అమరావతి(చైతన్యరథం): వైఎస్సార్ జిల్లా పేరును ‘వైఎస్సాఆర్ కడప జిల్లా’గా మార్చాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు. రాయలసీమలోని కడప జిల్లాకు గొప్ప ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘దేవుని కడప’. ఇక్కడ పర్యటించిన కృపాచార్యులు తిరుమల శ్రీవారి కరుణను పొందారు. అనంతరం కృపాచార్యులు ఈ ప్రాంతానికి కృపావతిగా నామకరణం చేశారు. కృపావతి కురుపగా, కుడపగా తదనంతరం కడపగా ప్రసిద్ధిగాంచింది. అవగాహనా రాహిత్యంతో గత ప్రభుత్వం వైఎస్సాఆర్ జిల్లాగా పేరు మార్చింది. శ్రీవారి భక్తుల మనస్సులు నొచ్చుకున్నా భయంతో తమ అభిప్రాయాల్ని ఎవరూ వ్యక్తపరచలేదు. ఈ అంశంపై గతంలో నేను శాసనసభలోనూ ప్రస్తావించాను. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యమున్న దీన్ని ‘వైఎస్సార్ కడప జిల్లా’గా గెజిట్లో మార్పు చేయాలని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.