస్తాం అని చంద్రబాబు ప్రామిస్ చేశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే మిడుతూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తిచేస్తాం. సిద్ధేశ్వరం హ్యాంగింగ్ బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుడతాం. గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. బుడగజంగాల ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని చంద్రబాబు వరాలు కురిపించారు.