- అన్ని దారులు పోలిపల్లి వైపే!
- కదనోత్సాహంతో కదులుతున్న టీడీపీ-జనసేన శ్రేణులు
- ఇదే వేదిక నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్న అధినేతలు
నెల్లిమర్ల/పోలిపల్లి: రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం-నవశకం బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారథులు హాజరుకానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు విజయనగరం జిల్లా, పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడిరది. రాష్ట్ర చరిత్రలో నభూతో నభవిష్యతి అనే చందంగా ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యువగళం-నవశకం సభ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది.
బెడిసికొట్టిన సర్కారు కుట్ర
సభకు జనం రాకుండా చేసేందుకు ప్రభుత్వం అన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇందుకోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు. దీంతో సభను విజయవంతం కాకుండా చేయాలను కున్న ప్రభుత్వ కుట్ర బెడిసికొట్టినట్లయింది. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ వేదికపై నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించ నుండటంతో దీనిపై రాష్ట్ర, జాతీయ మీడియా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారు.
సభా ప్రాంగణ ఏర్పాట్లు…
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై మాట్లాడటం ఇదే ప్రథమం. పెద్దఎత్తున ఇరు పార్టీల శ్రేణులు హాజరవనున్న నేపథ్యంలో 110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది ఆసీనులవనున్నారు. సభ ఎదురు వీఐపీలు కూర్చుంటారు. సభ వీక్షించేందుకు కుర్చీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు 2, విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు 2 భారీ పార్కింగ్ లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఈ నవశకం బహిరంగ సభ ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక కావడంతో టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సభాప్రాంగణం వద్ద పండుగ వాతావరణం
పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. విశాఖపట్నం-విజయనగరం మధ్య కట్టిన భారీ కటౌట్లు, జండాలతో ఆ ప్రాంతమంతా పసుపుజాతరను తలపిస్తోంది.